Heavy Rains: గ్రేటర్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. కొద్ది రోజులుగా నగరంలో పొడి వాతావరణం నెలకొన్నా, భారీగా వర్షం కురవడంతో సిటీలోని పలు ప్రాంతాలు అతలాకుతలంగా మారాయి. గచ్చిబౌలి(Gachibowli)పరిధి ఖాజాగూడలోని లాంకో హిల్స్ సర్కిల్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా చెట్టుపై పిడుగు పడింది. దీంతో జనం భయపడి పరుగులు తీశారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాహనదారులు ఒకింత భయాందోళనకు గురయ్యారు.
ముఖ్యంగా నగరంలోని లక్డీకాపూల్,(Lakdikapool) బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, చార్మినార్, బషీర్‌బాగ్, నాంపల్లి, ఆర్టీసి క్రాస్ రోడ్డు, బేగంపేట, మెహిదీపట్నం, టోలీ చౌకీ, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, పాతబస్తీ, చార్మినార్, రాజేంద్రనగర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో సుమారు రెండున్నర గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. ఫలితంగా రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. బంజారాహిల్స్‌లో భారీ వృక్షం నేలకొరగడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది. ఎల్లారెడ్డి గూడలో వర్షపు నీరు ఇళ్లలోకి వెల్లడంతో నిత్యావసర వస్తువులు తడిచిపోయాయి.
Also Read: Guvvala Balaraju: గులాబీని ఖాళీ చేసేలా కమలం స్కెచ్.. లోకల్‌కు ముందే దెబ్బకొటేలా ప్లాన్
అమీర్‌పేట(Ameerpet)లోని ఇమేజ్ హాస్పిటల్ ఏరియా కూడా ముంపునకు గురైంది. వర్షం సహాయక చర్యల్లో నిమగ్నమైన హైడ్రా(HYDRA) అధికారులు నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్పా, బయటకు రావద్దని సూచించారు. సైఫాబాద్ కామత్ హోటల్‌కు లంచ్‌కు వచ్చిన కొందరు వినియోగదారులు భారీ వర్షం కారణంగా హోటల్‌లోనే చిక్కుకున్నారు. హోటల్‌లోకి భారీగా వర్షం నీరు ప్రవహించడంతో వినియోగదారులు ఇబ్బందుల పాలయ్యారు.
రాజ్ భవన్(Raj Bhavan) వంటి రద్దీ ప్రాంతాల్లో నీరు నిల్వగుండా గతేడాది అధికారులు ఏర్పాటు చేసిన వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్‌లు పూర్తిగా నిండి, వరద నీరు బయటకు ప్రవహించడంతో రాజ్‌భవన్(Raj Bhavan) రోడ్డులో భారీగా వరద నీరు నిలిచింది. ఫలితంగా ఖైరతాబాద్ నుంచి అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట వరకు, ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్, నాంపల్లి, బషీర్ బాగ్, కోఠి వైపు వెళ్లే రహదారుల్లో సుమారు గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వర్షం తగ్గిన తర్వాత భారీగా వాహనాలు రోడ్లపైకి రావడంతో ఖైరతాబాద్, తెలుగుతల్లి, బేగంపేట ఫ్లై ఓవర్లపై వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
తక్కువ సమయంలో ఎక్కువ వర్షం
నగరంలో ప్రస్తుతం నిజాం కాలం నాటి వరద నీటి కాలువులు, నాలాలే అందుబాటులో ఉన్నాయి. కాలక్రమేనా ఇప్పటి వరకు ఈ కాలువలు, నాలాలు సుమారు 61 శాతం కబ్జాల పాలైనట్లు హైడ్రా(Hydra) ఇటీవలే ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇప్పటికే బక్క చిక్కిపోయిన వరద నీటి కాలువలు, నాలాలు ఓ గంట వ్యవధిలో కేవలం రెండు సెంటీమీటర్ల వర్షానిక సైతం తట్టుకునే పరిస్థితి లేదు. కానీ, సోమవారం కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే దాదాపు 12 సెంటీమీటర్ల వర్షం కురవడంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. ఫలితంగా అప్పటికే అప్రమత్తంగా ఉన్న హైడ్రా బృందాలు సైతం పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం కష్టతరంగా మారింది. వర్షానికి సిటీలోని మొత్తం 166 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ అయినట్లు జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదుల వచ్చినట్లు అధికారులు తెలిపారు.
బంజారాహిల్స్‌లో 11.23 సెం.మీ.ల వర్షపాతం నమోదు
బంజారాహిల్స్‌లో సుమారు 11.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మల్కాజ్‌గిరి సఖీ సెంటర్ వద్ద అత్యల్పంగా 17.3 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. షేక్‌పేటలో 74.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఆసిఫ్‌నగర్‌లో 53.3 మీ.మీ.లు, ఖైరతాబాద్‌లో 50.8 మీ.మీలు. ఖైరతాబాద్ సెజ్ ప్రాంతంలో 36.3, అమీర్‌పేటలో 34.8, మెహిదీపట్నం 30.5 మీ.మీ.ల వర్షపాతం నమోదు కాగా, రాజేంద్రనగర్‌లోని ఆర్డీవో ఆఫీస్ ఆవరణలో 29.3, బహద్దూర్ పురా సెట్విన్ సెంటర్ ఆవరణలో 27.8 మీ.మీ.లు, బాలానగర్‌లో ఓల్డ్ సుల్తాన్‌నగర్‌లో 27.5, కాప్రా 29.3, ఉప్పల్ రాజీవ్‌నగర్‌లో 23.3 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దు : కమిషనర్ కర్ణన్
భారీ వర్షం కురిసినా, మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన రావడంతో నగరవాసులు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. వర్షం కురుస్తున్నప్పుడు, కురిసిన తర్వాత సహాయక చర్యల కోసం నగరవాసులు 040-21111111 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. విపత్తుల నివారణ కోసం 9000113667 కాల్ చేయాలని అధికారులు సూచించారు.
Also Read: Weight Loss: 7 నెలల్లో 35 కేజీల బరువు తగ్గిన మహిళ… ఆమె చెప్పిన సీక్రెట్స్ ఇవే