Shubman Gill: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇటీవలే ముగిసిన అండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుతంగా రాణించాడు. 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 754 పరుగులు సాధించాడు. తద్వారా టెస్ట్ కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న తొలి సిరీస్‌ను చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన సిరీస్ అని క్రికెట్ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.
సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. అయితే, కెప్టెన్ దూకుడు కేవలం మైదానం లోపలే పరిమితం కాలేదు. చరిత్రలో నిలిచిపోయేలా జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాల్గొన్న భారత్, ఇంగ్లండ్ జట్లకు చెందిన ఆటగాళ్ల జర్సీలు, క్యాప్‌లను వేలానికి ఉంచగా… శుభ్‌మన్ గిల్ మిగతా అందరి ఆటగాళ్లపైనా ఆధిపత్యం చెలాయించింది. ‘రెడ్‌ఫర్‌రూత్’ (సేవా కార్యక్రమం) పేరిట నిర్వహించిన ప్రత్యేక ఆన్‌లైన్ వేలంలో గిల్ ధరించిన జెర్సీ అత్యధిక ధర పలికింది.
ఎవరి జెర్సీలు ఎంత పలికాయంటే?
భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జెర్సీ 4,600 జీబీపీ (గ్రేట్ బిటీష్ పౌండ్) పలికింది. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారుగా రూ. 5.41 లక్షలుగా ఉంది. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ధరించిన జెర్సీలు 4,200 జీబీపీ (రూ. 4.94 లక్షలు), రిషబ్ పంత్ జెర్సీ 3,400 జీబీపీ (రూ.4 లక్షలు), కేఎల్ రాహుల్ 4000 జీబీపీ (రూ.4.70 లక్షలు) చొప్పున పలికాయి. ఇక, ఇంగ్లండ్ ఆటగాళ్లలో అత్యధికంగా జో రూట్ జెర్సీ 3,800 జీబీపీ (రూ. 4.47 లక్షలు) పలికింది. భారత ఆటగాళ్లతో పోల్చితే ఇది చాలా తక్కువే. బెన్ స్టోక్స్ జెర్సీ కూడా 3,400 జీబీపీ మాత్రమే (రూ. 4 లక్షలు) పలకడం గమనార్హం.
శుభ్‌మన్ గిల్ జెర్సీలు అత్యధిక ధర పలకడంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ స్పందించాడు. శుభ్‌మన్ గిల్ తన అద్భుత ప్రదర్శన ద్వారా పరుగుల వరద పారించాడని, కెప్టెన్సీపై తలెత్తిన అన్ని సందేహాలు, సవాళ్లకు సమాధానం కూడా ఇచ్చాడని ప్రశంసించారు. భారత టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కి ఇదే తొలి సిరీస్ కాగా, ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్ చివరికి 2-2తో సమం అయింది. ఈ సిరీస్‌లో గిల్ అద్భుత ప్రదర్శనతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు — మొత్తం 10 ఇన్నింగ్స్‌ల్లో 754 పరుగులు చేసి, సగటు 75.40 తో నాలుగు శతకాలు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గిల్‌కు ఇండియా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
Read Also- Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో కూలిపోయిన పాకిస్థాన్ విమానాల సంఖ్యను ప్రకటించిన భారత్
4 శతకాలంటే మాటలు కాదు…ఇంగ్లండ్-ఇండియా టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ 4 శతకాలు, 75.40 సగటుతో 750కి పైగా పరుగులు సాధించాడని, ఇవన్నీ వేర్వేరు పరిస్థితుల్లో సాధించాడని పార్థివ్ పటేల్ మెచ్చుకున్నాడు. గతంలో గిల్ బ్యాటింగ్‌కు దిగితే కొంత సందేహం ఉండేదని, ‘సేనా దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) పరిస్థితులకు తగ్గట్టు రాణించగలడా? స్థిరంగా ఆటగలడా? అని అనుమానాలు ఉండేవి. ఈ అనుమానాలు అన్నింటికీ బ్యాటింగ్‌తోనే సమాధానం ఇచ్చాడు. హెడ్డింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 147 పరుగులు బాదాడు’’ అని పార్థివ్ పటేల్ గుర్తుచేశాడు. హెడ్డింగ్లీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమవడంతో గిల్‌పై విమర్శలు వచ్చాయని, అయితే, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మరుసటి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు సాధించాడని గుర్తుచేశాడు. ఒక సిరీస్‌లో 4 శతకాలు బాదడమంటే మామూలు విషయం కాదని మెచ్చుకున్నాడు.
Read Also- Liquor Shop Robbery: మద్యానికి బానిసై తండ్రి మృతి.. కోపంతో 8 లిక్కర్ షాపులు దోచేసిన తనయుడు!