Toddy Adulteration: జోగులాంబ గద్వాల జిల్లాలో కల్తీ కల్లు మాఫియా రాజ్యమేలుతోంది. జిల్లాలో తాటి, ఈత చెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయినా కల్లు మాత్రం ఊరూరా లభిస్తోంది. ఇంత కల్లు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరూ ఆలోచించడం లేదు. దీంతో చెట్ట కల్లు స్థానంలో రసాయనాలతో చేసిన కల్తీ కల్లు రాజ్యమేలుతోంది. తాటి, ఈత చెట్ల నుంచి తీసే నీరా, కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నా…కానీ నేడు కల్తీ కల్లు తాగి ఆస్పత్రి పాలై ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు తెలంగాణలో తరచూ వెలుగుచూస్తున్నాయి.
“క్లోరాల్ హైడ్రేట్, డైజోఫామ్, క్లోరోఫామ్, ఆఫ్రాజోలం” వంటి రసాయనాలు చాలా అత్యంత విషపూరితమైనవి అని కల్లు తయారీకి ఉపయోగిస్తున్నారని తెలిసినా కూడా జిల్లా ఎక్సైజ్ శాఖ తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా బహిరంగానే కల్తీకల్లు తయారు చేసి విక్రయాలు చేస్తున్న ఉన్నతాధికారులకు ఒక ప్యాకేజీ, కింది స్థాయి ఉద్యోగులకు మరో ప్యాకేజీ చొప్పున వాటాలు ఇస్తూ యథేచ్చగా తమ కల్తీ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. దీంతో కల్లు ప్రియుల జేబులు గుల్లవడమే కాకుండా ఆరోగ్యం పాడవ్వడమే కాక వారి ప్రాణాల మీదకు తెస్తోంది. రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
Also Read: Jogulamba Gadwal: యూరియా కోసం రైతుల అవస్థలు.. పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారన్న ఆరోపణలు
చెట్టు కల్లు స్థానంలో చేతి కల్లు..
సహజంగా తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే కల్లు జిల్లాలోని కల్లు తయారీ కేంద్రాలు, కల్లు దుకాణా లు, కల్లు వనాలు, కంపౌండ్‌లలో అమ్మకాలు జరగాలి. అయితే, దీనికి విరుద్ధంగా సహజ కల్లుకు బదులు క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫ్రాజోలం వంటి నిషేధిత మత్తు పదార్థాలను కలిపి కృత్రిమ కల్లును తయారు చేస్తున్నారు.
జోరుగా కల్తీ కల్లు అమ్మకాలు…
జిల్లాలో మొత్తం 100 కల్లు సొసైటీలు ఉండగా గద్వాల నియోజకవర్గంలో 70, అలంపూర్(*Alampur) 30 కల్లు సొసైటీలు ఉన్నాయి.వాటి నిర్వహణపై ఎక్సైజ్ అధికారులు తగిన దృష్టి సారిస్తున్నారా అనే అనుమానాలు జనంలో నెలకొన్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో కల్తీ కల్లు(Adulterated toffee) విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలసిన బెల్ట్ షాప్‌లలో లూజ్ విక్రయాల పేరుతో కల్తీ కల్లు అమ్మకాలు జరుగుతున్నాయని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ, అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రమైన గద్వాలతో పాట అలంపూర్ నియోజకవర్గంలో ఇల్లీగల్ కల్లు దుకాణాలు పెద్ద సమస్యగా మారింది.
నాణ్యమైన కల్లు ఏది
ప్రజలకు నాణ్యమైన చెట్టు కల్లును మాత్రమే విక్రయించాలి. అయితే చాలా చోట్ల అలా జరగడంలేదు. దుకాణాదారుల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో ఒకరిని మించి మరొకరు కల్లు తయారీలో నిషేధిత మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారు. దీంతో జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. ఫలితంగా చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటోంది. మద్యం ధరలు పెరగడంతో తక్కువ రేటుకు వస్తున్న కల్లు వైపు జనం మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు ఈ మత్తుకి అలవాటు పడి గ్రామంలోని కల్తీ కల్లు కేంద్రాలలో సేవిస్తూ సేద తీరుతున్నారు, మరికొందరు వారి పిల్లలను దుకాణాల నుంచి తెప్పించుకొని సేవిస్తున్నారు. మత్తుకు ఆకర్షితులవుతున్నారు.
మాఫియా పెత్తనం...
గద్వాల నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల నాయకుల మద్య పోటీతత్వంతో కల్లు విక్రయిస్తున్నారు. వాస్తవానికి కల్లు డిపోలను కల్లుగీతా కార్మికులు మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. సొసైటీలో సభ్యునిగా ఉండి కల్లు దుకాణాలను వేలం పాట ద్వారా పొంది వ్యాపారం నిర్వహిస్తారు. అయితే ఇందుకు విరుద్ధంగా కల్లు గీతాకార్మికులను అణచివేతకు గురి చేస్తూ వారిపై అజమాయిషీ చెలాయిస్తూ కొందరు కల్లు వ్యాపారం సాగిస్తున్నారు. వ్యాపారం, వ్యవహారమంతా బడా నాయకులు చేతిలోకి తీసుకొని లైసెన్సులు మాత్రం కల్లు గీత కార్మికుల పేరు మీద తీసుకోవడం జరుగుతోంది.
అనుమతి లేని దుకాణాలలో కల్తీకల్లు…
జిల్లాలో కొన్ని లైసెన్స్ దుకాణాలు ఉండగా అంతకు రెట్టింపు అనుమతి లేని దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఒకచోట లైసెన్సు దుకాణం ఉంటే దాని కిందే మరో చోట దుకాణం ఏర్పాటు చేసి యథేచ్ఛగా కల్లు అమ్ముతున్నారు. ఒక విధంగా మద్యం బెల్టు దుకాణాల మాదిరిగా కల్లు దుకాణాలు సైతం వెలుస్తున్నాయి. ఇలాంటి దుకాణాల్లో వారు అమ్మిందే కల్లు అనే రీతిగా కల్తీకల్లు అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నిద్రమత్తులో ఎక్సైజ్ అధికారులు…
జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఎక్సైజ్ అధికారుల పనితీరు కొందరు రాజకీయ, మాఫీయా చేతుల్లో ఉందని, వారి ఉదాసీన వైఖరే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. నెలనెలా మామూళ్ల మత్తులో ఉండి కల్తీ కల్లు దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఇష్టానుసారంగా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఒకవేళ అధికారులు తనిఖీలకు వస్తున్నారంటే ముందస్తుగా వ్యాపారులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకించి ఒక విభాగం ఉందని బాహాటంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.
అనుమతి లేకుండానే : ఆబ్కారీ శాఖ నుంచి
లైసెన్స్లు పొందిన వారే కాకుండా అనుమతుల్లేకుండా కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్నట్లు, అనుమతి లేని కల్లు దుకాణాలపై అబ్కారీ శాఖ అధికారులు చర్య లు తీసుకోకపోవడం శోచనీయం . వాటిలో కల్తీ కల్లు విక్రయాలే అధికంగా జరుగుతున్నట్లు తెలిసింది. కల్తీ కల్లు తయారీదారులు కోరల్ హైడ్రేట్, ఆల్ఫ్రాజోలం, బెంజోడైపోజైన్, రుచికోసం సాక్రిన్ తదితర రసాయనాలను కర్ణాటక, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం.
నిరంతరం తనిఖీలు..: గద్వాల ఎక్సైజ్ శాఖ అధికారి గణపతి రెడ్డి
జిల్లాలోని కల్లు సొసైటీలతో పాటు కల్లు దుకాణాల్లో అధికారులు, సిబ్బందితో కలిసి నిరంతరం తనిఖీలు చేస్తున్నాం.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. రంగంలోకి కలెక్టర్.. డ్రైవర్ దందాలకు చెక్!