CM Revanth Reddy: జీహెచ్ఎంసీపై సీఎం రేవంత్ రెడ్డి నజర్ పెట్టినట్లు సమాచారం. బల్దియాలో అసలు ఏం జరుగుతుంది? ఇంకా కొత్త ప్రభుత్వం మార్క్ అభివృద్ది ఎందుకు ప్రారంభం కాలేదన్న విషయంపై ముఖ్యమంత్రి బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విభాగాల వారీగా సమీక్షించినట్లు సమాచారం. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరి సుమారు 17 నెలలు పూర్తవుతున్నా, ఒక్క పాతబస్తీలోని మెట్రోరైలు ప్రాజెక్టు మినహా మిగిలిన ప్రాంతాల్లో హెచ్ సిటీ-1 పనుల్లో భాగంగా ప్రతిపాదించిన పలు ఫ్లై ఓవర్లు, కేబీఆర్ చుట్టూ ప్రతిపాదించిన ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని సీఎం ఆరా తీసినట్లు సమాచారం.
కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్ సిటీ పనులు చేపట్టేందుకు వీలుగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు, టెండర్ ప్రక్రియలో పాల్గొన్న సంస్థల జాబితాను జీహెచ్ఎంసీ(GHMC) సీఎంకు సమర్పించినట్లు తెలిసింది. సిటీలో ట్రాఫిక్ సమస్య నివారణ కోసం మరిన్ని లింకు రోడ్లను బంజారాహిల్స్, నెక్లెస్ రోడ్‌లతో పాటు రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో కూడా అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లకు ప్రతిపాదనలను సిద్దం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు కేబీఆర్(KBR) పార్కు హెచ్ సిటీ పనులను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఇకపై ప్రతి మంగళవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖపై సమీక్ష ఉంటుందని సీఎం అధికారులకు సూచించినట్లు తెలిసింది.
Also Read:Kavitha: బీసీల కోసం ఆగస్టు 4 నుంచి 7వరకు దీక్ష చేస్తా
కాలుష్య రహిత హైదరాబాద్‌కు మరిన్ని సంస్కరణలు
ముఖ్యంగా నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్య సమస్యపైనే ఎక్కువ సేపు చర్చించినట్లు తెలిసింది. కాలుష్య రహిత హైదరాబాద్ నగరం సాధన కోసం మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నట్లు సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. కాలుష్య సమస్య నివారణకు సర్కారు కూడా అనేక మార్గాలను అన్వేషిస్తుందని, అందులో భాగంగానే సిటీలో ఎలక్ట్రిసిటీ బస్సులను అందుబాటులోకి తేవటంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తున్నామని సీఎం వెల్లడించినట్లు సమాచారం.
పర్యావరణ హితమైన మెట్రోరైలు కనెక్టివిటీని హైదరాబాద్(Hyderabad) చుట్టూ పెంచాలన్న సంకల్పంలో భాగంగా నార్త్ హైదరాబాద్(Hyderabad) లోని ప్యారడైజ్ శామీర్‌పేట, ప్యారడైజ్ టు మేడ్చల్ వరకు ప్రతిపాదించిన మెట్రోరైలు ప్రతిపాదనల ప్రగతిపై ప్రశ్నించినట్లు సమాచారం. సిటీలో పర్యావరణం, మానవాళి పరిరక్షణ కోసం కాలుష్య నివారణకు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశాలతో కూడిన నివేదికలను సమర్పించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. కాలుష్య నివారణ, ట్రాఫిక్ సమస్య నివారణకు ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టాలన్నా సర్కారు సిద్దంగా ఉన్నట్లు సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.
వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్‌లో కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఇందుకు సంబంధించి ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల్లో సమస్యలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా వెంటనే పరిష్కార మార్గాలను అన్వేషించాలని, దీంతో పాటు సిటీలో పెరుగుతున్న పట్టణీకరణ, జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని ఆదేశించారు.
డిఫెన్స్ భూముల బదలాయింపు
సికింద్రాబాద్(Secunderabad)ఏఓసీ ల్యాండ్ బదలాయింపు విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించినట్లు తెలిసింది. ఇప్పటికే రక్షణ శాఖకు చెందిన కీలకమైన అధికారులతో రెండు పర్యాయాలుగా సమావేశాలు నిర్వహించినట్లు, సుమారు 47 ఎకరాల భూమిని ఇతర ప్రాంతంలో తమకు కేటాయిస్తే చాలని రక్షణ శాఖ ఆఫీసర్లు క్లారిటీ ఇచ్చినట్లు మున్సిపల్ సెక్రెటరీ ఇలంబర్తి, కమిషనర్ కర్ణన్ సీఎంకు వివరించినట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని రక్షణ శాఖకు ప్రత్యామ్నాయంగా కేటాయించాల్సిన స్థలాల్ని అన్వేషించాలని సీఎం అధికారులకు సూచించినట్లు సమాచారం.
కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టాల్సిన హెచ్ సిటీ పనులకు సంబంధించి త్వరలోనే అగ్రిమెంట్ చేసుకుని ఫీల్డు లెవెల్‌లో పనులు చేపడుతామని అధికారులు సీఎంకు వివరించినట్లు తెలిసింది. స్థల సేకరణకు సంబంధించి కొందరు ఆస్తుల యజమానులు కోర్టును ఆశ్రయించినట్లు, లీగల్ సమస్యలను ఎదుర్కోనేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అధికారులు సీఎంకు వివరించినట్లు తెలిసింది. మరో రెండు నెలల్లో కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ పనులను ఫీల్డు లెవెల్‌లో ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు వివరించినట్లు సమాచారం.
ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సెక్రెటరీ మాణిక్ రాజ్, మున్సిపల్ కార్యదర్శి ఇలంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, ఎంఆర్ డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహ రెడ్డి, జేఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Kalpika controversy: మరోసారి వివాదం సృష్టించిన నటి కల్పిక..