Ganesh Chaturthi 2025: హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతీ పర్వదినం రోజున దేవుడికి తప్పకుండా నైవేద్యం సమర్పిస్తారు. దేవుళ్లకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి.. ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే వినాయక చవితి సందర్భంగానూ గణనాథుడికి ఎన్నో రకాల పండివంటకాలు సమర్పిస్తారు. వాటిలో ప్రముఖంగా కనిపించేవి ఉండ్రాళ్లు, కుడుములు. వీటిని నైవేథ్యంగా పెట్టడం వెనుక బలమైన కారణాలే ఉన్నట్లు పురాణాల ఆధారంగా అర్థమవుతోంది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
వినాయకుడికి ఇష్టం: సకల విఘ్నాలను తొలగించే దేవుడిగా గణనాథుడ్ని పూజిస్తారు. ఈ క్రమంలోనే కుడుములు, ఉండ్రాళ్లు ఆయనకు ఇష్టమైన నైవేద్యాలుగా చెబుతుంటారు. ఇవి సరళమైన, సాత్వికమైన ఆహారాలు. బియ్యం, బెల్లం, నెయ్యి వంటి సహజ పదార్థాలతో తయారవుతాయి.
పురాణ కథనం: పురాణాల ప్రకారం.. గణేశుడు తన తల్లి పార్వతీ దేవి తయారు చేసిన మోదకాలను (కుడుములు) బాగా ఇష్టపడేవాడని చెబుతారు. ఓ కథ ప్రకారం గణేశుడు మోదకాలను ఎంతో ఆనందంగా తిన్నాడని, ఇది ఆయనకు ఇష్టమైన ఆహారంగా స్థిరపడిందని విశ్వాసం.
సాత్వికత: కుడుములు, ఉండ్రాళ్లు ఆవిరితో ఉడికించబడతాయి. నూనె లేదా తామసిక పదార్థాలు (ఉల్లిపాయలు, వెల్లుల్లి) దీని తయారీలో ఉపయోగించరు. కాబట్టి వీటిని పవిత్రమైన నైవేద్యంగా హిందువులు భావిస్తుంటారు.
చరిత్ర, సాంప్రదాయం
❄️ కుడుములు ఉండ్రాళ్ల సంప్రదాయం దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా కనిపిస్తుంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కుడుములను నైవేద్యంగా పెట్టే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఈ వంటకాలు గ్రామీణ సంప్రదాయాల నుండి ఉద్భవించాయి. బియ్యం, బెల్లం, కొబ్బరి వంటి పదార్థాలు సులభంగా లభ్యమయ్యేవి. సామాన్య ప్రజలు వీటిని ఉపయోగించి దేవుడికి నైవేద్యం సమర్పించేవారు.
❄️ వినాయక చవితి, వరలక్ష్మీ వ్రతం వంటి పండుగల్లో ఈ వంటకాలు తప్పనిసరిగా తయారవుతాయి. ఉండ్రాళ్లు, కుడుములను దేవుడికి సమర్పించడం ద్వారా ఆయన ఆశీస్సులు పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు.
కుడుములతో ప్రయోజనాలు
కుడుములు సాధారణంగా బియ్యం పిండి, చనాదాల్, బెల్లం, కొబ్బరి, మరియు ఏలకుల పొడితో తయారవుతాయి. దేవుడికి నైవేథ్యంగా సమర్పించిన అనంతరం వీటిని తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవిరి మీద ఉడికించడం వల్ల కుడుములు తేలికగా జీర్ణమవుతాయి. నూనె లేకుండా తయారవడం వల్ల కొవ్వు తక్కువ. ఇందులోని బియ్యం కార్బోహైడ్రేట్లను, బెల్లం సహజ చక్కెరలను అందిస్తాయి. తద్వారా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. బెల్లంలో ఉండే ఇనుము (ఐరన్) రక్తహీనతను నివారిస్తుంది. కుడుముల తయారీలో ఉపయోగించే చనాదాల్ ప్రోటీన్, ఫైబర్‌ను అందిస్తుంది. తద్వారా జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. కొబ్బరి ఆరోగ్యకరమైన కొవ్వులను, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలు లేకుండా తయారవడం వల్ల శరీరానికి, మనస్సుకు కుడుములు చాలా ప్రయోజనకరం.
Also Read: CM Revanth Reddy: తెలంగాణలోనూ ఓట్ల చోరికి కుట్ర.. వారిని వదిలే ప్రసక్తే లేదు.. సీఎం వార్నింగ్!
ఉండ్రాళ్లతో ప్రయోజనాలు
ఉండ్రాళ్లు బియ్యం పిండి, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌తో తయారవుతాయి. దీనిని తినడం వల్ల శరీరానికి మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే బెల్లం ద్వారా ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి అందుతాయి. ఇవి రక్త సరఫరాతో పాటు ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తాయి. ఉండ్రాళ్లకు కోసం వాడే నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి వేడిని అందిస్తుంది. ఉండ్రాళ్లు తేలికైన ఆహారంగా పరిగణించబడతాయి. ఇవి పండుగ సమయంలో తినడానికి అనుకూలం.