Viral Video: సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అందరూ అంటుంటారు. అందుకే కొందరు సరిహద్దులు దాటి మరి వివాహాలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన ఓ మహిళ (Russian Women).. గతంలో ఒక భారతీయుడ్ని వివాహం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే తన భర్తను పెళ్లి చేసుకోవడానికి గల 3 కారణాలను తాజాగా వెల్లడించి.. ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఆమె చెప్పిన రీజన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రష్యన్ మహిళ ఏం చెప్పారంటే?
భారతదేశంలో నివసిస్తున్న రష్యన్ మహిళ క్సేనియా చావ్రా (Kseniia Chawra).. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తన భర్తను ఈ మూడు కారణాల చేత వివాహం చేసుకున్నట్లు ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘ప్రపంచంలోనే ఉత్తమ భర్త.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే క్యాప్షన్ ను వీడియోకు పెట్టారు. తన భర్త, బిడ్డతో గడుపుతున్న అందమైన జీవితాన్ని ఆ వీడియోలో పంచుకున్నారు. అదే సమయంలో ‘3 Reasons Why I Married an Indian Man’ అని వీడియోలో చూపించారు.
మూడు కారణాలు ఇవే
తను పోస్ట్ చేసిన వీడియోలోనే తన భర్తను పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను ఒక్కొక్కటిగా టెక్స్ట్ రూపంలో తెలియజేశారు. అవి ఏంటంటే..
1. అతను ఎప్పుడూ నాకు వంట చేస్తాడు.
2. అతను అందమైన బిడ్డను కలిగించాడు.
3. అతను నన్ను ప్రేమిస్తాడు. ఎప్పుడూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు.
View this post on Instagram
నెటిజన్ల రియాక్షన్
తన భర్త గురించి క్సేనియా చావ్రా చేసిన పోస్ట్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జంట అనుబంధంపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు 2.2 మిలియన్లకు పైగా వీక్షణలు, వందలాది కామెంట్లు రావడం విశేషం. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ ‘మీరు, మీ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. మరొకరు స్పందిస్తూ ‘మీ పోస్ట్ చాలా హృదయాలను తాకింది. ఇది చూసి మీ భర్త చాలా సంతోషిస్తాడు’ అని అన్నారు. ఇంకొకరు ‘మీ భర్త వంట గురించి చేసిన వ్యాఖ్య చాలా క్యూట్ గా ఉంది’ అంటూ ప్రశంసించారు. మెుత్తంగా రష్యన్ మహిళ చేసిన పోస్ట్.. సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read: India on US Tariff: అమెరికా, ఈయూకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. లెక్కలు తీసి మరి చురకలు!
ఇదేం తొలిసారి కాదు..
విదేశీ మహిళ భారత్ కు వచ్చి ఇక్కడి వ్యక్తులు, కల్చర్ పై ప్రశంసలు కురిపించడం ఇదేం తొలిసారి కాదు. కంటెంట్ క్రియేటర్ క్రిస్టెన్ ఫిషర్ (Kristen Fischer) నాలుగేళ్ల క్రితం భారత్ వచ్చి.. తనలో వచ్చిన 10 మార్పుల గురించి వివరించారు. భారతీయ వంటకాలు నేర్చుకోవడం, శాకాహారిణిగా మారడం, షాపింగ్‌లో బేరసారాలు చేయడం వంటి మార్పులు తన జీవితాన్ని మరింత నాణ్యవంతంగా మార్చాయని అన్నారు. ఆమె ఢిల్లీ మెట్రోలో ప్రయాణించడం, చీరలు ధరించడం, కుమార్తెలతో ఆనందంగా గడపడం వంటి దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.