CP Radhakrishnan: వచ్చే నెలలో జరగబోయే భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో దిగబోయే ఎన్డీయే అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఖరారయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం ఇవాళ (ఆగస్టు 17) అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు. ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ప్రముఖ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరు ప్రకటించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. రాధాకృష్ణన్‌కు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, అనేక పదవుల్లో పని చేశారని గుర్తుచేశారు. ఎన్డీఏ మిత్రపక్షాలతో భేటీ అయిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు.
రాధాకృష్ణన్ గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా, పుదుచ్చేరి అదనపు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ జీవితం విషయానికి వస్తే, కోయంబత్తూరు నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ తమిళనాడు విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇటీవల జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబర్ 9న జరిగే ఎన్నికలో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ఆగస్టు 2027 వరకు పదవిలో ఉంటారు.
వ్యూహాత్మక ఎంపిక!
తమిళనాడుకు చెంది సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక బీజేపీ రాజకీయ ఎత్తుగడ ఉందంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా, వచ్చే జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. తమిళనాడు నేపథ్యం ఉన్న వ్యక్తిని ఎంచుకోవడానికి ఇదే కారణమంటూ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీపీ రాధాకృష్ణన్ ఎంపిక ద్వారా తమిళులు ఒక సానుకూల సందేశాన్ని ఇచ్చినట్టుగా కమలనాథులు భావిస్తున్నారు. రాష్ట్రంలో బలం పెంచుకునే ప్రక్రియలో ఇదొక వ్యూహంగా చూస్తున్నారని అంటున్నారు.
సీపీ రాధాకృష్ణన్ ఎంపిక ద్వారా, ఇప్పటివరకు రాష్ట్రంలో ఆధిపత్యాన్ని చూపుతున్న ద్రవిడ పార్టీలకు (డీఎంకే, అన్నాడీఎంకే) బీజేపీ సవాలు విసురుతోందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా కారణంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఆయన స్థానంలో రాధాకృష్ణన్ చక్కటి ఎంపిక అని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ఇక, సీపీ రాధాకృష్ణకు 16 ఏళ్ల వయసు నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో (ఆర్ఎస్ఎస్) అనుబంధం ఉంది.
Read Also- Guvvala Balaraju: బీఆర్ఎస్‌పై గువ్వల బాలరాజు హాట్ కామెంట్స్
వాస్తవానికి ఉపరాష్ట్రపతికి పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి. అయితే, రాజ్యసభ నిర్వహణలో ఆయన ముఖ్యపాత్ర పోషించాల్సి ఉంటుంది. రాజ్యసభలో ఆధిపత్యం కొనసాగించడం ప్రభుత్వావానికి ఎంతో ముఖ్యం.అందుకే, ఆచితూచి పలువురి పేర్లు పరిశీలించిన తర్వాత సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసింది. ఇక, జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాకు సంబంధించిన పలు ఊహాగానాలపై చర్చ నడుస్తోంది. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయకుండానే, స్వేచ్ఛయుతంగా నిర్ణయాలు తీసుకోవడమే జగదీప్ అనూహ్య రాజీనామాకు దారితీసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా, వివాదాస్పద జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానం విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే, విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ధన్‌ఖడ్ ఆమోదించడం వివాదానికి కేంద్ర బిందువని తెలుస్తోంది. నిజానికీ, అధికార బీజేపీ కూడా జస్టిస్ వర్మను అభిశంసించాలని భావించించింది. బీజేపీ తీర్మానం ప్రవేశపెట్టేలోపే ధన్‌ఖడ్ విపక్షాల తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Read Also- Arjun Tendulkar: సచిన్ కొడుకు అర్జున్ ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించాడో తెలుసా?