Rajnath Singh – Sonia Gandhi: ఉపరాష్ట్రపతి ఎన్నికకు సమయం ఆసన్నమవుతుండడంతో ఎన్డీయే కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన గెలుపు లాంఛనమే అని సమీకరణాలు చెబుతున్నప్పటికీ, అభ్యర్థిగా ఖరారైన సీపీ రాధాకృష్ణన్ విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏకాభిప్రాయం సాధించడం ద్వారా ఓటింగ్ లేకుండానే తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.
ప్రతిపక్ష నాయకులతో ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌లతో ఆయన ఫోన్ చేసి (Rajnath Singh – Sonia Gandhi) మాట్లాడారు. సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారమే ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. రాబోయే ఈ రెండు మూడు రోజుల్లో కూడా మరికొన్ని విపక్ష పార్టీల నేతలతో ఆయన సంప్రదింపులు జరపనున్నారని తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక అభ్యర్థి సీపీ. రాధాకృష్ణన్‌పై ఏకాభిప్రాయం సాధించే బాధ్యతను అధిష్టానం రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. ఈ ఎన్నికను బీజేపీ తరఫున ఆయనే పర్యవేక్షించనున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరించనున్నారు.
Read Also- New GST Rates: కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే.. ధరలు తగ్గే వస్తువులు ఇవే
బీజేపీ అభ్యర్థిని స్వాగతించిన ఎన్డీయే పార్టీలు
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన సీపీరాధాకృష్ణన్‌ను కూటమిలోని ఇతర పార్టీలు స్వాగతించాయి. తెలుగు దేశం పార్టీ, ఎల్‌జేపీలు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేయడాన్ని ఆహ్వానించాయి. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. ఆయన ఓ సీనియర్ రాజనీతిజ్ఞుడు అని, గౌరవనీయమైన నాయకుడు అని కొనియాడారు. దేశానికి చాలకాలంపాటు విశిష్ట సేవలు అందించారని మెచ్చుకున్నారు. ఆయన నామినేషన్‌ను తెలుగుదేశం పార్టీ సంతోషంగా స్వీకరిస్తోందని, సంపూర్ణ మద్దతు ఇస్తోందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇక, లోక్‌జన శక్తి పార్టీ (LJP) చిరాగ్ పాస్వాన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ఎప్పటికప్పుడు సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ ఎన్డీయే సంకల్పానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమి కీలక భేటీ
ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించేందుకు విపక్షాల ఇండియా కూటమి ఇవాళ (సోమవారం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికతో పాటు ఇతర కీలక అంశాలపై కూడా చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. జగదీప్ ధనఖడ్ గత నెలలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుండగా, నామినేషన్లకు చివరి తేదీ ఆగస్టు 21గా ఉంది.