Viral Video: తమిళనాడుకు చెందిన ఓ లేగ దూడ (Bull Calf) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చెన్నైలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో జీవించే ఈ దూడకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. 3 నెలల వయసున్న ఈ లేగ దూడకు సంబంధించిన స్టోరీని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పంచుకోగా.. అది ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఒక్క పోస్టుతో వైరల్!
చెన్నైలోని ఓ హైరైజ్ అపార్ట్‌మెంట్ 28వ అంతస్తులో ఈ 3 నెలల దూడ జీవిస్తోంది. దీని పేరు ‘మిస్టర్ అలెక్స్’ (Mr Alex). ఆర్కిటెక్చరల్ డిజైనర్ తేజస్విని ఎస్. రంగన్ (Thejaswini S Rangan) ఈ దూడను నెల వయసు ఉండగా చూసింది. గాయపడిన స్థితిలో ఉన్న దూడని చేరదీసి సంరక్షించింది. ఈ లేగదూడకు సంబంధించిన తొలి వీడియోను ఆగస్టు 8న జంతు సంరక్షకుడు సాయి వినేశ్ (Sai Vinesh) తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ వీడియోకు ‘అలెక్స్! ఫ్లాట్‌లో జీవిస్తున్న దూడ’ అనే శీర్షిక పెట్టాడు. అప్పటి నుండి ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది.
అలెక్స్ జీవనశైలి
అలెక్స్ కు కౌగిలింతలంటే చాలా ఇష్టమని వైరల్ అవుతున్న వీడియో తేజస్విని చెప్పారు. అపార్ట్‌మెంట్ బాల్కనీలో కూర్చుని ఎదురుగా కనిపించే సముద్రాన్ని ఎంతో ఆనందంగా తిలకిస్తుందని పేర్కొన్నారు. భోజన సమయాల్లో అలెక్స్ కు కుక్క తోడవుతుందని తెలిపారు. అయితే అలెక్స్ కు తలని కాస్త వంచి కూర్చునే అలవాటు ఉందని చెప్పారు. తమిళ సినిమా ‘అలెక్స్ పాండియన్’ లో రజనీ పాత్ర కూడా అలాగే ఉండటంతో లేగదూడకు ఆ పేరు పెట్టినట్లు తేజస్వినీ వివరించారు.
ఆన్‌లైన్‌లో ప్రశంసల వర్షం
మిస్టర్ అలెక్స్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో దానిని పెంచుకుంటున్న తేజస్వినీపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. జంతువుల పట్ల ఆమెకు ఉన్న దయ, ప్రేమను అభినందిస్తున్నారు. ‘మిస్టర్ అలెక్స్ చాలా అందంగా ఉన్నాడు. మీరు చేసిన సేవ అద్భుతం. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి’ అని ఓ యూజర్ అన్నారు. మరొకరు స్పందిస్తూ ‘పెంపుడు జంతువు అంటే కుక్కలు, పిల్లులు మాత్రమే కాదని ఆమె రుజువు చేశారు. జంతువులన్నీ చిన్నారుల వంటివే’ అని కామెంట్ పెట్టారు. ‘ఈ ప్రపంచంలో మీలాంటి జంతు ప్రేమికులు ఉండటం నిజంగా ఆనందకరం’ అని ఇంకొకరు రాసుకొచ్చారు. అయితే మరికొందరు యూజర్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. లేగదూడ పెద్దయ్యాక.. ఫ్లాట్, ఎలివేటర్ లో సరిపోకపోతే పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Gnanesh Mandapam Permission: గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి!
ప్రత్యేక జీవనశైలి
సాధారణంగా చెన్నైలోని లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్ వంటి హైఎండ్ సౌకర్యాలు కలిగి ఉంటాయి. అలాంటి చోట లేగదూడ జీవించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. అందులోనూ 28వ అంతస్తులోని ఫ్లాట్ లో అది పెంపుడు జీవిగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి ఘటనను తామెక్కడ చూడలేదని జంతు ప్రేమికులు సైతం అభిప్రాయపడుతున్నారు. లేగ దూడ ప్రత్యేకమైన జీవనశైలికి ఫిదా అవుతున్నారు.
View this post on Instagram