Himayat sagar: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మహానగరానికి ఇరుగు పొరుగు జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్(Usman Sagar), హిమాయత్ సాగర్(Himayath sagar) జలాశయాలకు భారీగా వస్తున్న వరద నీటి ప్రవాహాం కొంత మేరకు తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి హిమాయత్ సాగర్ వస్తున్న ఇన్ ఫ్లో(In flow) కారణంగా గురువారం రాత్రి పది గంటలకు ఒక గేటును అడుగు మేరకు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు, ఆ రాత్రంతా వరద కొనసాగటంతో శుక్రవారం మరో మూడు గేట్లను సైతం ఎత్తి మొత్తం నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు మూసీలోకి విడుదల చేశారు.
కానీ ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షం అంతంతమాత్రంగానే కురవటంతో వరద ఉద్దృతి తగ్గింపును గుర్తించిన జలమండలి అధికారులు హిమాయత్ సాగర్ నాలుగు గేట్లలో మూడు గేట్లను క్లోజ్ చేసి, ఒకే గేటును ఓపెన్ చేసి, దాని ద్వారానే సుమారు 991 క్యూ సెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కానీ నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిల నిండినట్లు అధికారులు వెల్లడించారు. హోటల్ వైస్రాయ్ వైపున్న అలుగుల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలాకు ఇరువైపులా నివాసాలేర్పాటు చేసుకుని జీవిస్తున్న బస్తీ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు.
Also Read: Rakhi Gift for PM Modi: ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాక్ మహిళ.. అది కూడా ‘ఓం’ చిహ్నంతో..!
జలాశయాల తాజా నీటి మట్టాలు
హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు ( 2970 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1762.50 కి చేరటంతో పాటు ఇన్ ఫ్లో 1300 క్యూసెక్కుల నుంచి 150 క్యూసెక్కులకు తగ్గింది. అలాగే మరో జలాశయం ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు( 3900 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1782.85 అడుగులుగా ఉన్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ జలాశయానికి ఇన్ ఫ్లో కేవలం 150 క్యూసెక్కులు మాత్రమే ఉండటంతో ఇప్పటి వరకు ఈ జలాశయం నుంచి దిగువకు అధికారులు నీటిని విడుదల చేసే అవసరం ఏర్పడలేదు.
గత సోమవారంతో పాటు గురువారం రాత్రి కూడా సిటీలో భారీ వర్షం కురవటంతో హుస్సేన్ సాగర్ లోకి కూడా భారీగా నీరు వస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఇంజనీర్లు గుర్తించి, పరిస్థితిని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా, గరిష్ట స్థాయి నీటి మట్టం 514.75 కాగా, ప్రస్తుత నీటి మట్టం 513.52 మీటర్లుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ ఫ్లో 530 క్యూసెక్కులుగా కాగా, ఔట్ ఫ్లో 1089 క్యూసెక్కులుగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Also Read: Cyber security bureau: ఇక యుద్ధమే.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఫోకస్!