Gadwal Rains: రానున్న 72 గంటలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్(Collector B.M. Santosh) ఒక ప్రకటనలో సూచించారు. భారీ వర్ష సూచనల నేపధ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని సూచించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మూగ జీవాలు ప్రాణాలు కోల్పోకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Also Read: Rajasthan Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది స్పాట్ డెడ్.. మృతుల్లో ఏడుగురు చిన్నారులు!
ఎవరికి వారు అప్రమత్తం
క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటూ, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం యావత్తు అండగా ఉందనే భరోసాను ప్రజలకు కల్పించాలని హితవు పలికారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్,(Police) వైద్యా, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీ రాజ్, రోడ్లు-భవనాల శాఖలు, విపత్తు నిర్వహణ సంస్థలు రాబోయే మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సమాచారం అందించాలన్నారు. ప్రజలు ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటూ, తగు జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. రానున్న 72 గంటల పాటు అవసరం ఉంటేనే ఇళ్ళ నుండి బయటకు రావాలని సూచించారు.
అధికారులకు సూచన
లోతట్టు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ, జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. లో లెవెల్ వంతెనలు, కాజ్ వేల మీదుగా వరద ప్రవాహం ఉన్న సమయాలలో రాకపోకలను నిషేధించాలని, చెరువులు, కాలువలు, నదులలో చేపల వేట, ఈత కోసం ఎవరూ వెళ్ళకుండా కట్టడి చేయాలన్నారు. భారీ వర్షాల వల్ల చెరువులు, కాలువ కట్టలు తెగి పోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని హితవు పలికారు.
భారీ వర్షాలు,(Heavy rains) ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడం వంటివి చోటుచేసుకున్న సందర్భాలలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా రోడ్లు తెగిపోవడం వంటివి జరిగితే, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని, జనజీవనం స్తంభించిపోకుండా, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
తక్షణ చర్యలు చేపట్టాలి
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, దారిమళ్ళింపు చర్యలలో పోలీసు అధికారులు, సిబ్బంది క్రియాశీలంగా పాల్గొనాలని సూచించారు. పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలలో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. భారీ వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని పీ.హెచ్.సీలు, ఆసుపత్రులలో సరిపడా మందుల స్టాక్ ను అందుబాటులో పెట్టుకుని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా అప్రమత్తమై ఉన్నదని, ఎలాంటి పరిస్థితులు తలెత్తిన సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని, ప్రజలు ఆందోళనకు గురి కావద్దని ఈ సందర్భంగా కలెక్టర్ బి.యం. సంతోష్ భరోసా కల్పించారు.
Also Read: Gold Rate Today : గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన గోల్డ్ రేట్స్?