Bc reservation bill: రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్కెచ్‌లో కేంద్రం ఇరుక్కున్నట్లు కాంగ్రెస్ (Congress) భావిస్తున్నది. తాము పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లు, ఆర్డినెన్స్‌పై ఏం నిర్ణయం తీసుకోవాలో కేంద్రానికి అర్ధం కావట్లేదని టీ కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు, ఆర్డినెన్స్ పెండింగ్ పడేందుకు కేంద్రం పరోక్షంగా సహకరిస్తుందని అంటున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర బిల్లు, ఆర్డినెన్స్ పెండింగ్‌కు పొలిటికల్ కారణాలే అంటూ కాంగ్రెస్(Congress) వివరిస్తున్నది. తమకు ఎక్కడ మైలేజ్ వస్తుందోనని బీజేపీ భయాందోళనకు గురవుతున్నట్లు స్తృతంగా ప్రచారం చేస్తున్నది.
ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)చేస్తున్న పాదయాత్రల్లో ఈ అంశాలనే హైలెట్ చేస్తూ జనాలకు వివరిస్తున్నారు. బీసీలకు లబ్ధి పొందాలని కాంగ్రెస్ వేసిన ప్రణాళికను బీజేపీ(BJP) అడ్డుకుంటుందని జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గాలు బీజేపీ(BJP)కి దూరంగా ఉండాలంటూ కాంగ్రెస్(Congress) నేతలు పిలుపునిస్తున్నారు.
Also Read: Telangana Cabinet Meeting: బీసీ రిజర్వేషన్ల అమలుపైనా డిస్కషన్..
ప్రజల్లోకి పక్కా ప్లాన్‌తో..
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ బిల్లు, ఆర్డినెన్స్ పెండింగ్ పడేందుకు కారణాలు, బీజేపీ(BJP) తప్పిదాలు, నిర్లక్ష్యం వంటి వాటిపై కాంగ్రెస్(Congress) పబ్లిక్‌లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్లాన్ చేసింది. తద్వారా మరింత మైలేజ్ పొందాలని హస్తం పార్టీ ముందుకు సాగుతున్నది. వాస్తవానికి రాష్ట్రంలో బీఆర్ఎస్(Brs) కంటే బీజేపీనే కాంగ్రెస్ ప్రత్యర్థిగా తీసుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ బొక్కబోర్లా పడిందని, ఆ పార్టీ ఇంకా పైకి లేవదని కాంగ్రెస్(Congreess) నేతలు లైట్ తీసుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీని డ్యామేజ్ చేస్తూ రాజకీయం చేయాలనేది లక్ష్యం. దీని వలన పదేళ్ల పాటు పవర్‌లో సులువుగా ఉండవచ్చని టీ కాంగ్రెస్ ఆశిస్తున్నది. ఏఐసీసీ నేతలు కూడా స్టేట్ కాంగ్రెస్‌కు ఇదే స్ట్రాటజీని వివరించినట్లు సమాచారం.
వీడని చిక్కుముడి
రాష్ట్రంలో కులగణన సర్వే ప్రకారం సేకరించిన ఎంపిరికల్ డేటా ఆధారంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని బిల్లు రూపంలో తయారు చేసి ప్రభుత్వం రాష్ట్రపతికి పంపించింది. కానీ, ఇప్పటి వరకు ఆ బిల్లుకు ఆమోదం లభించలేదు. అక్కడి నుంచి అప్రూవల్ వస్తేనే విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యమవుతుంది. మరోవైపు, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు గత ప్రభుత్వం విధించిన రిజర్వేషన్ల సీలింగ్‌ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్‌కు పంపించింది.
వారం రోజుల్లో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం లభిస్తుందని కాంగ్రెస్ ఆశించింది. గవర్నర్ కూడా ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపించారు. దీంతో ఇటు బిల్లు, ఆర్డినెన్స్ రెండు క్లియర్ అయ్యే అవకాశం తక్కువేనని కాంగ్రెస్ నేతలు ఇంటర్నల్‌గా మదన పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ చిక్కుముళ్లు వీడితేనే బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యమవుతుంది. ఇదే అంశంపై మూడు రోజుల పాటు ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేక ప్రోగ్రామ్‌లను నిర్వహించనున్నది. దీనిలో అన్ని పార్టీలతో పాటు బీసీ కుల సంఘాలనూ భాగస్వామ్యం చేయనున్నది. అయితే, ఈ పీఠముడికి ఎప్పుడు పరిష్కారం లభిస్తుందోనని టీ కాంగ్ నేతలు ఆశతో ఎదురుచూస్తున్నారు.
పార్టీ పరంగా..
రాష్ట్రపతి, గవర్నర్ నుంచి బిల్లు, ఆర్డినెన్స్‌లకు అప్రూవల్ లభించకపోతే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఓ దఫా ప్రభుత్వ పెద్దలు, పీసీసీ టీమ్ ఈ అంశంపై చర్చించారు. పార్టీ పరంగా సీట్లు కేటాయిస్తే ఏయే నియోజకవర్గాల్లో ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు, పబ్లిక్‌తో మమేకమైన వారు ఎవరు, ఇలాంటి తదితర వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. దీనిపై పార్టీ పరంగా రిపోర్ట్ తయారు చేయాలని సీఎం కూడా పీసీసీ చీఫ్‌ను కోరినట్లు సమాచారం.
ఇప్పటికే బీజేపీ కూడా పార్టీ పరంగా 42 శాతం ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్(Congress) కూడా అదే లైన్‌లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిల్లు, ఆర్డినెన్స్‌లకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడానికి కేంద్రమే కారణమంటూ బీజేపీని కాంగ్రెస్ దోషిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నది. వాస్తవానికి రాష్ట్రంలో కుల గణన మొదలు పెట్టిన కొన్ని రోజులకే కేంద్రం కూడా జనగణన చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్‌కు మైలేజ్ రాకూడదనే ఈ ప్రకటన అంటూ గతంలో పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. ఇప్పుడు బిల్లులు, ఆర్డినెన్స్‌ను అడ్డుకున్నారంటూ తీవ్రస్థాయిలో బీజేపీని డ్యామేజ్ చేయాలని హస్తం పార్టీ ముందుకు సాగుతున్నది. అయితే, ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న క్షేత్రస్థాయిలోని బీసీ లీడర్లు అయోమయంలో ఉన్నారు. తమకు సీట్లు లభిస్తాయా లేదా అని టెన్షన్ పడుతున్నారు.