Atal Canteen: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీ సీఎం రేఖ గుప్తా శుభవార్త చెప్పారు. దేశ రాజధానిలో ‘అటల్ క్యాంటీన్’ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వాటి ద్వారా కార్మికులకు రూ.5కే ఆహారం అందిస్తామని హామీ ఇచ్చారు. దిల్లీ వ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే 100 అటల్ క్యాంటీన్లు నగరవాసులకు భోజనం అందిస్తాయాని స్పష్టం చేశారు.
రూ.100 కోట్లు కేటాయింపు
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగం సందర్భంగా దిల్లీ సీఎం రేఖా గుప్తా అటల్ క్యాంటీన్ గురించి ప్రకటించారు. వీటితో పాటు దిల్లీ మురికివాడల్లో జీవించే పేదల కోసం ఉచిత ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగానే అటల్ క్యాంటీన్ల గురించి సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. దిల్లీలోని మురికివాడల్లో దాదాపు 100 క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు ఈ కాంటీన్లలో ప్రతి ప్లేట్ భోజనం కేవలం రూ.5కే అందిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్యాంటీన్ల ద్వారా దిల్లీలోని కార్మికులు, పేదలు తమ రోజువారి భోజనంపై చేసే ఖర్చును తగ్గించుకునే వెసులుబాటు కలుగుతుందని అన్నారు.
Also Read: Thai Princess: రెండేళ్లుగా బెడ్ పైనే ప్రిన్సెస్.. రాజ భవనం నుంచి షాకింగ్ ప్రకటన
మోదీ పుట్టిన రోజు కానుకగా..
అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు కానుకగా.. సెప్టెంబర్ 17న ఈ అటల్ క్యాంటీన్లను ప్రారంభించాలని దిల్లీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో మరొక దానిని కూడా పూర్తి చేయవచ్చని భావిస్తోంది. మరోవైపు దిల్లీలోని గిగ్ వర్కల్ల సంక్షేమం కోసం ఒక బోర్డును సైతం ఏర్పాటు చేస్తామని పంద్రాగస్టు సందర్భంగా సీఎం రేఖా గుప్తా అన్నారు. వారి యోగ క్షేమాలకు అవసరమైన అన్ని చర్యలను ఆ బోర్డ్ చూసుకుంటుందని చెప్పుకొచ్చారు.
Also Read: CM Revanth Reddy: ఏపీతో జల వివాదం.. గోల్కొండ వేదికగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
ఏపీ, తెలంగాణ తరహాలోనే..
రూ.5కే భోజనం అందించడం దిల్లీలోనే తొలిసారి కాదు. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఏపీలో అన్న క్యాంటీన్లు.. నియోజక వర్గాల వారీగా ఏర్పాటై రూ.5కే పేదవాడి ఆకలిని తీరుస్తున్నాయి. అటు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో రూ.5కే అల్పాహారం అందుబోటులో ఉంది. దీనిని ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. మరోవైపు తమిళనాడులో జయలలిత హయాంలోని అమ్మ క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. వీటిని ప్రస్తుత స్టాలిన్ ప్రభుత్వం కొనసాగిస్తుండటం విశేషం. మరోవైపు కర్ణాటకలోని బెంగళూరులో ఇందిరా క్యాంటిన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రూ.5కు టిఫిన్ (పొంగల్ లేదా వెజిటిబుల్ పులావ్), రూ.10కు లంచ్, డిన్నర్ అందిస్తోంది.