Gadwal District: విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారాన్ని సమయానికి అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(Collector BM Santosh)అధికారులను ఆదేశించారు.ఇటీవల జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తేవడంతో ఆయన వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే అలంపూర్ చౌరస్తాలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను తనిఖీ చేసి పౌష్టికాహారం అందించడంలో విఫలం, విధుల పట్ల అలసత్వం వహించిన అసిస్టెంట్ వార్డెన్ ,సూపర్వైజర్ ను సస్పెండ్ చేయగా, గోనుపాడు కేజీవీబీ పాఠశాలలో తనిఖీ చేసి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడంలో విఫలమైనందుకు ప్రధానోపాధ్యాయురాలికి మెమో జారీ చేశారు.
Also Read: Gadwal district: గద్వాల జిల్లా కలెక్టర్‌కు అరుదైన గౌరవం.. సన్మానించిన ఉద్యోగులు
పుటాన్ పల్లి సమీపంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ను తనిఖీ చేశారు. షెడ్యూల్ కులాల హాస్టల్ ను తనిఖీ చేయగా గంజిపేటలోని అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు అనంతరం ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మౌలిక సదుపాయాల కొరతకు గురవుతున్న విద్యార్థులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాత్రి స్వయంగా వసతిగృహాన్ని సందర్శించి విద్యార్థులు,ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను విని, తక్షణ చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం విషయంలో ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలనీ, వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని సూచించారు.
హాస్టల్ వార్డెన్ పై విచారణకు ఆదేశం
హాస్టల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు పలుమార్లు విన్నవించినా స్పందించకపోగా తమతో పని చేయిస్తూ అనవసరంగా నోరు పారేసుకునేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.వసతిగృహ వార్డెన్‌పై విచారణ జరిపి పూర్తి నివేదికను అందజేయాల్సిందిగా జిల్లా బీసీ సంక్షేమ అధికారి నిశితను ఆదేశించారు. వసతిగృహంలోని భోజన నాణ్యతపై వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో అందుతున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారి నియమించడం జరుగుతుందని తెలిపారు.
ఫుడ్ మెనూ ప్రకారం ప్రతి రోజు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యతను అధికారులు కచ్చితంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు.ఆహార నాణ్యతపై పర్యవేక్షణకు వసతిగృహంలో మూడు మంది విద్యార్థులతో కూడిన ప్రత్యేక ఫుడ్ కమిటీని ఏర్పాటు చేయాలని, వారు వంటకు ముందు సరఫరా అయ్యే పదార్థాలను పరిశీలించి స్టాక్ రిజిస్టర్‌పై సంతకం చేయాలని ఆదేశించారు. వంట అనంతరం భోజన నాణ్యతను పరిశీలించి ఏమైనా లోపాలు ఉంటే ముందుగా తెలియజేయాలన్నారు.
ప్రత్యేక ఫోన్ నంబర్
కమిటీ సభ్యులను ప్రతి నెల నూతనంగా ఎంపిక చేయాలని, కమిటీ సభ్యులు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మెనూను పాటించకపోతే ఫిర్యాదు చేయేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వసతిగృహంలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు,మరమ్మతులు తక్షణమే చేపట్టి విద్యార్థులకు అనుకూలమైన,శుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
Also Read: Viral Vayyari song: సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసిన ‘వైరల్ వయ్యారి’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..