Jaishankar Putin Meet: రష్యా నుంచి ముడిచమురు కొనుగోలును కారణంగా చూపి భారత దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, రష్యా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. భారత విదేశాంగ విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం మాస్కో నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను (Jaishankar Putin Meet) కలిశారు. మూడు రోజుల రష్యా పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లిన జైశంకర్.. కీలక అంశాలపై పుతిన్‌తో చర్చించారు.
పుతిన్‌తో భేటీ అనంతరం జైశంకర్ కీలక విషయాలు వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధంపై ఆలోచనలను పంచుకున్నందుకు పుతిన్‌ను జైశంకర్ అభినందించారు. ‘‘ఇవాళ (ఆగస్టు 21) రష్యా ప్రెసిడెంట్ అధికారిక నివాసం క్రెమ్లిన్‌లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడం నాకు చాలా గౌరవంగా అనిపిస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరపున హార్దిక శుభాకాంక్షలు తెలిపాను. రష్యా తొలి ఉపప్రధాని డెనిస్ మాంటురోవ్, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్‌లతో జరిగిన చర్చల వివరాలను కూడా పుతిన్‌తో పంచుకున్నాను. ఇక వార్షిక శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌పై, తాజా అంతర్జాతీయ పరిణామాలపై పుతిన్ ఆలోచనలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అంటూ జైశంకర్ ట్వీట్ చేశారు. పుతిన్‌తో భేటీకి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు.
Read Also- Miyapur Sad News: కుటుంబాన్ని చిదిమేసిన ఆర్థిక సమస్యలు.. రెండేళ్ల చిన్నారికి అన్నంలో..
పుతిన్‌తో భేటీకి ముందు కూడా విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్-రష్యా సంబంధాలపై స్పందిస్తూ, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య బంధం మరింత స్థిరమైందని అభివర్ణించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరుదేశాల నాయకుల చొరవతోనే ఈ సంబంధం ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’గా మెరుగుపడిందని ఆయన పేర్కొన్నారు.
కాగా, రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్ మద్దతిస్తోందని అమెరికా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత కంపెనీలతో మరింత దృఢంగా పనిచేయాలంటూ రష్యా కంపెనీలకు జైశంకర్ పిలుపునిచ్చారు. భారత-రష్యా వాణిజ్యాన్ని మరింత ఉన్నత స్థితికి చేర్చాలని సూచించారు. మాస్కోలో రష్యా ఉపప్రధాని డెనిస్ మాంటురోవ్‌తో భేటీ సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరించాలని, వివిధ రంగాలకు విస్తరించాలని పేర్కొన్నారు.
Read Also- Diwali Special Trains: దీపావళి సమీపిస్తున్న వేళ ఇండియన్ రైల్వేస్ గుడ్‌న్యూస్
దిగుమతి సుంకాలు, సుంకాలేతర పరిమితులు తొలగించాలని, రవాణాలో ఉన్న ఆటంకాలను కూడా అధిగమించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్, నార్తెర్న్ సీ రూట్, చెన్నై-వ్లాదివోస్టక్ కారిడార్ ద్వారా కనెక్టివిటీ పెంచాలని పిలుపునిచ్చారు. ఇక, ఇరుదేశాల మధ్య చెల్లింపుల వ్యవస్థలు కూడా సులభంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఇరుదేశాల మధ్య బంధాలు బలపడడంలో ఈ అంశాలు చాలా ముఖ్యమైనవని ఆయన అభివర్ణించారు.