Bhatti Vikramarka: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సమయం నాటికి ఆర్థిక పరిస్థితి సహకరించక పోయినా, గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన పాపాలు వెంటాడుతున్నా… రైతుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. 79 వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా గురువారం ఖమ్మం లో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మల్లు పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి దేశంలోనే అత్యున్నత పంట దిగుబడి ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు.
Also Read: Medchal: మేడ్చల్ శ్రీరంగవరం బస్సు లేక జనం తిప్పలు
రూ.16,691 కోట్ల సబ్సిడీతో ఉచిత కరెంటు
రైతు భరోసా పథకాన్ని ప్రతి రైతుకు పరిమితులు లేని రైతు భరోసాను అందించామన్నారు. రూ.16,691 కోట్ల సబ్సిడీని రైతుల ఉచిత కరెంటు వినియోగం కోసం అందిస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర చరిత్రను తిరగరాసి రూ.1,13000 కోట్లను ఖర్చు చేశామన్నారు. ప్రజా పాలనలో ఇల్లు లేని ప్రజలకు ఇల్లు అందించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయించి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల 50 వేల ఇండ్లకు రూ.22వేల 500 కోట్లతో నిర్మాణం చేపడుతున్నామన్నారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్వ వైభవం
స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) బాధ్యతలు చేపట్టగానే ఐదు లక్షల ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్వ వైభవం తీసుకొస్తూ పది లక్షలకు పెంచామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,521 కోట్లను ప్రజా ఆరోగ్యం కోసం ఖర్చు చేశామన్నారు. యువత ఉద్యోగుల భవితకు పెద్దపీట వేస్తున్నామన్నారు. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు లక్ష్యం నిర్దేశించుకుని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
గత పాలకుల హాయంలో జరిగిన నష్టం
గోదావరి, కృష్ణ నది జలాల్లోని తెలంగాణ వాటా కోసం రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. గత పాలకుల హాయంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే శాశ్వత హక్కుల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రైసింగ్ తో 2047 నాటికి భారతదేశం ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా వ్యవహరించనుందన్నారు. ప్రపంచ వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని 2035 వరకు వన్ ట్రిలియన్ డాలర్, 2045 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు మార్చే మహత్తర కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందన్నారు.
రూ.45 కోట్లను వెచ్చించాం
మధిర నియోజకవర్గం లో అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.45 కోట్లను వెచ్చించామన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి అత్యవసర సేవలకు విద్యుత్ ను అందించేందుకు అంబులెన్స్ సర్వీస్ లను పునరుద్ధరిస్తున్నామన్నారు. 1912 కు కాల్ చేస్తే విద్యుత్ మరమ్మతులను చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీల నుండి రాష్ట్ర సచివాలయం వరకు భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లను అమర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలో రైతులకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.