Pakistan: భారత్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడటం దాయాది దేశం పాకిస్థాన్‌కు (Pakistan) కొత్తేమీ కాదు. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే పాక్‌కు ఎదురైంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతర పరిణామాలతో భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసిన ఆ దేశం భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటోంది. కేవలం 2 నెలల్లోనే పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి (PAA) ఏకంగా రూ.1,240 కోట్లకుపైగా (పాకిస్థానీ రూపీలో 4.1 బిలియన్లు) నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించిందని ప్రముఖ పత్రిక డాన్ ఒక కథనాన్ని ప్రచురించింది.
భారత విమానాలపై విధించిన నిషేధంతో గగనతలం ద్వారా సమకూరే ఆదాయం విషయంలో దేశం భారీ నష్టాన్ని చవిచూస్తున్నట్టు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ చెప్పారని పేర్కొంది. భారతదేశానికి చెందిన యాజమాన్యం, నిర్వహణ లేదా లీజుకు తీసుకున్న అన్ని విమానాలకు గగనతల అనుమతులు రద్దు చేసినట్లు మంత్రి చెప్పారని వివరించింది. కాగా, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద నరమేధంలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్‌తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి ప్రతీకారంగా భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్న ఏప్రిల్ 24న పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటన చేసింది.
Read Also- Crime News: ప్రియుడిని ఇంటికి పిలిపించి.. భర్తతో కలిసి…
పాకిస్థాన్‌కు భారీ నష్టం
భారత విమానాలకు గగనతలాన్ని మూసివేసిన పాకిస్థాన్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 30 మధ్య తమ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేస్తున్నట్టు దాయాది దేశం ప్రకటించింది. ఈ నిర్ణయంపై డైలీ 100–150 భారత విమానాలపై ప్రభావం చూపుతోంది. దీంతో, పాకిస్థాన్ గగనతలంలో ఎయిర్‌ట్రాఫిక్ సుమారు 20 శాతం మేర పడిపోయింది. దీనివల్ల పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి ఊహించని ఆర్థిక నష్టం జరుగుతోంది. అయినప్పటికీ, భారత విమానాలకు తమ గగనతల నిషేధాన్ని ఆగస్ట్ 24 వరకు పొడిగిస్తూ ఆ దేశ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. గగనతల నిషేధాన్ని 2025 ఆగస్ట్ 23 వరకు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు పీపీఏ ఒక నోటిఫికేన్ జారీ చేసింది. భారతదేశానికి చెందిన రిజిస్టర్డ్ ఎయిర్‌లైన్స్, యాజమాన్యం కలిగిన లేదా లీజ్‌లో ఉన్న విమానాలు, సైనిక విమానాలతో పాటు ఏ విధమైన విమానాలు తమ గగనతలాన్ని వినియోగించలేవని పేర్కొంది.
Read Also- Rajnath Singh: డొనాల్డ్ ట్రంప్‌కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన రక్షణమంత్రి రాజ్‌నాథ్
మిగతా రూట్లలో ఇబ్బంది లేదు
ఒక్క పాకిస్థాన్ గగనతలం మినహా మిగతా అన్ని అంతర్జాతీయ మార్గాలలో భారతీయ విమానాలు సవ్యంగా నడుస్తున్నాయి. ఏలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తున్నాయి. అయితే, పాకిస్థాన్ గగనతలంలో భారత్ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. ఈ నిషేధాన్ని పాకిస్థాన్ ఎప్పటివరకు కొనసాగిస్తుందో వేచిచూడాలి. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రదాడికి కారణమైన లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన టీఆర్ఎఫ్‌పై (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో లక్షిత దాడులు చేసింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు.