Suryapet police: సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీసులు వాహనదారుల వద్ద కిరికిరి చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశాలతో చేపట్టాల్సిన ఈ చాలాన్స్(e challans) విధులను మరో మార్గంలో చూపుతూ చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వాహనదారులకు సరైన పత్రాలు లేకపోతే నిబంధనల ప్రకారం ఈ చాలాన్స్ విధించాల్సి ఉంటుంది. కానీ అనంతగిరి పోలీసులు మాత్రం మరో రూట్‌లో వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేయడమే పనిగా పెట్టుకొని జేబులు నింపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బొజ్జ గూడెం తండా స్టేజి ఫ్లై ఓవర్(Bojja Gudem Thanda Stage Flyover) కింద మధ్యాహ్నం సమయం ఒంటిగంట నుంచి రాత్రి 8:30 గంటల వరకు వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఆ రహదారిలో వాహనదారులు వెళ్లాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు. ద్విచక్ర వాహనాలు అయితే హెల్మెట్(Helmet) లేదని వంకతో వారి నుండి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఫోర్ వీలర్ అయితే సీటు బెల్టు లేదనో లేదంటే ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) పాటించడం లేదనో.. డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా పోలీసులు తమ విధులను చక్కబెట్టుకుంటున్నారని సమాచారం.
Also Read: GHMC: గూగుల్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న జీహెచ్ఎంసీ
జులుం ప్రదర్శిస్తున్న సిబ్బంది
అనంతగిరి(Anantagiri), కోదాడ(Kodhada) పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిబ్బంది వాహనదారులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా సమాచారం ద్వారా తెలుస్తోంది. పోలీసులు అడిగిన విధంగా డబ్బులు ఇవ్వకపోతే వాహనదారులపై తమదైన శైలిలో జులుం ప్రదర్శిస్తున్నారని విమర్శలు సైతం వస్తుండడం గమనార్హం. పోలీసులు వారి రీతిలో అడిగే డబ్బులు ఇవ్వకపోతే వాహనదారుల ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలించి మరో రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోతున్నారు. హెవీ వెహికల్స్(Heavy Vehicles) అయితే ఇంకా అడగాల్సిన పనే లేకుండా వారికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తూ వారి నుంచి డబ్బులు ఈజీగానే వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
అనంతగిరి, కోదాడ పోలీసులు ప్రదర్శిస్తున్న అడ్డదారుల చేతివాటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఈ చాలాన్లు(E Chellans) విధిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాంటిది ఈ చాలాన్లపై దృష్టి సారించకుండా పక్క దారిలో డబ్బులు వసూలు చేయడమే ధ్యేయంగా పోలీసులు పని చేయడంతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుంది. హెల్మెట్ లేకపోతే ఒక రేటు, వాహన పత్రాలు సరైనవి లేకపోతే ఇంకో రేటు ప్రభుత్వం ఖరారు చేసి ఈ చానల్స్ రూపంలో జరిమానాలు విధించాలని పోలీసు శాఖకు ఆదేశాలు ఇచ్చింది.
అయితే సూర్యాపేట(Surayapeta) జిల్లాలోని అనంతగిరి, కోదాడ పోలీసులు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదులుతూ తాము అనుకున్నదే లక్ష్యంగా వాహనదారుల వద్ద నుంచి నగదును వసూలు చేస్తూ అక్రమార్చనకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనదారులు ఈ చాలాన్స్ విధిస్తే మీసేవ(Meeseva) కేంద్రాల్లో జరిమానాలు చెల్లిస్తామని చెబితే వారిని పోలీసు సిబ్బంది తమదైన శైలిలో బెదిరిస్తున్నారని ఆరోపణలు సైతం వస్తుండడం విశేషం. అయితే ఈ విషయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు తెలియదంటే వారికి కూడా వాటా వెళ్తుందని విశ్వసనీయ సమాచారం.
Also Read: Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ముందు హాజరైన విజయ్ దేవరకొండ