Tummala Nageswara Rao: కేంద్రం మెడలు వంచైనా యూరియా తెస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తెలిపారు. అధికారం కోల్పోయిన పార్టీలు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తుతాం బటన్లు నొక్కుతామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) సోయి లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు అధికారం పీకేసిన పార్టీలు పెత్తనం చేస్తామంటే అపహాస్యంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయ స్వార్థంతో బీఆర్ఎస్, బీజేపీలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా రైతాంగం కోసం పార్టీలు పని చేయాలని సూచించారు. రష్యా ఉక్రెయిన్, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధాల వల్ల రెడ్ సీ లో నౌకాయానం నిలిచి ఇంపోర్ట్ యూరియా(Urea) సరఫరాలో జాప్యం జరిగిందన్నారు.
చైనా నుంచి ఇంపోర్ట్ కావల్సిన యూరియాను తెప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూరియా కోసం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినా సహకారం కరువైందన్నారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తేనే ఈ వారంలో 50 వేల మెట్రిక్ టన్నులు యూరియా ఇస్తామని కేంద్రం ఒప్పుకుందని చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా యూరియా సరఫరాపై చొరవ తీసుకోవాలని కోరారు. గత ఐదు నెలలుగా లోటు సరఫరా చేసిన యూరియా కూడా అందించాలని కోరారు. దేశ వ్యాప్తంగా యూరియా సరఫరా సమస్యలు ఉంటే తెలంగాణలో మాత్రమే సమస్య ఉన్నట్లు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యూరియా(Urea) సరఫరాపై చొరవ తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్
రైతులకు యూరియా స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలిసేలా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి సూచించారు. యూరియా లభ్యతపై జిల్లా వ్యవసాయ అధికారులతో గురువారం వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియా నిలువలను కూడా రైతులకు అమ్మే విధంగా చూడాలని, క్యూ లైన్ లేకుండా చూడాలని ఆదేశించారు.
పీఎం, కేంద్రమంత్రులకు లేఖలు
పంటల ఉత్పాదకతలో ఆధునిక సాగు పద్ధతులు రైతాంగం అమలు చేయాలంటే వ్యవసాయ యాంత్రీకరణ దిశగా ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. వ్యవసాయ యంత్రాలు పరికరాల కేంద్రం 12 శాతం జీఎస్టీ విధించడంతో ఆర్థిక భారంగా మారిందన్నారు. సన్నకారు రైతులు వ్యవసాయ పరికరాలు కొనే స్థోమత లేక సాగు యాజమాన్య పద్ధతులు పాటించ లేక దిగుబడులు తక్కువగా ఉండడం సాగు పెట్టుబడులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. యంత్రాలపై 12 శాతం జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖలు రాశారు.
Also Read: Komatireddy venkat reddy: లక్షల కోట్లు అవినీతి చేసిన వాళ్లు నీతులు చెప్తారా?.. మంత్రి ఫైర్?