Tamil Nadu: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తమిళనాడు రాజకీయాల్లో గురువారం అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత నే ఓ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి దూరమయ్యారు. కూటమి నుంచి తప్పుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో గురువారంఉదయం ఓ పార్క్‌లో వాకింగ్ సమయంలో ఓపీఎస్ కలిశారు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరి భేటీ జరిగిన కొన్ని గంటల వ్యవధిలో ఓపీఎస్ ఈ కీలక నిర్ణయం ప్రకటించడం చర్చనీయాంశమైంది.
బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి నుంచి ఓపీఎస్ వర్గం అధికారికంగా వైదొలగుతున్నట్టుగా ఆ వర్గానికి చెందిన దిన సీనియర్ నేత, మాజీ మంత్రి రామచంద్రన్ ప్రకటించారు. ఓపీఎస్‌కు అత్యంత నమ్మకస్తుడిగా, విధేయుడిగా పేరొందిన రామచంద్రన్ మీడియా మాట్లాడుతూ.. ‘‘ఎన్డీఏ నుంచి వైదొలగుతున్నాం. ఓపీఎస్ త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తారు. ఇది త్వరలోనే ప్రారంభమవుతుంది’’ అని అన్నారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇది కీలక రాజకీయ పరిణామమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read Also- Andaman: అండమాన్ ద్వీపంలో తొలిసారి అడుగుపెట్టిన ఈడీ.. రూ.200 కోట్ల కేసు..
ప్రస్తుతానికైతే ఎలాంటి పార్టీతోనూ జత కట్టబోమని, భవిష్యత్తులో ఎన్నికలు దగ్గరపడినప్పుడు కూటములపై నిర్ణయం తీసుకుంటామని రామచంద్రన్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనా సమయంలో ఓపీఎస్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. తమిళ ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ ‘తమిళగ వెట్రి కజగంతో (TVK) భవిష్యత్‌లో కూటమి ఉంటుందా? అని మీడియా ప్రశ్నించగా, ఓపీఎస్ స్పందించారు. ‘అంతా సమయమే చెబుతుంది’ అని ఓపీఎస్ అన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఓపీఎస్ నొచ్చుకున్నారా?
ఎన్డీయే నుంచి ఓపీఎస్ బయటకు వెళ్లడం స్థానిక రాజకీయాల్లో కీలకమైనది. అయితే, ఈ పరిణామం జరగడానికి ముందు ఇటీవలే ప్రధాని మోదీ తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో పర్యటించారు. ఆ సమయంలో మోదీ అపాయింట్‌మెంట్ కోరుతూ ఓపీఎస్ ఒక లేఖ రాశారు. మోదీని కలుసుకోవడం తన వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. అపాయింట్మెంట్ కోసం అధికారికంగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ మోదీతో భేటీకి ఓపీఎస్‌కు అవకాశం కల్పించలేదు. ఈ పరిణామంపై ఓపీఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సర్వ శిక్షా అభియాన్ (SSA) నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందంటూ కేంద్రంపై మండిపడ్డారు. ఈ పరిణామం జరిగిన కొన్ని రోజులకే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగుతూ ఓపీఎస్ నిర్ణయించుకున్నారు. దీంతో, మోదీ కలవకపోవడంతో నొచ్చుకున్నారేమో అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Read Also- Rahul Gandhi: డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్ గాంధీ!
ఓపీఎస్ గతంలో ఏఐఏడీఎంకేలో కీలక నేతగా వ్యవహరించారు. ఎన్డీఏలో చేరి బీజేపీకి మిత్రపక్షంగా దగ్గరయ్యారు. అయితే, ఏఐఏడీఎంకేలో చోటుచేసుకున్న ఆధిపత్య పోరు కారణంగా తనసొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఎన్డీఏ నుంచి వైదొలగడంతో తమిళనాడులో పొలిటికల్ కూటములపై చర్చ మొదలైంది. ముఖ్యంగా, 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా పరిణామం ప్రభావం చూపవచ్చనే అంచనాలు, విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.