Bhadradri Kothagudem District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని తోగ్గూడెం క్వారీలను కొంతమంది అక్రమార్కులు యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. ఇక్కడ సుమారు పది క్వారీలు ఉన్నా, వాటిని నడిపే మాఫియా(Mafia) రాయుళ్లు నిబంధనలకు పాతరేసి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు
అవినీతి మత్తులో మైనింగ్ శాఖ..
మైనింగ్ శాఖ అవినీతి మత్తులో జోగుతున్నట్లు తెలుస్తుంది. గతంలో కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలతో కలెక్టర్(Collector) ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేని క్వారీలను సీజ్ చేయడం, కరెంట్(Current) కనెక్షన్లు తొలగించడం, జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకున్నా, ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు అక్రమార్కులు జనరేటర్ల సాయంతో రాత్రివేళల్లో మైనింగ్ దందా కొనసాగిస్తున్నారని సమాచారం. కోట్ల రూపాయలు దండుకుంటున్న ఈ మాఫియా(Mafia) వెనుక అధికారుల అండ ఉందని, ముడుపులు ముట్టడంతోనే వారు వెనుదిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అర్ధరాత్రి బాంబుల మోత..
తోగ్గూడెం ప్రజలు అర్ధరాత్రి బాంబుల మోతతో బెంబేలెత్తిపోతున్నారు. చిన్న పిల్లలు సైతం ఉలిక్కిపడి భయపడుతున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. బాంబు పేలుళ్ల వల్ల ఇళ్ల గోడలకు బీటలు పడుతున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. అంతేకాకుండా, పదుల సంఖ్యలో లారీలు తిరగడం వల్ల ప్రజలు రాత్రివేళల్లో బయటకు రావాలంటే భయపడుతున్నారు.
బినామీ పేర్లతో దందా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ గిరిజనుల పేరుతో బడాబాబులు క్వారీలను నిర్వహిస్తున్నారు. కొందరు అమాయక గిరిజనులను బినామీలుగా పెట్టి, ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టలను తవ్వేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి మైనింగ్ మాఫియా(Mining mafia) తమ అక్రమ దందాను కొనసాగిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని, ఏజెన్సీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్న బడాబాబులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Also Read:Independence Day: తొర్రూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజే జాతీయ జెండాకు అవమానం