Ravichandran Ashwin: ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న ఐపీఎల్ తదుపరి ఎడిషన్ ప్రారంభం కావడానికి ఇంకా మరికొన్ని నెలల సమయం ఉంది. ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి చాలా సమయమే ఉన్నప్పటికీ జట్లలో మార్పులు, ఆటగాళ్ల ట్రేడింగ్‌కు సంబంధించిన ఊహాగానాలు ఇప్పటినుంచే మొదలయ్యాయి. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తనను జట్టు నుంచి రిలీజ్ చేయాలంటూ మేనేజ్‌మెంట్‌ను కోరినట్టుగా గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. క్రికెట్ అభిమానుల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారిపోయింది. సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో చేరే అవకాశాలు కూడా ఉన్నాయంటూ జోరుగా ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.
చెన్నై సూపర్ కింగ్స్ తరపున గత సీజన్‌లో పెద్దగా రాణించలేకపోయిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) టీమ్ మారాలని భావిస్తున్నట్టుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతేడాది సీఎస్కే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ దిగ్గజ ప్లేయర్… తననే టీమ్ నుంచి రిలీజ్ చేయాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ను కోరినట్టు తెలుస్తోంది. అతడి విజ్ఞప్తిపై యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. నిజానికి, రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కెరీర్ ప్రారంభమైంది సీఎస్కే జట్టులోనే. చాలా కాలం తర్వాత గతేడాది హోమ్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, ప్రదర్శన విషయంలో అనుకున్నట్టుగా సాగలేదని చెప్పాలి.
Read Also- Big Shock to USA: అమెరికాకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న భారత్.. ట్రంప్ బిత్తరపోయే ప్లాన్ ఇదే
ఐపీఎల్ 2025 సీజన్‌లో అశ్విన్ ప్రయాణం అంతసవ్యంగా సాగలేదు. కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే చోటుదక్కింది. అన్ని మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు. నిరాశజనకమైన ప్రదర్శన కారణంగా కొన్ని మ్యాచ్‌ల్లో అశ్విన్‌ను బెంచ్‌కే పరిమితం చేయాల్సి వచ్చింది. యువ బౌలర్లకు అవకాశాలు కల్పించిన టీమ్ మేనేజ్‌మెంట్ అశ్విన్‌ను పక్కన కూర్చోబెట్టింది. అశ్విన్ వయసు ఏకంగా 38 సంవత్సరాలు కావడం కూడా మరో మైనస్‌గా ఉంది. వయసు దృష్ట్యా పెద్ద భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా ఫ్రాంచైజీ పరిగణించడం లేదు. పైగా అశ్విన్‌తో పాటు ఇప్పటికే 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దీంతో, యువతను టీమ్‌లోకి తీసుకోవడంపై సీఎస్కే యాజమాన్యం దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.
Read also- Income Tax Bill: కేంద్రం అనూహ్య నిర్ణయం.. ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు-2025 ఉపసంహరణ
శాంసన్-అశ్విన్‌ను మార్చుకుంటారు?
రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ వైదొలగబోతున్నాడనే ప్రచారం నిజమైతే, అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు అత్యుత్తమ అత్యుత్తమ ఆప్షన్ అవుతాడని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా కూడా శాంసన్‌కు విశేష అనుభవం ఉంది. 2026 సీజన్‌కు ముందు ఎంఎస్ ధోనీ రిటైర్ అయ్యే అవకాశం ఉండడంతో అతడి స్థానాన్ని భర్తీ చేయగల బెస్ట్ ఛాయిస్‌గా సంజూ శాంసన్ నిలుస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, అశ్విన్‌కు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున గతంలో అద్భుతంగా రాణించిన అనుభవం ఉంది. ఆ జట్టుతో ఆడినప్పుడు అతడి రికార్డు బావుంది. దీంతో, అశ్విన్ -శాంసన్ మధ్య ట్రేడ్ ఒప్పందం జరిగితే, అటు రాజస్థాన్ రాయల్స్‌కు, ఇటు చెన్నై సూపర్ కింగ్స్‌కు సరైన ఆటగాళ్లు దక్కుతారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.