US Tariff: భారత్ దిగుమతులపై 25 శాతం సుంకాలు (US Tariff:) విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి ఇంధన కొనుగోలు కారణంగా జరిమానా కూడా అదనంగా విధించబోతున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. అమెరికా టారిఫ్ ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన ప్రకటించారు. లోక్‌సభలో మాట్లాడిన తర్వాత పీయూష్ గోయల్ రాజ్యసభలో కూడా మాట్లాడారు. “భారతదేశాన్ని ఒకప్పుడు బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా పరిగణించేవారు. కానీ, నేడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే బాటలో ఉంది” అని గోయల్ అన్నారు. నిష్క్రియాత్మక ఆర్థిక వ్యవస్థ (డెడ్ ఎకానమీ) అంటూ భారత్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో గోయెల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వేగంగా ఆర్థిక వృద్ధి..
భారత ఆర్థిక వ్యవస్థ తక్కువ కాలంలోనే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. కొన్నేళ్లక్రితం ప్రపంచ 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, నేడు టాప్ 5లో స్థానం సంపాదించిందని, మరో కొన్నేళ్లలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో భారత్ ‘శుభ సంకేతం’గా కనిపిస్తున్నట్టు అంతర్జాతీయ సంస్థలు, ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారని మంత్రి గోయెల్ ప్రస్తావించారు. ప్రపంచ వృద్ధి రేటుతో భారత్ వాటా దాదాపు 16 శాతంగా ఉందని ప్రస్తావించారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని, గత పదకొండేళ్లుగా భారత ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నాయని ఆయన వివరించారు.
Read Also- Shubman Gill: టెస్టుల్లో 46 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్
అన్ని వర్గాలతో చర్చలు..
టారిఫ్‌లకు సంబంధించి అమెరికాతో జరిపిన చర్చల కాలక్రమాన్ని గోయెల్ వివరించారు. ‘‘పరస్పర టారిఫ్‌లు విధించబోతున్నట్టు ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఆ తర్వాత మూడు రోజుల్లోనే 10 శాతం ప్రాథమిక సుంకం అమల్లోకి వస్తుందన్నారు. భారత్‌పై అదనపు సుంకంతో కలిపి మొత్తం 26 శాతం టారీఫ్ అమల్లోకి వచ్చిందంటూ తిరిగి ప్రకటించారు. కానీ, దేశాల వారీగా విధించిన ఆ టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేశారు. చర్చలు జరిపేందుకు ఆగస్టు 1 వరకు గడువు ఇచ్చారు. భారత్-అమెరికా మధ్య న్యాయమైన, పరస్పర ప్రయోజనాలకు ఉద్దేశించిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై 2025 మార్చిలో చర్చలు ప్రారంభమయ్యాయి. మొదటి దశను అక్టోబర్-నవంబర్ 2025లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. మొదటి ప్రత్యక్ష భేటీలో మార్చి నెలలో ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ, వాషింగ్టన్ డీసీలో నాలుగు ప్రత్యక్ష సమావేశాలు, అనేకసార్లు వర్చూవల్ భేటీలు జరిగాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల ప్రభావాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. పరిశ్రమలు, ఎగుమతిదారుల నుంచి అభిప్రాయ సేకరణ కోసం వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వశాఖ అన్ని పక్షాలు, భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతోంది. రైతులు, కార్మికులు, పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు, వ్యాపారులు, ఎగుమతిదారుల సంక్షేమంతో పాటు వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దేశ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతాం’’ అని మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. మంత్రి గోయెల్ ప్రకటన సమయంలో విపక్షాలు వ్యతిరేక నినాదాలు చేశాయి.
Read Also- Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మార్నింగ్ వాక్‌లో సీఎంని కలిసి…