Awareness on Tigers: పులుల సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని అటవీ దళాల ప్రధాన సంరక్షిణాధికారి డాక్టర్ సువర్ణ(Dr. Suvarna) అధికారులకు సూచించారు. పులుల సంరక్షణలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతీ ఏటా జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పులుల ఆవాసాల సంరక్షణ, విస్తరణకు ప్రజల మద్దతు అవసరమని, పులుల సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆమె వెల్లడించారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక పులి మీద అడవి, పర్యావరణం, ప్రకృతి, జంతుజాలం, గడ్డి భూములు, జీవవైవిధ్యం వంటివి ఆధారపడి ఉన్నందున, పులుల మనుగడ అనేది మానవాళి మనుగడకు కూడా ప్రధానమన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు.
Also Read: Congress – AIMIM: కాంగ్రెస్‌కు ఎంఐఎం బిగ్ ట్విస్ట్.. జూబ్లీహిల్స్ టిక్కెట్‌పై ఏఐసీసీ ఫైనల్ సర్వే
వన్యప్రాణుల సంరక్షణ
పెద్దపులుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లను చాలా బాగా నిర్వహించడం వల్ల పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో చేపడుతున్న అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చర్యలతో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. ప్రత్యేకించి అమ్రాబాద్ అడవుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగి 36కు చేరుకుందని తెలిపారు. తెలంగాణలో మెరుగైన అటవీ విస్తరణ, వేటకు తగిన సంఖ్యలో జంతువులు, నీటి వనరులు వంటివి ఉండడంతో పొరుగున మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబాల నుంచి పులులు ఇక్కడకు తరలి వస్తున్నాయని డాక్టర్ సువర్ణ అన్నారు.
పకడ్బందీ చర్యలు
గడ్డిభూముల పెంపకంతో శాకాహార జంతువుల సంఖ్య బాగా పెరగడం కూడా దీనికి దోహదపడుతుందని చెప్పారు. నేషనల్ కన్సర్వేషన్ అథారిటీ మాజీ సభ్యుడు అనూప్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పర్యావరణ వ్యవస్థలలో పులులు పోషించే కీలక పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈలు సింగ్ మేరు మాట్లాడుతూ.. వన్యప్రాణులు – మానవుల మధ్య సంఘర్షణ నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కవ్వాల్ టైగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతారాం, నాగర్ కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్ కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి వాటిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అటవీ అధికారి శంకరన్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఐటీ వింగ్ అధికారి జవహరి, టీజీఎఫ్డీసీ చైర్మన్ సునీత ఎం. భాగవత్, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ ఎస్జే ఆశ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Patan Cheruvu constituency: తగ్గనున్న ఎంపీటీసీల స్థానాలు.. ప్రభుత్వం గెజిట్