Rahul Gandhi on Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donlad Trump).. భారత్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూన్నా మోదీ మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani)పై అమెరికాలో జరుగుతున్న దర్యాప్తు కారణంగానే ప్రధాని సైలెంట్ గా ఉండిపోయారని అన్నారు. అందుకే ట్రంప్ ఎంతగా బెదిరిస్తున్నా ప్రతిస్పదించలేకపోతున్నారని ఆరోపించారు.
‘మోదీ చేతులు కట్టబడ్డాయి’
భారత్ అన్యాయమైన భాగస్వామి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన కొద్దిసేపటికే రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘దేశం అర్థం చేసుకోవాలి. ట్రంప్ పదే పదే చేస్తున్న బెదిరింపులకు మోదీ ఎదురు నిలబడలేకపోవడానికి కారణం.. అమెరికాలో జరుగుతున్న అదానీపై దర్యాప్తు’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికా విషయంలో మోదీ చేతులు కట్టబడి ఉన్నాయని రాహుల్ పేర్కొన్నారు. అయితే దీనిపై కేంద్రం, అదానీ గ్రూప్ స్పందించాల్సి ఉంది.
India, please understand:
The reason PM Modi cannot stand up to President Trump despite his repeated threats is the ongoing U.S. investigation into Adani.
One threat is to expose the financial links between Modi, AA, and Russian oil deals.
Modi’s hands are tied.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2025
అసలేంటి అదానీ కేసు?
న్యూయార్క్ లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు (Brooklyn Federal Courthouse)లో అవినీతి ఆరోపణలకు సంబంధించి గౌతమ్ అదానీపై అభియోగాలు నమోదయ్యాయి. ఇందులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీ, వినీత్ జైన్ సహా ఎనిమిది మందిపై అభియోగాలు మోపబడ్డాయి. కేసు విషయానికి వస్తే భారత్‌లో సౌర విద్యుత్ కాంట్రాక్టులను (సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు) పొందేందుకు ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,100 కోట్లు) లంచంగా ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కాంట్రాక్టులు 20 సంవత్సరాల కాలంలో రూ. 16,880 కోట్లకు పైగా లాభాలను ఆర్జించేలా రూపొందించబడ్డాయని యూఎస్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ, అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ వంటి సంస్థలు అమెరికా, ఇతర దేశాలకు చెందిన పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి రుణాలు మరియు బాండ్ల రూపంలో సుమారు 3 బిలియన్ డాలర్లకు పైగా నిధులను సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read: Donald Trump: భారత్ సూటి ప్రశ్న.. తడబడ్డ ట్రంప్.. పరువు మెుత్తం పోయిందిగా!
అమెరికా చట్టాల ఉల్లంఘన
అదానీ గ్రీన్ ఎనర్జీ, అజూర్ పవర్ సంస్థలు.. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయ్యి ఉండటంతో అమెరికా పెట్టుబడిదారుల నిధులను ఉపయోగించి భారత్‌లో లంచాలు ఇవ్వడం అమెరికా చట్టాల ప్రకారం (Foreign Corrupt Practices Act) ఉల్లంఘనగా పరిగణించబడింది. ఈ కారణంగా న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు మరియు SEC సివిల్ కేసు నమోదు చేశాయి. ఈ లంచాల్లో 80% కంటే ఎక్కువ మాజీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశం గతంలో ఏపీలోని అధికార టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇదిలా ఉంటే తమపై వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. వీటిని నిరాధారమైనవిగా కొట్టిపారేసింది.