PM Modi China Tour: టియాంజిన్ నగరం వేదికగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 తేదీల మధ్య జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొనాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చైనా (PM Modi China Tour) ఆహ్వానించింది. ఈ విషయాన్ని చైనా శుక్రవారం వెల్లడించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గుయో జియాకున్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. టియాంజిన్ వేదికగా జరగనున్న సదస్సు షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) చరిత్రలో అతిపెద్దదిగా (పాల్గొనే దేశాల సంఖ్యను బట్టి) నిలవనుందని చెప్పారు. అన్ని సభ్య దేశాల సహకారంతో ఈ సమావేశం ఐక్యత, స్నేహానికి చిహ్నంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీవోను మరింత దృఢమైన, సమన్వయంతో నిర్వహించే దశలోకి ఈ సమావేశం తీసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, షాంఘై సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చైనా వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై విధించిన భారీ సుంకాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. ఈ దిశగా ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని మోదీని షాంఘై సదస్సుకు ఆహ్వానించింది.
ఈ సదస్సు చైనాలోని టియాంజిన్ నగరం వేదికగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 తేదీల మధ్య జరగనుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ను 2001లో స్థాపించారు. ప్రాంతీయంగా స్థిరత్వం, శాంతి, సహకారాన్ని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా దీనిని నెలకొల్పారు. ఎస్‌సీవోలో ప్రస్తుతం 10 సభ్యదేశాలు ఉన్నాయి. బెలారస్, చైనా, భారత్, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిజిస్తాన్, పాకిస్థాన్,
రష్యా, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ఉన్నాయి. ఈ సమావేశం ద్వారా భారత్-చైనా సంబంధాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read also- TS News: కలెక్టర్‌పై గరంగరమైన ఎమ్మెల్యేకు ఉద్యోగుల సీరియస్ వార్నింగ్
జిన్‌పింగ్, పుతిన్‌లతో ద్వైపాక్షిక చర్చలకు ఛాన్స్!
షాంఘై సదస్సు కోసం చైనా వెళ్లనున్న ప్రధానమంత్రి నరంద్ర మోదీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. షాంఘై సహకార సంస్థ సదస్సుకు సభ్యదేశాల నేతలతో పాటు 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారు. సభ్యదేశాల అధినేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు చైనా అధికారులు ఇప్పటికే ధృవీకరించారు.
కాగా, 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనా వెళ్లడం ఇదే మొదటిసారి. ఆయన చివరిసారిగా 2019లో అక్కడ పర్యటించారు. 2024 అక్టోబరులో బ్రిక్స్ సమిట్ (కజాన్) సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో చివరిసారిగా మోదీ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కొన్ని కీలక చర్చలు మొదలయ్యాయి.
Read Also- Doctor Post Vacancies: హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా గుడ్‌న్యూస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తువులపై విధించిన భారీ సుంకాల నేపథ్యంలో ఈ పరిణామం కీలకంగా మారింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేశారనే కారణంతో ట్రంప్ ఈ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అమెరికాతో దౌత్య సంబంధాలు సన్నగిల్లిన నేపథ్యంలో భారత్-చైనా మధ్య బంధాలు మరింత దగ్గరయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మాట్లాడారని గుర్తుచేస్తున్నారు. ఇరు దేశాలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ సందర్భంగా జిన్ పింగ్ పేర్కొన్నారు.