Pragya Thakur: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ పేలుళ్ల కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రగ్యా థాకూర్ (Pragya Thakur) ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డారు. అయితే, తీర్పు వెలువడిన కొన్ని రోజుల తర్వాత ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లు చెప్పాలంటూ నాడు తనను చిత్రహింసలు పెట్టారని ప్రగ్యా ఠాకూర్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు తదితరుల పేర్లు కూడా చెప్పాలంటూ బలవంతంగా ఒత్తిడి చేశారని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ పేర్లు చెప్పు, మేము నిన్ను కొట్టము అని హెచ్చరించేవారు. వాళ్ల ముఖ్య ఉద్దేశమే నన్ను చిత్రహింసలకు గురిచేయడమే’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంపై ప్రగ్యా థాకూర్ ధ్వజమెత్తారు. ఈ కేసు పూర్తిగా కుట్ర అని ఆరోపించారు. హిందుత్వవాదులను, దేశ భద్రతా బలగాలను అపహాస్యం చేయడం కోసం కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని నడిపిందని ఆమె ఆరోపించారు.
ఈ కేసులో తాజాగా వెలువడిన తీర్పు ధర్మ విజయమని ప్రగ్యా థాకూర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఒక తప్పుడు కేసు పెట్టిందని, దీని వెనక కుట్ర దాగి ఉందని ఆమె పేర్కొన్నారు. వాళ్ల వద్ద ఏ ఆధారమూ లేదని, కాంగ్రెస్ అంటేనే సనాతన ధర్మానికి వ్యతిరేకమని, ఉగ్రవాదులకు ఆహారం పెట్టే పార్టీ అని ఆరోపించారు. అలాంటి పార్టీకి దేశభక్తి ఉండదని ప్రగ్యా ఠాకూర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
Read Also- Viral News: భారతీయులు విదేశాలకు వెళ్తే వెనక్కి రానిది అందుకేనా!
ఆరోగ్యం చెడింది
తనకు సరైన వైద్య సదుపాయాలు కల్పించలేదని, ఏదో అలా ఇవ్వాలి కాబట్టి ఇచ్చారని ప్రగ్యా థాకూర్ పేర్కొన్నారు. ‘‘నాకు సరైన వైద్య సేవలు అందించలేదు. కేవలం బతికి ఉండేందుకు కావలసినంత మాత్రమే చికిత్స అందించారు. అందుకే పూర్తి బలహీనమయ్యాను’’ ప్రగ్యా థాకూర్ ఆవేదన వ్యక్తంచేశారు. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన శక్తివంతమైన పేలుళ్ల కేసులో, 17 ఏళ్ల తర్వాత ఇటీవలే తీర్పు వచ్చింది. తీర్పు వెలువరించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు.. లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పూరోహిత్, ప్రగ్యా థాకూర్‌తో పాటు ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కేవలం అనుమానాల ఆధారంగా కేసును కొనసాగించలేమని ప్రత్యేక జడ్జి స్పష్టం చేశారు. నిందితులపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
Read Also- Viral News: భారతీయులు విదేశాలకు వెళ్తే వెనక్కి రానిది అందుకేనా!
ఏటీఎస్ మాజీ అధికారి కూడా కీలక వ్యాఖ్యలు
మాలేగావ్ కేసు తీర్పు అనంతరం ఏటీఎస్‌కు (మహారాష్ట్ర యాంటీ టెరరిజం స్క్వాడ్) చెందిన మెహబూబ్ ముజావర్ అనే ఓ మాజీ అధికారి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘కాషాయ ఉగ్రవాదం’ కోణాన్ని ప్రజల మెదళ్లలో జొప్పించేందుకుగానూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు మరికొందర్ని అరెస్ట్ చేయాలంటూ, ఆ సమయంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న పరమ్ బీర్ సింగ్ ఒత్తిడి చేశారని అన్నారు, మోహన్ భగవత్‌ను అరెస్ట్ చేయాలంటూ ఆదేశించారని ముజావర్ పేర్కొన్నారు. ‘‘ఊహించిన దానికంటే ఎక్కువ ఒత్తిడి చేశారు. మోహన్ భగవత్, ‘రామ్ కల్సంగ్రా, సందీప్ డాంగే, దిలీప్ పాటిదార్‌లను అరెస్టు చేయాలంటూ పరమ్ బీర్ సింగ్ నన్ను ఆదేశించారు. ఆయనకంటే పై స్థాయి అధికారులు కూడా సూచన చేశారు. కానీ, మోహన్ భగవత్‌ను అరెస్టు చేయడం నా పరిధిలోకి రాదు. మహారాష్ట్రలో ఆయన ప్రభావం చాలా ఎక్కువ’’ అని ముజావర్ చెప్పారు. ఈ మేరకే ఇటీవల ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు.