Highest Stray Dogs State: దేశ రాజధాని దిల్లీలోని వీధి కుక్కలపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు.. యావత్ దేశంలో తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దిల్లీలో నానాటికి పెరిగిపోతున్న కుక్కల దాడులు, రాబిస్ కేసుల నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. దీంతో జంతు ప్రేమికులు, సినీ ప్రముఖులు కోర్టు తీర్పును తప్పుబడుతున్నారు. దిల్లీ వీధుల్లోని కుక్కలన్నింటినీ సంరక్షణ కేంద్రాలకు తరలించారన్న ఆదేశాల సాధ్యసాధ్యాలపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దిల్లీలో ఎన్ని కుక్కలు ఉన్నాయి? దిల్లీ జనాభాలో వాటి శాతం ఎంత? స్ట్రే డాగ్స్ (Stray Dogs) అత్యధికంగా ఉన్న రాష్ట్రాలేవి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
దిల్లీలో లక్షపైనే..!
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో వీధి కుక్కల సంఖ్య ఎంతన్న ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 2023 నవంబర్ నాటి గణాంకాల ప్రకారం ఢిల్లీలో 55,000 కుక్కలు ఉన్నట్లు అంచనా. అయితే ఆ తర్వాత కుక్కలకు సంబంధించిన డేటా విడుదల కాలేదు. దిల్లీ ప్రజల అభిప్రాయం ప్రకారం.. నగరంలో కుక్కల సంఖ్య లక్ష దాటి ఉండొచ్చని చెబుతున్నారు. అందుకే ఏ విధి చూసినా అవే దర్శనమిస్తున్నాయని.. ఈ క్రమంలోనే దాడులు పెరిగిపోతున్నాయని పేర్కొంటున్నారు.
రాష్ట్రాల వారీగా కుక్కల సంఖ్య..
2023 నవంబర్ లో విడుదలైన జంతు సంరక్షణ శాఖ నివేదిక ప్రకారం.. భారతదేశంలో సుమారు 1.53 కోట్లు వీధి కుక్కలు సంచరిస్తున్నాయి. ఇది దేశ జనాభాలో సుమారు 1% కి సమానం. ఆ నివేదిక ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో దేశంలోనే అత్యధికంగా 20,59,261 కుక్కలు ఉన్నాయి. ఒడిశాలో (17,34,399 కుక్కలు) మహారాష్ట్ర (12,76,399), రాజస్థాన్ (12,75,596) కర్ణాటక (11,41,173) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మెట్రో నగరాల్లో..
దేశంలోని మెట్రో నగరాల్లో కుక్కల సంఖ్య విషయానికి వస్తే కర్ణాటకలోని బెంగళూరు టాప్ లో ఉంది. అక్కడ 1,36,866 కుక్కలు జీవిస్తున్నాయి. తరువాత ఢిల్లీ (55,462), ముంబై (50,799), చెన్నై (24,827), కోల్‌కతా (21,146), హైదరాబాద్ (10,553) నిలిచాయి. ఈ గణాంకాలు చూస్తే దేశంలో వీధి కుక్కల నియంత్రణ ఎంత పెద్ద సవాలుగా మారిందో అర్థమవుతోంది.
కుక్కల కాటు ముప్పు
ఇదిలా ఉంటే భారతదేశంలో కుక్క కాటు ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2022 – 2024 మధ్య దేశంలో మొత్తం 89,58,143 కుక్క కాటు కేసులు నమోదయ్యాయని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఒక్క మహారాష్ట్రలోనే 13.5 లక్షలు కేసులు నమోదైనట్లు తెలిపింది. తమిళనాడులో 12.8 లక్షలు, గుజరాత్ లో 8.4 లక్షల కుక్క కాటు కేసులు రిజిస్టర్ అయ్యాయని వివరించింది.
రేబిస్ మరణాలు
భారత్ ను పట్టిపీడిస్తున్న ప్రధానమైన అనారోగ్య సమస్యల్లో రేబిస్ (Rabies) ఒకటి. ఈ వ్యాధికి కుక్కలే వాహకాలుగా ఉంటున్నాయి. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంచనా ప్రకారం రేబిస్ కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 59,000 మంది మరణిస్తున్నారు. భారత్ లోనూ రాబిస్ మరణాలు నానాటికి పెరిగిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Also Read: Stray Dogs: మీ వీధిలో కుక్కలు ఉన్నాయా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.. లేదంటే మీ పని ఔట్!
బాధ్యత రాష్ట్రానిదా? కేంద్రానిదా?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 246(3) ప్రకారం.. జంతు సంక్షేమం, వ్యాధి నివారణ వంటి అంశాలు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. అలాగే ఆర్టికల్స్ 243(W), 246 ప్రకారం వీధి కుక్కల నియంత్రణ స్థానిక సంస్థల బాధ్యత. ఇది ప్రధానంగా Animal Birth Control (ABC) ప్రోగ్రామ్ ద్వారా అమలు చేయబడుతుంది. భారత జంతు సంక్షేమ బోర్డు (AWBI).. వీధి కుక్కల జనాభా నియంత్రణ, రేబిస్ నిర్మూలన, మానవ-కుక్కల మధ్య ఘర్షణ తగ్గించడానికి సవరించిన ఏబీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది.