PM Modi on Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని (Rahul Gandhi) ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi on Rahul Gandhi) మరోసారి పదునైన విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో కొందరు ప్రతిభావంతులైన యువ నాయకులు ఉన్నారని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో యువ నేతలు ఉన్నారని, కానీ, ‘కుటుంబ అభద్రతాభావం’ కారణంగా సభలో వారికి మాట్లాడే అవకాశం దక్కడంలేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇంతటి టాలెంట్ ఉన్న యువ నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉండడం బహుశా రాహుల్ గాంధీకి అభద్రతాభావాన్ని కలిగిస్తుండొచ్చని, ఆందోళనకు గురవుతుండొచ్చని అన్నారు. ఈ మేరకు ఎన్డీఏ నేతలతో జరిగిన తేనీటి సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
మోదీ కీలక వ్యాఖ్యలు చేసిన ఈ భేటీకి విపక్షాలకు చెందిన ప్రతిపక్ష నేతలు ఎవరూ హాజరుకాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం కేవలం ఎన్డీయే నేతలకు సంబంధించినది అని సమాచారం. ఈ పార్లమెంట్ సమావేశాలు ఉత్తమమైనవిగా ప్రధాని మోదీ ఇటీవలే అభివర్ణించారు. కొన్ని కీలకమైన బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా ఆన్‌లైన్ గేమింగ్ బిల్‌ను మోదీ ప్రస్తావించారు. జనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే బిల్లు ఇదని, సుధీర్ఘ చర్చకు ఈ బిల్లు అర్హతగలిగిదని, ఎంతో ప్రాధాన్యత కలిగిన చట్టంగా మోదీ అభివర్ణించారు. అయితే, ముఖ్యమైన చర్చల్లో విపక్ష సభ్యులు పాల్గొనలేదని, పైగా అంతరాయాలు కలిగించారంటూ విపక్షాలపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.
కాగా, 2025 ఆగస్టు 20న పార్లమెంట్‌లో ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్, 2025’ ఆమోదం పొందింది. డబ్బుతో ముడిపడిన ఆన్‌లైన్ గేమ్స్‌పై ఈ బిల్లు నిషేధం విధిస్తోది. అంతేకాదు, చట్టపరమైన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, వాటి ప్రమోటర్లు, ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులకు కఠినమైన శిక్షలు విధించే విధంగా ఈ చట్టంలోని నిబంధనలు రూపొందించారు.
ఆన్‌లైన్ గేమింగ్ దేశంలో వేగంగా విస్తరిస్తుండడం, తీవ్ర వివాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో నియంత్రణ దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే, ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (AIGF) ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ కూడా రాసింది. ఈ బిల్లుపై తమను తక్షణ జోక్యం చేసుకోవాలని కోరింది. డబ్బుతో ముడిపడి ఉన్న ఆన్‌లైన్ గేమ్స్‌ను సంపూర్ణంగా నిషేధిస్తే ఈ రంగానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని లేఖలో పేర్కొంది. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత చట్టంగా మారనుంది.