UK Woman: మహిళలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బస్టాండ్స్, రోడ్లు, షాపింగ్ మాల్స్ ఇలా ఎక్కడపడితే అక్కడ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. విచక్షణ కోల్పోయి వారిపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. అయితే తాజాగా ఓ మహిళ (52 ఏళ్లు) గాల్లో ఉండగా.. లైంగిక దాడికి గురికావడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. వయసులో పెద్దదని కూడా చూడకుండా ఆమెతో ఓ టీనేజర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ట్యూనీషియా దేశంలో జరిగిన ఈ ఘటన.. ప్రస్తుతం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అసలేం జరిగిందంటే?
ట్యూనీషియా దేశంలో బ్రిటిష్ మహిళ (British Women)పై దారుణం జరిగింది. పారా సెయిలింగ్ (Parasailing) సమయంలో తనపై లైంగిక దాడి జరిగినట్లు 52 ఏళ్ల మిచెల్ విల్సన్ (Michelle Wilson) తెలిపారు. సౌస్ బీచ్ (Sousse Beach) వద్ద తనకు ఈ అనుభవం ఎదురైందని చెప్పారు. ‘పారా సెయిల్ ఆపరేటర్ తో హార్నెస్ కట్టబడి ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. నా బికినీ కింద భాగాన్ని వెనుకనుండి లాగుతున్న అనుభూతి కలిగింది. అతను స్ట్రాప్‌ను లాగాడు’ అని మిచెల్ తెలిపారు.
నిందితుడి ఏజ్.. 20 లోపే!
మిచెల్ మొదట తన స్నేహితురాలితో కలిసి పారా సెయిలింగ్ చేయాలని భావించింది. కానీ గాలి అనుకూలంగా లేవని సిబ్బంది చెప్పడంతో.. ఇద్దరూ విడిగా ఆపరేటర్‌తో వెళ్లాల్సి వచ్చింది. మిచెల్ ఫ్రెండ్ మాత్రం తన రైడ్‌ను ఏ సమస్యలూ లేకుండా పూర్తి చేసింది. కాగా తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి వయసు.. 20 ఏళ్ల లోపు ఉంటుందని మిచెల్ అన్నారు. ‘అతను నన్ను తాకుతూ ముందుకు వెనక్కు కదులుతూ అరబిక్‌లో నాతో మాట్లాడాడు. నన్ను హత్తుకునే ప్రయత్నం చేశాడు. నాకిది అవమానంగా అనిపించింది. అతడి చర్యలతో చాలా భయపడ్డాను’ అని చెప్పుకొచ్చారు.
Also Read: Rahul Gandhi on Modi: ట్రంప్ విమర్శలపై ప్రధాని సైలెంట్.. కారణమేంటో చెప్పిన రాహుల్!
పోలీసులకు ఫిర్యాదు
పారా సెయిల్ పూర్తి చేసుకొని కిందికి దిగిన వెంటనే.. మిచెల్ విల్సన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆపరేటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాను కూతురు (17), కుమారుడు (16), స్నేహితురాలితో కలిసి ఈ పర్యటనకు వెళ్లినట్లు మిచెల్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఆపరేటర్ అరెస్టు అయ్యి ఉండవచ్చని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ అనుభవం తన సెలవు రోజులను పూర్తిగా నాశనం చేశాయని మిచెల్ ఆందోళన వ్యక్తం చేశారు.