Modi Employment scheme: ఎర్రకోట వేదికగా జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ యూత్ కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన’ (Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana) పేరుతో నయా స్కీమ్ ను ప్రకటించారు. దీని కింద ప్రైవేట్ రంగంలో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరపున రూ.15,000 కేంద్రం అందించనుంది. రూ.1 లక్ష కోట్ల విలువైన ఈ పథకం తక్షణమే అమల్లోకి వచ్చిందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా 3.5 కోట్లకు పైగా యువతకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.
మోదీ ఏమన్నారంటే..
‘ఈ రోజు ఆగస్టు 15. ఈ రోజు నుంచే దేశ యువత కోసం రూ.1 లక్ష కోట్ల విలువైన పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నందుకు మీకు శుభాకాంక్షలు’ అని ప్రధాని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ పథకానికి గత నెలలోనే కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ జులై 25న విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన (PMVBRY) ద్వారా రెండు సంవత్సరాల్లో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించడాన్ని ప్రోత్సహిస్తామని తెలిపింది. వీటిలో 1.92 కోట్ల మంది తొలిసారిగా ఉద్యోగాల్లోకి అడుగుపెడతారని అంచనా వేసింది.
కేంద్ర మంత్రిత్వశాఖ ప్రకారం
ఈ పథకం పేరు.. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా సమగ్ర, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని కార్మిక మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే ఈ పథకాన్ని రెండు భాగాలుగా అమలు చేయనున్నట్లు తెలిపింది. పార్ట్ – Aలో భాగంగా.. తొలిసారి ఉద్యోగం పొందిన యూత్ కు ప్రోత్సాహకం అందిస్తారు. పార్ట్ – Bలో భాగంగా యాజమాన్య కంపెనీలకు మద్దతు ఇస్తారు. పార్ట్ – A, పార్ట్ – B కింద కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు, పెట్టిన నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పార్ట్ A : వారికి మాత్రమే రూ.15 వేలు!
❄️ ఈపీఎఫ్ఓ (Employees’ Provident Fund Organisation)లో తొలిసారి నమోదు చేయబడి.. మెుదటి ఉద్యోగంలో చేరిన వారికి రెండు విడతల్లో రూ.15 వేలు అందించనున్నారు.
❄️ నెల వారి వేతనం రూ.1 లక్ష లోపు ఉన్నవారికి ఈ పథకం కింద అర్హత లభిస్తుంది.
❄️ మొదటి విడత చెల్లింపు.. 6 నెలల ఉద్యోగం చేసిన తర్వాత లభించనుంది.
❄️ రెండవ విడత చెల్లింపు 12 నెలల సేవతో పాటు ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రాం పూర్తి చేసిన తర్వాత అందుతుంది.
❄️ ఈ చెల్లింపులు అన్నీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానం ద్వారా ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ (ABPS) ఉపయోగించి జరగనున్నాయి.
Also Read: PM Modi – GST: ఎర్రకోట వేదికగా ప్రధాని బంపరాఫర్.. ఇక అందరి ఖర్చులు తగ్గబోతున్నాయ్!
పార్ట్ B: యజమానులకు మద్దతు
❄️ అన్ని రంగాల్లో ముఖ్యంగా తయారీ రంగంలో అదనపు ఉద్యోగాలను సృష్టించిన యజమానులకు ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన’ ప్రోత్సాహకాలు అందిస్తారు.
❄️ రూ. లక్షలోపు వేతనం ఉన్న అదనపు ఉద్యోగులపై ప్రతి ఉద్యోగికి నెలకు రూ.3,000 చొప్పున రెండు సంవత్సరాల పాటు యజమానులకు చెల్లిస్తారు.
❄️ తయారీ రంగంలో అయితే ఈ ప్రోత్సాహకాలను 3, 4 సంవత్సరాల వరకూ పొడిగిస్తారు.
❄️ EPFOలో నమోదైన సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అది కూడా 6 నెలల పాటు నిరంతరం పనిచేసిన తర్వాత మాత్రమే ఈ స్కీమ్ కింద ఆ సంస్థను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
❄️ 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉంటే కనీసం రెండు అదనపు ఉద్యోగాలను కంపెనీ సృష్టించాల్సి ఉంటుంది.
❄️ 50 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉంటే కనీసం 5 మంది అదనపు ఉద్యోగులను నియమించాలని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.