Liquor Shop Robbery: మహారాష్ట్రలోని నాగపూర్‌లో తన తండ్రి మద్యానికి బానిసై మరణించడాన్ని ఓ వ్యక్తి తట్టుకోలేకపోయాడు. తన తండ్రి బలహీనతను ఆసరగా చేసుకొని మద్యం విక్రయించిన దుకాణాలపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించాడు. ఇందులో భాగంగా నగరంలోని 8 లిక్కర్ షాపుల్లో దోపిడి చేసి.. వాటి యజమానులకు షాకిచ్చారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 31న నగరంలోని ఓ బార్ లో దొంగతనం జరిగింది. ఓ దొంగ దాదాపు రూ.40,000 విలువైన వస్తువులను దొంగిలించాడని బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందులో రూ.36,000 నగదు, సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి. బార్ యజమాని నిలేష్ దేవానీ (Nilesh Devani) ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా నాగ్ పూర్ పోలీసులు రంగంలోకి దిగారు. బార్ లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగను రాజా ఖాన్‌గా గుర్తించారు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేశారు.
దొంగ ఏం చెప్పాడంటే?
తమ విచారణలో రాజా ఖాన్ (Raja Khan) కీలక విషయాలు బయటపెట్టినట్లు దర్యాప్తు అధికారి తెలిపారు. ‘అతన్ని ప్రశ్నించినప్పుడు తన తండ్రి మద్యం కారణంగా మరణించాడని చెప్పాడు. తరచూ వైన్‌షాప్‌లు, బార్‌లకు వెళ్తాడని పేర్కొన్నాడు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బార్‌ల నుంచి దొంగతనం చేస్తున్నానని అంగీకరించాడు. అతను మరిన్ని వైన్‌షాప్‌లు, బార్‌లను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పాడు. కనీసం 8 లిక్కర్ షాపులను దోచుకున్నట్లు ప్రాథమికంగా అంచనాలు ఉన్నాయి’ అని ఆ అధికారి చెప్పారు.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో కూలిపోయిన పాకిస్థాన్ విమానాల సంఖ్యను ప్రకటించిన భారత్
మద్యం తాగితే ఏమవుతుంది?
మద్యం సేవించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మద్యం అధికంగా సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఇది ఫ్యాటీ లివర్, హెపటైటిస్, సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. అలాగే అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్), గుండెపోటు, కార్డియోమయోపతి (గుండె కండరాల బలహీనత) వంటివి సంభవించవచ్చు. గ్యాస్ట్రైటిస్, పంక్రియాటైటిస్ (క్లోమ గ్రంథి వాపు), పొట్టలో అల్సర్లు తలెత్తవచ్చు. వీటితో పాటు నోటి, గొంతు, కాలేయం, రొమ్ము, పెద్దప్రేగు క్యాన్సర్‌ల ప్రమాదం పెరుగుతుంది. మద్యం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచి, ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాన్ని గణనీయంగా పెంచుతుంది.
మానసిక అనారోగ్యాలు
మద్యం తాత్కాలిక ఉపశమనం ఇచ్చినట్లు అనిపించినా దీర్ఘకాలంలో డిప్రెషన్, ఆందోళన వంటి రుగ్మతలను తీవ్రతరం చేస్తుంది. అధిక మద్యపానం వల్ల మెదడు కణాలు దెబ్బతిని, జ్ఞాపకశక్తి కోల్పోవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో వెర్నిక్-కోర్సాకోఫ్ సిండ్రోమ్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. దీర్ఘకాల మద్యపానం.. మానసికంగా., శారీరకంగా బానిసత్వానికి దారితీస్తుంది. దీనిని ఆల్కహాలిజం అని పిలుస్తారు. కాబట్టి మద్యం సేవనాన్ని పూర్తిగా తగ్గించడం లేదా నివారించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా, వ్యాయామం వంటివి మానసిక ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తాయని స్పష్టం చేస్తున్నారు.