Kaleshwaram Inquiry Report: కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh)కమిషన్ సమర్పించింది. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా(Rahul Bojja)కు ఈ నివేదికను అందజేసింది. దీంతో ప్రభుత్వానికి కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏముంది? అనేదానిపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. రిపోర్టులో మాజీ సీఎం కేసీఆర్(K CR)పై ఏమని ఇచ్చారు? గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, హరీశ్ రావు(Harish Rao)లపై చర్యలు తీసుకుంటారా? చర్యలు రాజకీయ నాయకులపైనా? లేకుంటే అధికారులపైనా? కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటులో ఎవరిని బాధ్యులను చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నివేదికను సీల్డ్ కవర్‌లో పెట్టి అందించడంతో అసలు వెయ్యికిపైగా పేజీలతో ఉన్న అందులో ఏయే అంశాలు ఉన్నాయి? అనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది.
Also Read: Telangana High Court: హైకోర్టులో నలుగురు ప్రమాణ స్వీకారం
ఎప్పుడేం జరిగింది?
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లోని మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో సీపేజీ సమస్యలు రావడంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణకు కమిషన్ వేసింది. 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ప్రకటించింది. ఈ కమిషన్ 15నెలలా 15రోజులపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను పరిశీలించడంతోపాటు అధికారులను, రాజకీయ నేతలను విచారించింది. 115 మందిని ఓపెన్ కోర్టులో విచారణ చేసింది. అఫిడవిట్లు అధికారికంగా స్టేట్మెంట్లను కమిషన్ తీసుకున్నది.
కొంతమందిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అయితే కమిషన్ గడువు సరిపోకపోవడంతో 8సార్లు ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 31లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో సీపీఘోష్ కమిషన్ గురువారం బీఆర్కే భవన్‌లో ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదిక అందజేశారు. ఆ నివేదికను సీఎస్‌తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. కమిషన్ ఛైర్మన్ 650 పేజీలకు పైగా నివేదికను అందజేశామని పేర్కొంటున్నప్పటికీ సుమారు వెయ్యి పేజీలకు పైగానే ఉంటుందని సమాచారం.
నివేదికలో ఏముందో?
కమిషన్ విచారణలో భాగంగా 113వ వ్యక్తిగా ఈటల రాజేందర్, 114వ వ్యక్తిగా హరీశ్ రావు,(Harish Rao) 115వ వ్యక్తిగా కేసీఆర్(KCR)ను విచారించారు. అంతకు ముందే సీపీ ఘోష్ 430 పేజీలతో నివేదికను తయారు చేసినట్లు సమాచారం. ఆతర్వాత ఈ ముగ్గురిని విచారించడంతో వెయ్యి పేజీల్లో వివరాలను నమోదు చేసినట్లు సమాచారం. అయితే సీపీ ఘోష్ ప్రభుత్వానికి అందజేసిన ప్రాజెక్టు నివేదికలో ఏం వివరాలను పొందుపర్చారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్ నిర్ణయం ప్రకారం ముందుకెళ్లామని, అన్ని వివరాలు ఉన్నాయని బీఆర్ఎస్ చెబుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ప్రాజెక్టును నిర్మించారని దీంతో ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపిస్తున్నది. అయితే, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ 2023 ఆఖర్లో కుంగడం, పియర్స్ దెబ్బతినడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఇది నిరూపయోగంగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొన్నది. లేదు మేడిగడ్డలో 87 పియర్స్ ఉండగా రెండు పియర్స్ మాత్రమే కుంగాయని, వాటికి మరమ్మతులు చేస్తే ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావచ్చని బీఆర్ఎస్ చెబుతూ వచ్చింది. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సీపేజీ సమస్యలు వచ్చాయి. దీనిపై కేంద్రానికి సైతం ఫిర్యాదు చేయడంతో విచారణ చేసింది.
టెన్షన్.. టెన్షన్
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)తో అధ్యయనం చేయించింది. లోపాలు ఉన్నట్లు విజిలెన్స్ నివేదిక అందజేసింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం మీడియా వేదికగాను స్పష్టం చేసింది. అంతేగాకుండా అసెంబ్లీలోనూ న్యాయ విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పాటు కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిషన్ సైతం విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలను సైతం అధ్యయనం చేసింది. అధికారులను, రాజకీయ నాయకులను విచారణతోపాటు అధికారికంగా తీసుకున్న స్టేట్మెంట్లను అన్నింటిని కలిపి పూర్తి డాక్యుమెంట్ తయారు చేసింది. అసలు నివేదికలో కమిషన్ ఏం చెప్పిందో అని బీఆర్ఎస్‌లో టెన్షన్ పెరిగిపోయిందని తెలుస్తోంది.
సీల్డు కవర్‌ను త్వరలోనే నిర్వహించబోయే కేబినెట్ సమావేశంలో ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. అంతేగాకుండా నివేదికపై లీగల్ ఒపినియన్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే కమిషన్ ఛైర్మన్ మాత్రం వ్యక్తుల మీద చర్యలు ఉండవని, టార్గెట్ చేయడం ఉండదని వ్యవస్ఠలపై ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. విచారణలో అధికారులు సైతం ప్రభుత్వ నిర్ణయాల మేరకు, సర్క్యూలర్ల మేరకు పనిచేశామని, గత ప్రభుత్వం చెప్పిన విధంగా చేశామని విచారణల సందర్భంగా పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కాళేశ్వరం నివేదిక (సీల్డ్ కవర్)లో ఏముందనేది మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతున్నది.
Also Read: Tsunami Warning: సునామీ భయంతో తీర ప్రాంతాల్లో కలకలం.. ప్లాట్‌లోనే ఉండిపోయిన మహిళ