Poll Body Boss: దేశంలో భారీ ఎత్తున ఓట్ల చోరి జరిగిందని విపక్ష ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం, ఇండియా కూటమి నేతల మధ్య కొన్నిరోజులుగా విమర్శల పర్వం నడుస్తోంది. ఈ క్రమంలోని ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనరర్ (CEC Gyanesh Kumar)పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.
నిరూపించగలరా?
పార్లమెంట్‌లో విపక్ష నేతల మధ్య జరిగిన సమావేశంలో సీఈసీపై అభిశంసన అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను తొలగించే ప్రక్రియ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంతో సమానం. అలాంటి తీర్మానం కోసం లోక్‌సభ, రాజ్యసభల్లో రెండొంతుల మెజారిటీ (2/3) ఉండాలి. ‘తప్పు ప్రవర్తన’ లేదా ‘అసమర్థత’ అనే కారణాలు నిరూపించబడినప్పుడే వారు పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం
విపక్షాల అభిశంసన ప్రణాళికపై కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ స్పందించారు. ‘ఆదివారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బీజేపీ ప్రతినిధిలా మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మాకు ఉన్న అన్ని మార్గాలను వినియోగిస్తాం’ అని అన్నారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాజ్యసభ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ఇలాంటి అవివేకుల నుంచి ఇంకేం ఆశించగలం?. వారు సుప్రీంకోర్టు, హైకోర్టులపై కూడా అభిశంసన తీర్మానం ఎందుకు తీసుకురాలేదో ఆశ్చర్యంగా ఉంది’ అని వ్యంగ్యంగా అన్నారు.
ఈసీ చీఫ్ ఏమన్నారంటే?
ఓట్ల చోరీ జరిగందంటూ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆదివారం సీఈసీ జ్ఞానేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇండియా కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ‘ఓటు దొంగతనం’ వ్యాఖ్య చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై స్పందిస్తూ.. ‘ఇలాంటి అనుచిత పదజాలం వాడటం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే’ అని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ను రాజకీయ ఉద్దేశాల కోసం వేదికగా వాడుతున్నారని.. అయితే ఈసీ ఎల్లప్పుడూ ఓటర్ల పక్షానే నిలుస్తుందని స్పష్టం చేశారు. ‘మాకు ప్రతి పార్టీ సమానమే. అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య మేము తేడా చూపించము’ అని జ్ఞానేష్ కుమార్ చెప్పుకొచ్చారు.
రాహుల్ ఆరోపణలు ఏంటంటే?
అంతకముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల మోసం జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం ఆయన బిహార్‌లో ‘వోటర్ అధికార్ యాత్ర’ సైతం చేపట్టారు. ఈ యాత్ర 20 జిల్లాల్లో 1,300 కి.మీ. మేర సాగనుంది. బిహార్‌లో అధికార బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓటర్ల జాబితాలో సవరణలు చేసిందని కాంగ్రెస్, ఆర్‌జేడీ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
Also Read: Putin Bodyguards: స్పెషల్ బ్రీఫ్ కేసులో పుతిన్ మలం.. భద్రంగా తీసుకెళ్లిన బాడీగార్డ్స్.. ఎందుకంటే?
జ్ఞానేష్ కుమార్ రియాక్షన్
రాహుల్ గాంధీ విమర్శలకు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ ‘లోక్‌సభ ఎన్నికలంటే వేలాది మంది అధికారులు, 10 లక్షల బూత్ స్థాయి ఏజెంట్లు, 20 లక్షలకుపైగా పోలింగ్ ఏజెంట్లు పని చేస్తారు. ఇంత మంది ముందు ఎవరు ఓట్లు దొంగలించగలరు? డబుల్ ఓటింగ్ జరిగిందని కొందరు చెప్పారు. కానీ ఆధారాలు అడిగితే ఏమీ ఇవ్వలేదు. ఇలాంటి ఆరోపణలు ఎన్నికల కమిషన్‌ను కానీ, ఓటర్లను కానీ భయపెట్టవు’ అని పేర్కొన్నారు. మరోవైపు మహదేవపుర ఆరోపణలపై కర్ణాటక ఎన్నికల కమిషన్.. రాహుల్ గాంధీకి ప్రమాణ పత్రం ఇవ్వమని, చెప్పిన అక్రమాలను అఫిడవిట్ రూపంలో సమర్పించమని చెప్పింది. అయితే దీనిని రాహుల్ గాంధీ తిరస్కరించారు. తాను చెప్పిన డేటా ఎన్నికల కమిషన్‌దేనని తనది కాదని అన్నారు.