Modi-Murmu
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Kashmir: జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ?.. సైలెంట్‌గా కీలక పరిణామం!

Kashmir:

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ, అమిత్ షా వరుస భేటీలు
రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమేనా?
కేంద్ర మనసులో ఏముంది?

Kashmir: జమ్మూ కశ్మీర్‌కు కేంద్ర ప్రభుత్వం తిరిగి రాష్ట్ర హోదా పునరుద్ధరించనుందా?, ఈ అంశంపై కేంద్ర పెద్ద సంప్రదింపులు జరుగుతున్నారా? అంటే, స్పష్టమైన సమాధానమైతే లేదు గానీ, ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా జోరుగా ఊహాగానాలు, వీటికి బలం చేకూర్చే కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు, పూర్వ జమ్మూ కశ్మీర్ రాష్ట్ట్ర బీజేపీ అధ్యక్షుడితో అమిత్ షా భేటీ కావడం కూడా ఈ చర్చలకు దారితీసింది. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (ఆగస్టు 5) ఎన్డీయే ఎంపీలతో సమావేశం కానున్నారనే సమాచారం కూడా ఈ ఊహాగానాలకు తావిస్తోంది. కాగా, 2019లో ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆర్టికల్ 370 రద్దుకు ఆరేళ్లు పూర్తి కావడానికి రెండు రోజుల ముందే ఈ కీలక పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఆగస్టు 3న రాష్ట్రపతి ముర్మును ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ సమావేశానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి వివరాలు విడుదల చేయలేదు. సాధారణంగా అయితే ఇలాంటి సమావేశాలకు సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటన విడుదల చేస్తుంది. కానీ, అలాంటిదేమీ జరగలేదు. మోదీ కలిసొచ్చిన కొన్ని గంటల తర్వాత అమిత్ షా కూడా రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ నెల మొదటి రెండు రోజుల్లో అమిత్ ప్రత్యేకంగా జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ సాత్ శర్మ, లద్దాఖ్ లెఫ్టనెంట్ గవర్నర్ కవీంద్ర గుప్తాతో సంప్రదింపులు జరిపారు. అంతేకాదు, సోమవారం, అఖిల జమ్మూ కశ్మీర్ షియా అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్రాన్ రజా అన్సారీ.. అమిత్ షాను కలిశారు. జమ్మూ కశ్మీర్‌‌లోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.

సోషల్ మీడియా జోరుగా ఊహాగానాలు
న్యూఢిల్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించేందుకేనంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పలువురు రాజకీయ నిపుణులు కూడా జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించేందుకేనంటూ చెబుతున్నారు. పైకి అంతా నిశ్శబ్దంగా కనిపిస్తున్నా ఈ పరిణామాల వెనుక పక్కా రాజకీయ ప్రణాళిక ఉందనే అంచనాలు నెలకొన్నాయి. మాజీ ఆర్మీ అధికారి, రచయిత కన్వల్ జీత్ సింగ్ ధిల్లన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఆగస్టు 5న ఏదైనా ప్రకటన ఉండే అవకాశం ఉందంటూ భారీగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. పెద్ద సంఖ్యలో జనాల ప్రాణాల మూల్యంగా కశ్మీర్‌లో శాంతి నెలకొంది. మళ్లీ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ప్రస్తుతం శాంతి పునరుద్ధరణ దశలో ఉన్నాం. వ్యవస్థ స్థిరపడేంత వరకు వేచి చూడాలి. తొందరపాటుతో ఏ నిర్ణయమూ తీసుకోవద్దు’’ అని కన్వల్ జీత్ సింగ్ హెచ్చరించారు. రాజకీయ విశ్లేషకురాలు ఆర్తీ టికూ సింగ్ కూడా కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ప్రకటించబోతోందన్నట్టుగా బలమైన ప్రచారం నడుస్తోందని అన్నారు. మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, జమ్మూ, కశ్మీర్‌ను విడదీసి రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయబోతున్నారంటూ కొన్ని వదంతులు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయని ఆమె అన్నారు.

Read Also- GHMC: గూగుల్‌‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న జీహెచ్ఎంసీ

రాష్ట్ర హోదా కోరుతూ డిమాండ్లు
జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కోరుతూ చాలాకాలంగా జోరుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కేంద్ర తీసుకున్న ఈ చర్యతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దయింది. పాలన పూర్తిగా లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అంటే, కేంద్రం ఆధీనంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలుమార్లు హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు నిర్దిష్టమైన గడువు ఏదీ వెల్లడించలేదు.

Read Also- Weight Loss: 7 నెలల్లో 35 కేజీల బరువు తగ్గిన మహిళ… ఆమె చెప్పిన సీక్రెట్స్ ఇవే

మళ్లీ ఎన్నికలు జరుగుతాయా?
జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా ఉంటుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. చివరిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న సమయంలో జరిగాయి కాబట్టి, రాష్ట్ర హోదా ఇచ్చాక తాజాగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందనే చర్చ మొదలైంది. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జూన్ నెలలో ఈ అంశంపై స్పందిస్తూ, తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చిన తర్వాత శాసనసభ రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తనకు అభ్యంతరం లేదని అన్నారు. ఎన్నికలను ఎవరూ అడ్డుకోబోరని చెప్పారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు