Meenakshi Natrajan: తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను దేశంలోని పలు రాష్ట్రాలు రోల్ మోడల్‌గా తీసుకుంటున్నాయని ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natrajan) అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్ వద్ద జనహిత పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి 6 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం పరిగిలో ఏర్పాటుచేసిన సభలో మీనాక్షి మాట్లాడుతూ తెలంగాణలో చేపట్టిన కులగనణను ఇతర రాష్ట్రాలు రోల్ మోడల్‌గా తీసుకున్నట్లు తెలిపారు. అగ్రనేత రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించడం చూస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఎన్నో పథకాలు..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు సన్నబియ్యం, అర్హులకు తెల్ల రేషన్ కార్డు, పంట రుణమాఫీ వంటి ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉండాలని నటరాజన్ కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళని, ఆ ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ(Congreess Party)కి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడోయాత్రతో 3500 కిలోమీటర్లు తిరిగి ప్రజల మనోగతాన్ని తెలుసుకున్నట్లు తెలిపారు.
రాహుల్‌ను అనుసరిస్తూనే ఆయన అడుగుజాడల్లో నేడు జనహిత పాదయాతకు తాము బయలుదేరినట్లు తెలిపారు. కులగణనతో న్యాయం జరగాల్సిన కులాలకు న్యాయం జరుగుతుందని, 42 శాతం బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే, బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను సాధించుకునేందుకు ఆగస్టు 6న ఢిల్లీలో చేపట్టిన మహా ధర్నాకు ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. బీసీల న్యాయ పోరాటానికి రాహుల్, సోనియా గాంధీ, ఖడ్గే లాంటి ముఖ్య నేతలు అందరూ పాల్గొంటున్నట్లు మీనాక్షి వెల్లడించారు.
పాదయాత్రతోనే..
మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మాట్లాడుతూ పాదయాత్రల ద్వారానే మహాత్మా గాంధీ నుండి నేటి రాహుల్ గాంధీ వరకు దేశాన్ని సమూలంగా అర్థం చేసుకోగలిగారన్నారు. రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర భౌగోళికంగా కాకుండా, సామాజికపరంగా ప్రాంతాలపరంగా, జిల్లాల పరంగా యాత్ర చేసి వృద్ధుల గురించి, మహిళల గురించి కులాలు, మతాల పరంగా ఉన్న వ్యత్యాసాలను తెలుసుకున్నట్లు తెలిపారు. అందుకే భారత్ జోడో యాత్ర చరిత్ర పుట్టల్లోకి ఎక్కినట్లు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అధికారంలో ఉన్నామని, నాయకులు హైదరాబాద్‌లో ఉంటే సరిపోదని కాంగ్రెస్ పార్టీ(Congress Party) జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)పాదయాత్ర గురించి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.
కాంగ్రెస్(Congrss) అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల్లో ఉన్న పార్టీ అన్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండే అలవాటు తమదని, కేసీఆర్(KCR) 10 ఏళ్ల పాలనలో ఎంత అప్పుల్లో ఉంచారో అందరికీ తెలుసునన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నిటిని ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని, ఉచిత బస్సు మొదలుకొని మొన్న ఇచ్చిన సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ వరకు కాంగ్రెస్ ప్రజా పాలన ఏందో అర్థమవుతుందన్నారు. రెండేళ్లలో 1 లక్ష, ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే చెందుతుందన్నారు. కాంగ్రెస్ కుటుంబ పాలన కాదు, రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమొందించాలనే ఉద్దేశంతో మాకు ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు. ఇంకా మిగిలిన మూడేళ్లలో ప్రజాపాలన బంగారు పాలన చేస్తామన్నారు.
అర్హులందరికీ పథకాలు
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి( Revanth Reddy) ప్రజాపాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్(Congress) మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ కలలు కన్నా పేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి కల నిజం చేయడం జరుగుతుందన్నారు. రేషన్‌లో సన్న బియ్యం అందజేయడం జరిగిందన్నారు. రూ.80 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి,(Ranga Reddy) కాలె యాదయ్య, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అడుగులో అడుగేసి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్రలో పార్టీ ముఖ్య నేతలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రకు పెద్దఎత్తున తరలివచ్చారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ మీనాక్షి, మహేశ్ గౌడ్ ముందుకు సాగారు. పాదయాత్ర పూర్తయిన తర్వాత రాత్రి పల్లె నిద్ర చేయనున్నారు. శుక్రవారం ఉదయం శ్రమదానం చేసిన అనంతరం మధ్యాహ్నం పార్టీ నేతలతో భేటీ అవుతారు. అదేరోజు మెదక్ జిల్లా అందోల్‌లో సాయంత్రం పాదయాత్ర కొనసాగుతుంది. ఉదయం అక్కడే శ్రమదానం చేసిన తర్వాత, ఆగస్టు 2న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో, 3న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో, 4న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మీనాక్షి పాదయాత్ర చేపట్టనున్నారు.
Also Read: Komatireddy: రాష్ట్రానికే ఆదర్శంగా నల్గగొండ ఇంటిగ్రేటెడ్ స్కూల్