Vice President Poll: గత నెలలో జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. తదుపరి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను ఎన్నికల కమిషన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఈ ఎన్నికకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను ఆగస్టు 7న విడుదల చేయనున్నట్టు తెలిపింది. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 21గా నిర్ణయించింది. పోలింగ్ జరిగే రోజు సెప్టెంబర్ 9న ఎన్నిక ఫలితాలను కూడా ప్రకటిస్తామని ఈసీ వివరించింది. కాగా, భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలు, రాజ్యసభలో ఎన్నికైన, నామినేట్ అయిన ఎంపీలు ఓట్లు వేయాల్సి ఉంటుంది.
Read Also- Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మార్నింగ్ వాక్‌లో సీఎంని కలిసి…
కాగా, జగదీప్ ధన్‌ఖడ్ జులై 21న తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన పదవీకాలం 2027 ఆగస్టు 10 వరకు ఉంది. అధికారికంగా అయితే వైద్య కారణాలను చూపి ఆయన రాజీనామా చేశారు. అయితే, కేంద్రానికి, ఆయనకు మధ్య సఖ్యత లేకపోవడంతో రిజైన్ చేసినట్టుగా జోరుగా ఊహాగానాలు వెలువడ్డాయి. న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై అభిశంసన విషయంలో విపక్షాలు అందించిన తీర్మానాన్ని చర్చకు అనుమతించడం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు రుచించలేదని చర్చ నడుస్తోంది.
సమీకరణాలు ఎలా ఉన్నాయి?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 68(2) ప్రకారం, ఉపరాష్ట్రపతి పీఠం మృతి కారణంగా, రాజీనామా లేదా తొలగింపు, ఇతర కారణాలతో ఖాళీ అయితే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు నిర్దేశిత గడువులోగా ఎన్నికల కమిషన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి, తన పదవిలో చేరిన తేదీ నుంచి పూర్తిగా ఐదేళ్లపాటు పదవిలో ఉండాలి. ఇక, త్వరలోనే జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజకీయ సమీకరణాల విషయానికి వస్తే, అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్) స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 545 కాగా, ప్రస్తుతం ఒక్క స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. ఇక, రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా, ప్రస్తుతం ఐదు ఖాళీలు ఉన్నాయి. రాజ్యసభలో ఖాళీ అయిన 5 స్థానాల్లో 4 జమ్మూ కశ్మీర్‌లోనివి కాగా, ఒకటి పంజాబ్‌కు చెందినది. పంజాబ్‌కు చెందిన ఆప్ నేత సంజీవ్ అరోరా రాష్ట్ర అసెంబ్లీ ఉపఎన్నికలో విజయం సాధించడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
Read Also- Lungs Harmful Habits: ఈ 6 అలవాట్లు మీకు ఉన్నాయా? అయితే మీ ఊరిపితిత్తులు ఢమాలే!
ఉభయ సభల్లో కలిపితే ప్రస్తుతం మొత్తం 782 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటే, విజేతగా నిలవాలంటే కనీసం 391 ఓట్లు అవసరం అవుతాయి. లోక్‌సభలో ఉన్న 542 మంది సభ్యుల్లో ఎన్డీఏకు 293 మంది మద్దతు ఉంది. రాజ్యసభలో ప్రస్తుత బలం 240 ఉండగా ఎన్డీఏకు 129 మంది మద్దతుదారులున్నారు. నామినేటెడ్ సభ్యులు కూడా ఎన్డీఏ పక్షాన ఉంటారని భావిస్తే ఈ సమీకరణం వాస్తవరూపం దాల్చుతుంది. ఈ విధంగా ఎన్డీయేకు మొత్తం 422 మంది సభ్యుల మద్దతు ఉంది.