Sri Satya Sai District: కుటుంబ సభ్యుల సమక్షంలో కలకాలం కలిసి జీవిస్తామని ఆ జంట హామీ ఇచ్చింది. పచ్చని పందింట్లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యింది. ఎన్నో ఆశలతో జీవితాన్ని ప్రారంభించిన మర్నాడే యువతి ఆత్మహత్య చేసుకోవడం ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ విషాదం.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సోమవారం పెళ్లి..
సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతులకు హర్షిత (22) అనే కూతురు ఉంది. కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్ర (Nagendra)తో ఆమె వివాహం సోమవారం (ఆగస్టు 4, 2025) ఉదయం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. పిల్లాపాపలతో కలకాలం హాయిగా దీవించాలని అంక్షితలు వేశారు.
వధువు సూసైడ్..
ఉదయం ఘనంగా వివాహం జరగడంతో సంప్రదాయం ప్రకారం.. నూతన వధూవరులకు సోమవారం రాత్రి ఫస్ట్ నైట్ నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు సైతం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గదిలోకి వెళ్లిన నవ వధువు హర్షిత (Harshitha) లోపలి నుంచి గడి పెట్టుకుంది. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తలుపులు పగలగొట్టి చూడగా.. గది పైకప్పునకు ఉరివేసుకొని హర్షిత వేలాడుతూ కనిపించింది.
Also Read: Telangana PCB: ఆ శాఖలో అధికారులదే పెత్తనం.. మంత్రిని సైతం లెక్క చేయని వైనం..!
ఫ్రెండ్స్‌తో మాట్లాడిన అరగంటకే..
దీంతో షాక్ కు గురైన కుటుంబ సభ్యులు.. ఆమెను హుటాహుటీనా పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే హర్షిత మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న దానిపై క్లారిటీ లేదు. అయితే సోమవారం సాయంత్రం ఐదుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయితో హర్షిత విడిగా మాట్లాడినట్లు సమాచారం. వారు వచ్చి వెళ్లిన అరగంటకే హర్షిత ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. పెళ్లికి ముందు హర్షిత హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, వరుడు నాగేంద్ర.. బీఎండబ్ల్యూ కంపెనీ అకౌంటెంట్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలియజేశారు.