ICICI Bank New Rules: భారత దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ గా ఉన్న ఐసీఐసీఐ (ICICI Bank) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కస్టమర్ల బ్యాంక్ బ్యాలెన్స్ పరిమితిని అమాంతం పెంచింది. ఐసీఐసీఐ తన వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆగస్టు 1 నుంచి కొత్తగా ఖాతా తెరవబోయే కస్టమర్లు తమ నెలవారి బ్యాంక్ బ్యాలెన్స్ రూ.50,000లను తప్పనిసరిగా కలిగి ఉండాలి. మెట్రో నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు ఇది వర్తించనుంది. అయితే పాత కస్టమర్లకు మాత్రం గతంలో విధించిన రూ.10,000 బ్యాంక్ బ్యాలెన్స్ పరిమితి అలాగే కొనసాగుతుందని ఐసీఐసీఐ తన వెబ్ సైట్ లో పేర్కొంది.
వారికి రూ.25 వేలు తప్పనిసరి..
ఐసీఐసీఐ కొత్త నిబంధనల ప్రకారం సెమీ అర్బన్ ప్రాంతాల్లో కొత్త కస్టమర్లు రూ.25,000 కనీస సగటు బ్యాలెన్స్ మెయిన్ టెన్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త కస్టమర్లకు మాత్రం రూ.10,000గా నిర్ణయించారు. మరోవైపు పాత కస్టమర్లకు గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నెలకు కనీస సగటు బ్యాలెన్స్ రూ.5,000గానే ఉండనుంది. కనీస సగటు బ్యాలెన్స్‌ను నిలుపుకోని కస్టమర్లకు లోటు మొత్తంపై 6 శాతం లేదా రూ.500లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని జరిమానాగా వసూలు చేస్తారు.
పరిమితి దాటితే రూ.150 వసూలు
ఇదిలా ఉంటే ఐసీఐసీఐలో ప్రతి సేవింగ్స్ ఖాతాలో నెలకు మూడుసార్లు ఉచిత నగదు డిపాజిట్ సౌకర్యం ఉంది. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.150 వసూలు చేస్తారు. నెలలో డిపాజిట్‌ల గరిష్ట పరిమితి రూ.1 లక్షగా నిర్ణయించారు. 2025 ఏప్రిల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించింది. రూ.50 లక్షల వరకు డిపాజిట్ ఉన్న సేవింగ్స్ ఖాతాలకు ఇప్పుడు 2.75 శాతం వడ్డీ లభిస్తోంది. మరోవైపు ప్రతి నెలలో ఉచిత నగదు ఉపసంహరణ లావాదేవీలు కూడా మూడుగానే కొనసాగనున్నాయి.
Also Read: Indian Railways: సొంతూర్లకు వెళ్లే వారికి.. రైల్వేశాఖ బంపరాఫర్.. టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటన!
ఎస్‌బీఐలో ఈ నియమం రద్దు!
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) 2020లో కనీస బ్యాలెన్స్ నియమాన్ని రద్దు చేసింది. ఐసీఐసీఐ వంటి చాలా బ్యాంకులు.. రూ.2,000-10,000 వరకూ కనీస సగటు బ్యాలెన్స్ మెయిన్ టెన్ చేయాలని సూచిస్తున్నాయి.