US Tariffs: భారత దిగుమతులపై 25 శాతం సుంకాలు (US Tariffs) విధిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ట్రంప్ చేసిన ప్రకటనను గమనించామని, ప్రస్తుతం అంశంపై అధ్యయనం చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు విషయంలో భారత్ స్థిరమైన విధానాన్ని కొనసాగిస్తోందని, దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్లోబల్ మార్కెట్లో లభించే ఉత్తమ ఆఫర్ల ఆధారంగా ఆయిల్ కొనుగోలు చేస్తుందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఏ దేశంతోనైనా భారత్ సంబంధాలు స్వతంత్రంగా, ప్రయోజనాల ఆధారంగా ఉంటాయని, మధ్యలో మూడో దేశం కోణంలో భారత్ సంబంధాలను చూడొద్దని ఆయన స్పష్టం చేశారు. ‘‘మూడో దేశం కోణంలో మా ద్వైపాక్షిక సంబంధాలను చూడకూడదు. రష్యాతో భారత్‌కు స్థిరమైన, అత్యంత సంక్లిష్ట సమయాల్లో కూడా భాగస్వామ్యం కొనసాగింది’’ అని జైస్వాల్ వివరించారు. భారత్ తన ఇంధన అవసరాల్ని తీర్చుకునే విషయంలో మార్కెట్లలో ఉండే అవకాశాలు, ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థలు రష్యా నుంచి ఇంధన కొనుగోలు నిలిపేశాయంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థలో వెలువడిన కథనంపై స్పందిస్తూ, అలాంటి సమాచారం ఏమీ తమ దృష్టికి రాలేదని క్లారిటీ ఇచ్చారు.
Read also- Lung Cancer: ధూమపానం అలవాటు లేనివారికి అలర్ట్.. నిర్లక్ష్యం చేయకండి
దానిపై నో కామెంట్
పాకిస్థాన్ భవిష్యత్‌లో భారత్‌కు ఇంధనం విక్రయిస్తుందేమో అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు రణధీర్ జైస్వాల్ నిరాకరించారు. ‘‘ఆ ప్రకటనపై మేము మాట్లాడటానికి ఏమీ లేదు’’ అని స్పష్టం చేశారు. అమెరికా-పాకిస్థాన్ మధ్య ఆయిల్ ఒప్పందం ప్రకటించిన సందర్భంగా ట్రంప్ స్పందిస్తూ, “ఎవరికి తెలుసు.. ఏదో ఒక రోజు పాకిస్థాన్ ఇంధనాన్ని భారత్‌కి విక్రయిస్తుందేమో!” అంటూ ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాకిస్థాన్ చమురు వనరుల అభివృద్ధికి సంబంధించిన ఒప్పందం ప్రకటన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also- Supreme Court: అంత సున్నితత్వం ఎందుకు?.. బీజేపీ నేతపై సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు
భారత్-అమెరికా సంబంధాలపై..
భారత్-అమెరికా సంబంధాలపై రణధీర్ జైస్వాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత-అమెరికా సంబంధాలు అనేక మార్పులు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పటిష్టంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. పరస్పరం నమ్మకం ఆధారంగా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు. ఇరుదేశాల బంధాల విషయంలో గతంలోనూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. “భారత్, అమెరికా మధ్య ఉన్న వాస్తవిక, వ్యూహాత్మక భాగస్వామ్యం… ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య బలమైన సంబంధాలపై ఆధారపడి ఉంది. ఇరుదేశాలూ అసలైన అజెండాపైనే దృష్టి సారిస్తున్నాయి’’ అని జైస్వాల్ చెప్పారు. ఈ బంధాలు ముందుకు కొనసాగుతాయనే నమ్మకం ఉందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also- Hyderabad: దొంగతనం కేసులో బాధితుడినే మోసం చేసిన హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు