Bhadrachalam: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పట్టణంలోని ప్రైవేట్ లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు, అనైతిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల ముసుగులో పట్టణానికి వస్తున్న జంటలు ఈ లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది.
Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్
లాడ్జి సిబ్బంది బెదిరింపులు?
కొంతమంది లాడ్జి సిబ్బంది సైతం జంటలు సన్నిహితంగా ఉన్న సమయాల్లో రహస్యంగా వీడియోలు తీసి, వాటిని అడ్డుపెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) భద్రాచలం పట్టణంలో జరిగిన ఒక ఘటన దీనికి నిదర్శనం. సుమారు మూడు నెలల క్రితం పట్టణానికి చెందిన ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి దేవాలయం సమీపంలోని ప్రైవేట్ లాడ్జి(Private lodge)కి వెళ్లాడు. ఆ జంట సన్నిహితంగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రహస్యంగా వారిని చిత్రీకరించి, సదరు యువకుడిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు.
ఈ కేటుగాళ్లు ఇన్‌స్టాగ్రామ్(Instagram) అకౌంట్ ద్వారా యువకుడిని సంప్రదించి, “నీవు నీ లవర్‌తో ఉన్న వీడియోలు మా దగ్గర ఉన్నాయి” అంటూ బెదిరించారు. మూడు దఫాలుగా రూ. 60 వేల వరకు వసూలు చేశారు. అయితే, ఈసారి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన ఆ యువకుడు భద్రాచలం(Bhadrachalam) పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. భద్రాచలం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా సంప్రదించడం, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయడంతో నిందితులను గుర్తించడానికి సమయం పడుతుందని పోలీసులు తెలిపారు.
పర్యవేక్షణ లోపం..
రామాలయ పరిసర ప్రాంతాల్లోని అనేక ప్రైవేట్ లాడ్జీలు(Private lodge) ఇలా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిఘా వ్యవస్థ, పోలీసుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇకనైనా పోలీసులు వీరిపై ఉక్కుపాదం మోపి భద్రాచలం ప్రాంత విశిష్టతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పాడు పనులు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: Sleeping Prince: సౌదీ ప్రిన్స్ అల్‌వలీద్ బిన్ కన్నుమూత.. 2005లో ఏం జరిగింది?