Ind vs Pak WCL 2025: గత కొన్ని రోజులుగా ఉత్కంఠగా సాగుతున్న వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 తుదికి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెమీస్ లో పాకిస్థాన్ తో తలపడాల్సి ఉండగా.. భారత ఆటగాళ్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ ముష్కరులు జరిపిన పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack)ని ఖండిస్తూ.. ఆ దేశంలో సెమీస్ ఆడేందుకు నిరాకరించారు. దీంతో బుధవారం బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ మైదానంలో జరిగాల్సిన భారత్ – పాక్ సెమీస్ మ్యాచ్ రద్దయ్యింది. ఫలితంగా పాక్ WCL ఫైనల్స్ కు దూసుకెళ్లింది. అయితే దీనిపై స్పందిస్తూ భారత ఛాంపియన్స్ జట్టు వివరణ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
‘దేశమే తొలి ప్రాధాన్యం’
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ తో ఎలాంటి ద్వైపాక్షిక సంబంధాలు పెట్టుకోకూడదని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాక్ తో క్రీడా సంబంధాలు కూడా పెట్టుకోకూడదన్న విధానానికి అనుగుణంగా డబ్ల్యూసీఎల్ సెమీస్ మ్యాచ్ ను భారత్ బహిష్కరించింది. క్రీడల కంటే దేశభక్తి భావమే ముఖ్యమని భావించి.. తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత జట్టులోని ఓ ఆటగాడు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ‘మేము సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌తో ఆడము. మన దేశం, మన జాతికే మా తొలి ప్రాధాన్యం. భారతదేశం కోసం ఏదైనా చేస్తాము. మేము భారత జట్టులో సభ్యులమని గర్వంగా చెప్పుకుంటాం. భారత జెండా మా జెర్సీపై రావడానికి మేము ఎంతో శ్రమించి కృషి చేశాం. ఏ పరిస్థితుల్లోనూ దేశాన్ని నిరాశపరచం. భారత్ మాతా కి జై’ అని అతడు చెప్పుకొచ్చారు.
Also Read: AP Google Data Center: గూగుల్ నుంచి గుడ్ న్యూస్.. ఇక ఏపీ ప్రజల పంట పండినట్లే!
‘ఫైనల్‌కు ఇదే చేసేవాళ్లం’
డబ్ల్యూసీఎల్ సెమీస్ లో కాకుండా ఫైనల్లో పాక్ తో ఆడాల్సి వచ్చినా.. భారత ఆటగాళ్లు ఇదే నిర్ణయం తీసుకునేవారని సదరు ప్లేయర్ స్పష్టం చేశారు. ‘ఫైనల్‌లోకి వెళ్లి పాకిస్తాన్‌ను ఎదుర్కోవాల్సి వచ్చినా, మేమంతా అదే చేసేవాళ్లం. అందరం భారతీయులం కాబట్టి అందరం ఒకే అభిప్రాయంలో ఉన్నాం’ అని అతడు తెలిపారు. మరోవైపు WCL నిర్వాహకులు ఇండియా ఛాంపియన్స్ ఆటగాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తూ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితంగా పాకిస్తాన్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించినట్లు ఓ ప్రకటన రూపంలో తెలియజేశారు.
Semi – Finals Update ! pic.twitter.com/lTmh3j0sSP
— World Championship Of Legends (@WclLeague) July 30, 2025
డబ్ల్యూసీఎల్‌లో రెండోసారి..
డబ్ల్యూసీఎల్ లీగ్ దశలో భాగంగా పాక్ తో జరగాల్సిన మ్యాచ్ లోనూ ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో జులై 20న ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయ్యింది. తాజాగా సెమీస్ నుంచి కూడా వైదొలగడంత డబ్ల్యూసీఎల్ రెండుసార్లు పాక్ తో ఆడేందుకు భారత్ నిరాకరించినట్లైంది. ఇదిలా ఉంటే పహాల్గామ్ ఘటన ఏప్రిల్ 22న జరిగింది. ముష్కరులు జరిపిన దాడిలో 26 మంది అమాయక భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు చోటుచేసుకుననాయి. అప్పటి నుండి అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్ తో తలపడేందుకు భారత జట్టు ఇష్టపడటం లేదు.