SC on Stray Dogs: వీధి కుక్కలను దిల్లీ విధుల నుంచి ఖాళీ చేయించాలని ఇటీవల సుప్రీం కోర్టు (Suprem Court) ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలపై జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు సెలబ్రిటీలు సైతం సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. తీర్పును పునః సమీక్షిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం వీధి కుక్కల విషయమై మరోమారు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. గత తీర్పును సవరిస్తూ కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
కోర్టు ఏం చెప్పిందంటే?
వీధి కుక్కల అంశంపై న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. వీధి కుక్కల షెల్టర్ల నుంచి బయట వదిలిపెట్టవచ్చని పేర్కొంది. అయితే ఇలా చేసే ముందు వాటికి టీకాలు వేయాలని సూచించింది. ఆ తర్వాతనే తీసుకొచ్చిన ప్రాంతాల్లో వాటిని వదిలివేయవచ్చని స్పష్టం చేసింది. దూకుడు స్వభావం కలిగిన శునకాల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. వాటితో పాటు రాబిస్ లక్షణాలు ఉన్న వాటికి తప్పనిసరిగా టీకాలు వేయాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది.
‘రోడ్లపై ఆహారం పెట్టవద్దు’
వీధి కుక్కలకు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆహారం పెట్టవద్దని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) ప్రత్యేకంగా ఆహారం పెట్టే ప్రదేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రోడ్లపై కుక్కలకు ఆహారం పెడుతున్నవారిపై చర్యలు తీసుకోబడతాయని కోర్టు హెచ్చరించింది. అలాగే కుక్కలకు ఆహారం పెట్టడానికి ఏర్పాటైన ప్రదేశాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని.. ఇక్కడ మాత్రమే ఆహారం పెట్టాలని జంతు ప్రేమికులకు తెలియజేయాలని సూచించింది. ప్రతీ మున్సిపల్ వార్డ్ లో కుక్కల సంఖ్య, వాటి సమీకరణను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ అధికారులు ఆహారం పెట్టే ప్రదేశాలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేసింది.
గత తీర్పు ఏంటంటే?
ఆగస్టు 11న వీధి కుక్కల అంశంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జె.బి. పార్డివాలా, ఆర్. మహాదేవన్‌ల బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. 8 వారాల్లో దిల్లీ-ఎన్సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. దిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న కుక్క కాట్లు, రేబీస్ కేసులు, మరణాలు దృష్టిలోకి ఉంచుకొని ఈ తీర్పు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియకు ఎవరు ఆటంకం కలిగించవద్దని న్యాయస్థానం హెచ్చరించింది. 2024లో కనీసం 37 లక్షల కుక్క కాట్ల కేసులు, 54 రేబీస్ అనుమానిత మరణాలు నమోదయ్యాయని ఆ సందర్భంగా కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
సుప్రీం తీర్పుపై వివాదం..
అయితే ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. జంతు హక్కుల సంఘాలు, సినీ ప్రముఖులు సహా పలువురు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇంత పెద్ద ఎత్తున కుక్కలను ఉంచడానికి అవసరమైన సదుపాయాలు దిల్లీలో లేవని, ఆర్థికంగా కూడా ఇది మున్సిపల్ సంస్థలకు భారం అవుతుందని వాదించారు. ఈ విమర్శలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయి.. ఆగస్టు 11 ఉత్తర్వును మరో బెంచ్ పునఃసమీక్ష చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే తాజా తీర్పు వెలువడటం గమనార్హం.
Also Read: MP Strange Incident: పక్కవారికి రెండు లడ్లు ఇచ్చి.. తనకు ఒక్కటే ఇచ్చారని.. ఏకంగా సీఎంనే..
దిల్లీలో లక్షపైనే.. ఇతర రాష్ట్రాల్లో..
2023 నవంబర్ నాటి గణాంకాల ప్రకారం ఢిల్లీలో 55,000 కుక్కలు ఉన్నట్లు అంచనా. అయితే ఆ తర్వాత కుక్కలకు సంబంధించిన డేటా విడుదల కాలేదు. దిల్లీ ప్రజల అభిప్రాయం ప్రకారం.. నగరంలో కుక్కల సంఖ్య లక్ష దాటి ఉండొచ్చని చెబుతున్నారు. 2023 నవంబర్ లో విడుదలైన జంతు సంరక్షణ శాఖ నివేదిక ప్రకారం.. భారతదేశంలో సుమారు 1.53 కోట్లు వీధి కుక్కలు సంచరిస్తున్నాయి. ఆ నివేదిక ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో దేశంలోనే అత్యధికంగా 20,59,261 కుక్కలు ఉన్నాయి. ఒడిశాలో (17,34,399 కుక్కలు) మహారాష్ట్ర (12,76,399), రాజస్థాన్ (12,75,596) కర్ణాటక (11,41,173) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.దేశంలోని మెట్రో నగరాల్లో కుక్కల సంఖ్య విషయానికి వస్తే కర్ణాటకలోని బెంగళూరు టాప్ లో ఉంది. అక్కడ 1,36,866 కుక్కలు జీవిస్తున్నాయి. తరువాత ఢిల్లీ (55,462), ముంబై (50,799), చెన్నై (24,827), కోల్‌కతా (21,146), హైదరాబాద్ (10,553) నిలిచాయి. ఈ గణాంకాలు చూస్తే దేశంలో వీధి కుక్కల నియంత్రణ ఎంత పెద్ద సవాలుగా మారిందో అర్థమవుతోంది.