Khammam: జనన ధ్రువీకరణ పత్రానికి బదులు మరణ ధృవీకరణ జారీ
కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో ఘోరమైన నిర్లక్ష్యం
ఖమ్మం, స్వేచ్ఛ: ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పులు దొర్లడం సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆలస్యం, తప్పులు, గందరగోళాలు చోటుచేసుకోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే కొత్త విషయం ఏమీ లేదు. రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్, వాహన రిజిస్ట్రేషన్ ఇలా అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యనిర్వాహణ పొరపాట్లు ఇందుకు ఒక కారణమైతే, బాధ్యత లేకుండా వ్యవహరించే కొందరు అధికారులు మరో కారణమవుతున్నారు. అచ్చం ఇదే తరహాలో నిర్లక్ష్యానికి పరాకాష్ట లాంటి ఘటన ఒకటి ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది.
జనన ధ్రువీకరణ కోరితే..
ఖమ్మం జిల్లా (Khammam) కూసుమంచి మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జనన ధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకుంటే మరణ ధృవీకరణ పత్రం మంజూరైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన ఈ ఘటన మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. కూసుమంచి మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్, లక్ష్మి (మమత) దంపతులకు ఈ పరిస్థితి ఎదురైంది. 2022 నవంబర్ 12న లక్ష్మి (మమత) కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ కాన్పులో ఆడబిడ్డను ప్రసవించింది. ఆ పాపకు జనన ధృవీకరణ పత్రం కోసం అవసరమైన పత్రాలన్నీ జతచేసి దరఖాస్తు పెట్టుకున్నారు. తమ కూతురు కడారి మాదవిద్యకు ఆధార్ కార్డు జారీ కావాలంటే జనన ధ్రువీకరణ పత్ర తప్పనిసరి కావడంతో కూసుమంచి పంచాయితీ కార్యాలయాన్ని సంప్రదించామని బాధితులు చెప్పారు. అయితే, తమ వద్దకు ఇంకా వివరాలు రాలేదని సిబ్బంది సమాధానం ఇచ్చారు. వివరాలు కొనుక్కొని ఫోన్ చేస్తామంటూ బాధితుల నుంచి ఫోన్ నంబర్ కూడా తీసుకున్నారు.
Read Also- TCS: టీసీఎస్ ఉద్యోగులకు పండుగలాంటి వార్త.. 1వ తేదీ నుంచి అమల్లోకి..
ప్రభుత్వ ఆసుపత్రి జారీ చేసిన కాన్పు సర్టిఫికెట్ ఉన్నా సరే అధికారులు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. స్పందన లేకపోవడంతో బాధితులు కొన్ని రోజుల తరువాత మళ్లీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోవడంతో విసుగు చెందారు. మళ్లీ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమ కూతురుకి జనన ధృవీకరణ పత్రం ఇవ్వాలని అభ్యర్థించగా సంబంధిత విభాగంలో విధులు నిర్వర్తించే గువ్వల వెంకటేశ్వర్లు అనే ఉద్యోగి.. చిన్నారి తల్లికి ఒక ధ్రువీకరణ పత్రం అందజేశారు. అయితే, జనన ధృవీకరణ పత్రానికి బదులు మరణ ధృవీకరణ పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది మంజూరు చేశారు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఇంతకాలం తిప్పించుకొని చివరి డెత్ సర్టిఫికెట్ జారీ చేయడంపై భగ్గుమన్నారు. సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Read Also- PM Modi: డైరెక్ట్‌గా డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ
సమాధానంలోనూ నిర్లక్ష్యమే..
తీవ్ర నిర్లక్ష్యంపై బాధిత వ్యక్తులు సంబంధిత అధికారులను నిలదీయగా సమాధానంలో కూడా అదే వైఖరి కనబడింది. దరఖాస్తుదారుకు సమాధానం సరిగా చెప్పకపోగా, ఈ సర్టిఫికెట్ ఇవ్వడమే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడారు. ఎక్కువ మాట్లాడితే కార్యాలయం నుంచి బయటికి పంపిస్తానంటూ దురుసుగా మాట్లాడారంటూ బాధితులు వాపోతున్నారు.