Komatireddy: నల్లగొండలోని జీవీగూడెం వద్ద రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఈ నెల 4న భూమి పూజ చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ పాఠశాలను రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గురువారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నమూనా, నిర్మాణ పనులపై కలెక్టరేట్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో సమీక్షించారు.
ఎన్నో ప్రత్యేకతలు
5 లక్షల 58 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ పాఠశాలలో 9 వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్స్, 3వేల మందికి ఒకేసారి భోజనాన్ని వండేలా వంటగది, 1280 మంది ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ వంటి వాటితో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అంతేకాక వాలీబాల్, సెటిల్, ఫుట్‌బాల్ తదితర కోర్టుల నిర్మాణంతో పాటు, ఓపెన్ ఎయిర్ థియేటర్, ల్యాబులు, లైబ్రరీ స్టాఫ్ రూములు, క్వార్టర్స్‌ను నిర్మించనున్నారు. వీటన్నింటిపై అధికారి బాల ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర మంత్రికి, జిల్లా కలెక్టర్‌కు వివరించారు.
మంత్రి కీలక ఆదేశాలు
22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న నల్లగొండ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో, హంగులతో కూడుకొని ఉండాలని మంత్రి తెలిపారు. 4న నిర్వహించనున్న భూమిపూజకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పాఠశాల మొత్తానికి విద్యుత్ సరఫరా చేసే విధంగా సోలార్ ప్యానళ్ళు ఏర్పాటు చేయాలని, నిర్మాణానికి అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంట్ అన్నీ ముందే సమకూర్చుకోవాలని ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌కు ఆదేశించారు.
Read Also- Rahul Gandhi: డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్ గాంధీ!
అత్యాధునిక హంగులతో..
భవన నిర్మాణాలలో ఏవైనా మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే ముందే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కోమటిరెడ్డి అన్నారు. పనులు నిరంతరం కొనసాగించి సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి అప్పగించాలని చెప్పారు. పాఠశాల పూర్తి నాణ్యతతో ఉండాలని, ఆవరణలో ఎక్కడా వర్షం నీరు, ఇతర నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. బోధనేతర సిబ్బందికి ముందుగా వసతి సౌకర్యం కల్పించేలా ఉండాలని, ఒక్కసారి విధ్యార్థి పాఠశాలలో అడుగుపెట్టిన తర్వాత మళ్లీ బయటికి వెళ్లకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, టీజీఈడబ్ల్యూ ఐడీసీ డిప్యూటీ ఇంజినీర్ శైలజ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
Read Also- Shubman Gill: టెస్టుల్లో 46 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్