Viral News: కారణం ఏంటో తెలియదు కానీ ఓ కంపెనీలో పనిచేసిన ఉద్యోగి సడెన్‌గా రిజైన్ చేశాడు. ఎంత అకస్మాత్తుగా అంటే, రిజైన్ చేసే రోజున ఉదయం 10 గంటలకు శాలరీ అకౌంట్‌లో పడినట్టుగా మెసేజ్ వచ్చిన ఐదు నిమిషాల్లో, అంటే 10.05 గంటలకు రిజైన్ లెటర్ పంపించాడు. ఉద్యోగులు ఇంత అనైతికంగా ఉండడం ఏమిటి?, ఎంప్లాయీస్ నైతిక విలువల సంగతేంటి? అంటూ సదరు కంపెనీలో హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్న ఎం.ప్రియవర్షిణి అనే ఆమె లింక్డ్‌ఇన్ వేదికగా పెట్టి పోస్టు ఆసక్తికర చర్చకు (Viral News) దారితీసింది.
ఓ ఉద్యోగికి ఉదయం 10:00 గంటలకు జీతం పడితే.. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో, అంటే 10:05కి రిజైన్ చేస్తున్నట్టు మెయిల్ పంపించాడని ప్రియవర్షిణి పేర్కొంది. ‘‘ఇది సబబేనా? నైతికమేనా?’’ అని ఆమె తన పోస్టులో ప్రశ్నించింది. ఉద్యోగం చేసే ఉద్దేశం లేకపోతే, ఆ ఉద్యోగంలో ఎందుకు చేరారని ఆమె నిలదీశారు. కంపెనీలో ఉద్యోగిగా చేరుతున్నట్టుగా ప్రక్రియను ఎందుకు పూర్తిచేశారు?, కంపెనీలో చేరేటప్పుడు లేదా, ట్రైనింగ్ సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆమె ప్రశ్నించారు. జీతం వచ్చిన వెంటనే రాజీనామా చేయడం ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా, పరిపక్వత లోపించినట్టుగా, బాధ్యతాయుత వైఖరిని స్పష్టం చేస్తున్నట్టుగా ఆమె అభివర్ణించారు. ఒక ఉద్యోగి వైఖరి ఈ విధంగా ఉంటే యాజమాన్యాలకు, సహ ఉద్యోగులకు కూడా తప్పుడు సంకేతాలు ఇస్తుందని ప్రియవర్షిణి వ్యాఖ్యానించారు.
Read Also- Raksha Bandhan: రాఖీ సందర్భంగా స్వీట్స్ తీసుకొని శిశువిహార్‌కు వెళ్లిన కలెక్టర్ హరిచందన దాసరి
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2,000కి పైగా రియాక్షన్లు వచ్చాయి. 600లకు పైగా కామెంట్లు వచ్చాయి. పనిప్రదేశంలో నైతిక విలువల నుంచి ఉద్యోగ మార్కెట్‌లో వాస్తవ పరిస్థితుల దాకా విస్తృతంగా చర్చ జరిగింది. కొందరు ఉద్యోగుల నిర్ణయాలను సమర్థించగా, మరికొందరు కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు పీకేయడంపై ప్రశ్నలు సంధించారు. ఉద్యోగుల నైతిక విలువ గురించి మాట్లాడుతున్నవారు సంస్థల నైతికతపై కూడా మాట్లాడాలని పలువురు అభిప్రాయాలు వెలిబుచ్చారు.
స్పందనలు ఇవే..
‘‘ఐదు నిమిషాల్లోనే రిజైన్ చేసిన ఆ వ్యక్తి తప్పు చేయలేదు. పైగా, మీరొక హెచ్చార్ అయ్యి ఉండి ఇలాంటి విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. మీరెంత అపరిపక్వతతో ఉన్నారో మీ పోస్టు తెలియజేస్తోంది’’ అని ఓ యూజర్ స్ట్రాంగ్ కామెంట్ పెట్టాడు. మరొకరు స్పందిస్తూ, ‘‘భవిష్యత్ అంధకారం కాబోతోందని అతడికి ముందే తెలిసిపోయింది. ఆకాశం ఎక్కడా స్పష్టంగా కనిపించదు. మేఘాల గర్జనలన్నీ కూడా వినిపించవు. అందుకే, అతడి నిర్ణయం ఆ విధంగా ఉంది. కంపెనీ-ఉద్యోగి మధ్య దీర్ఘకాల బంధం కొనసాగాలంటే ఇరువైపులా పరస్పర నమ్మకం ఉండాలి. ఈ రోజుల్లో నమ్మకం, ఆశాజనకంగా లేకపోతే ఎవరైనా బయటకు వెళ్లిపోతారు’’ అని ఒకరు అభిప్రాయపడ్డారు.
Read Also- Inspirational Story: 9వ తరగతిలో చదవు మానేసి.. నేడు ఊహించని స్థానంలో ఉన్నాడు
ప్రియవర్షిణిని సమర్థించిన ఓ నెటిజన్ స్పందిస్తూ, ఈ వ్యాఖ్యల్లో కొంత సత్యం ఉందని అన్నాడు. కానీ, ఉద్యోగులు త్వరగా మానేయడానికి కారణాలు అనేకం ఉండవచ్చని, తన జాబ్‌కు తగిన జీతం లేకపోవచ్చని, సంస్థ కల్చర్ అనుకూలంగా లేకపోవచ్చని పేర్కొన్నాడు. ఆందోళన కలిగించే వాతావరణం కూడా కారణం కావొచ్చని, సడెన్‌గా గా వెళ్లిపోవడం సరైనది కాకపోవచ్చు కానీ, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లేదా కెరీర్ పట్ల నిబద్ధత విషయంలో ఇలాంటి నిర్ణయాలు అవసరమవుతాయని రిజైన్ చేసిన ఉద్యోగి పరిస్థితిని విశ్లేషించాడు. కంపెనీలు కూడా సడెన్‌గా ఉద్యోగుల తొలగింపు నిర్ణయాలు తీసుకుంటాయి కదా? అని ప్రశ్నించారు. నైతికత అనేది ఇరువైపులా ఉండాలని, నిజాయితీ, గౌరవం రెండూ అవసరమని సూచించాడు. మధ్యేమార్గ చివరిగా అతడు అభిప్రాయపడ్డాడు.