Rahul-Ganddi
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Rahul Gandhi: ఓట్ల దోపిడీపై ఆధారాలు ఇవిగో.. డేటా ప్రకటించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: ఎన్నికల్లో ఓట్ల దోపిడీ జరిగిందని, బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం (EC) కూడా వ్యవహరించిందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఆరోపణకు ఆధారంగా కర్ణాటక ఎన్నికల ఓటర్ల జాబితాను చూపించారు. ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల్ని చేర్చారని పేర్కొన్నారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో భయంకరంగా ఓట్ల దొంగతనం జరిగిందని ఆరోపించారు. ఓటమి భయంతో ఉన్న బీజేపీకి ఓట్ల దోపిడీలో ఎన్నికల సంఘం (EC) తోడ్పాటు అందించిందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి సుదీర్ఘంగా మాట్లాడారు.

రాహుల్ చెబుతున్నదేమిటి?

మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 6.5 లక్షల ఓట్లు ఉన్నాయని, వాటిలో 1 లక్షకుపైగా ఓట్లు చోరీ అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. నియోజకర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిశోధన చేయగా, 1 లక్షకు పైగా నకిలీ ఓట్లు, ఫేక్ అడ్రస్‌లతో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్రమైన పోటీ జరిగింది. ఓట్ల లెక్కింపులో ఎక్కువ సమయం పాటు కాంగ్రెస్ అభ్యర్థి మాన్సూర్ అలీ ఖాన్ ఆధిక్యంలో కొనసాగారు. కానీ, చివరికి బీజేపీ అభ్యర్థి పీపీ మోహన్ 32,707 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. తుది ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీకి 6,26,208 ఓట్లు, బీజేపీకి 6,58,915 ఓట్లు పడ్డాయి. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కానీ, మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో మాత్రం 1,14,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ వెనుకబడింది. మహాదేవపురలో మొత్తం 1,00,250 ఓట్లు దొంగతనానికి గురయ్యాయి. అందులో 11,965 డూప్లికేట్ ఓట్లు, 40,009 చెల్లని/నకిలీ చిరునామాలతో ఉన్న ఓట్లు, 10,452 బల్క్ ఓట్లు (ఒకే చిరునామాతో అనేక ఓటర్లు), 4,132 చెల్లని ఫొటోలతో ఉన్న ఓట్లు, 33,692 ఓట్లు ఫామ్-6ను దుర్వినియోగ పరిచి కొత్తగా ఓటర్‌గా నమోదు చేయించుకున్న ఓట్లు’’ ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ తప్పిదాల కారణంగానే మహాదేవపురలో కాంగ్రెస్‌ వెనుకబడిందని, తద్వారా బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానంలో ఓడిపోయిందని పేర్కొన్నారు.

ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌‌లో ఎందుకు ఇవ్వలేదు?
ఎలక్టోరల్ డేటాను ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఇవ్వకపోవడంతో ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ రూపంలో డేటా ఇస్తే ఎన్నికల సంఘం మోసం 30 సెకన్లలోనే బయటపడుతుందని, అందుకే ఆ ఫార్మాట్‌లో డేటా ఇవ్వలేదని ఆరోపించారు. ‘‘ఏకంగా ఏడు అడుగుల పొడవుంటే పేపర్‌పై.. ఒక వ్యక్తి రెండుసార్లు ఓటేశారా, లేక రెండు చోట్ల పేరు ఉందా అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఆ వ్యక్తి ఫొటో తీసి, ప్రతి ఒక్క పేపర్‌తో వెతుకుతూ దాన్ని పోల్చాల్సి ఉంటుంది. ఈ విధానం చాలా సంక్లిష్టమైనది. ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే మెషీన్‌ రీడబుల్ కాని పేపర్లను మాత్రమే ఇస్తోంది. పార్టీలు తేలికగా ఓటర్ల వివరాలు పరిశీలించడానికి వీలులేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. మహాదేవపురలో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మాకు 6 నెలల సమయం పట్టింది. అదే ఎలక్ట్రానిక్ డేటా ఉంటే 30 సెకన్లలో అయిపోయేది. మరి, ఇలాంటి పేపర్లను ఎందుకు ఇస్తున్నారు?, పరిశీలన జరగకుండా ఉండడానికే కదా?. ఈ పేపర్లు ‘ఓప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్’కు (OCR) కూడా అనుకూలంగా లేవు’’ అని రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు.

Read Also- Khammam: ‘డేట్ ఆఫ్ బర్త్’ సర్టిఫికెట్‌కు అప్లై చేస్తే… చనిపోయినట్టు జారీ చేశారు

ఓటర్ల జాబితాల్లో నకిలీ పేర్లు
ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు చేర్చుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో అద్భుతంగా రాణించిన ఇండియా కూటమి.. ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వెనుబడడంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘ప్రతి పార్టీకీ పాలనాపరమైన వ్యతిరేకత (anti-incumbency) ఎదురవుతుంది. కానీ, బీజేపీకి మాత్రం అది ఎప్పుడూ ఎదురుకావడం లేదు. అందుకే, ప్రజలలో కొన్ని అంశాలపై అనుమానాలు ఉన్నాయి. ఓటర్ల జాబితాల్లో నకిలీ వ్యక్తుల పేర్లు చేర్చారు’’ అని అన్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌పై రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు. ఎగ్జిట్ పోల్స్, ఒపినియన్ పోల్స్ చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాలు రావడాన్ని అందరూ చూశారని, భారీ వ్యత్యాసం కనిపించిందని పేర్కొన్నారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో మహాయుతి (బీజేపీ కూటమి) కొద్దిగా పైచేయిగా నిలుస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ, అసలైన ఫలితాలు పూర్తిగా భిన్నంగా వచ్చాయని గాంధీ అనుమానం వ్యక్తం చేశారు.

Read Also- PM Modi: డైరెక్ట్‌గా డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ

ఖండించిన ఎన్నికల సంఘం
రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. కావాలంటే రాహుల్ గాంధీ వీటిపై సంతకం చేసి ఆధారాలుగా అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే దేశ ప్రజలను తప్పుదారి పట్టించడాన్ని, ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని మానుకోవాలని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ, అధికారికంగా ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది.

ఒకే బెడ్ రూమ్ ఉన్న ఇంట్లో 80 ఓట్లు: అశోక్ గెహ్లాట్
ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోట్ మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆలోచించాల్సినవని, ఎన్నికల సంఘం పని తీరుపై ప్రశ్నలు లేవలెత్తుతున్నాయని అన్నారు. ఒకే ఓటరు పేరు 4 చోట్ల నమోదు కావడం, ఒకే బెడ్‌రూమ్ ఉన్న ఇంట్లో ఏకంగా 80 మంది ఓటర్లు రిజిస్టర్ కావడం, ఫస్ట్ టైమ్ ఓటర్ స్థానంలో వేల సంఖ్యలో 60 ఏళ్లు పైబడిన వారిపేర్లు ఉండటం, చెల్లని ఫొటోలు ఉండటం ఇవన్నీ అనుమానం కలిగించేవేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ