Nimisha Priya Case: భారతీయ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. ఆమెకు విధించిన ఉరిశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు (Yemen officials) నిర్ణయించారు. నిమిషకు విధించిన మరణ శిక్షను వారు శాశ్వతంగా రద్దుచేసినట్లు భారత గ్రాండ్ ముఫ్తీ (Indian Grand Mufti), సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ (Kanthapuram AP Abubakker Musliyar) కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఫలించిన చర్చలు
నిమిష ప్రియకు విధించిన ఉరిశిక్ష అంశంపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ (Habib Omar bin Hafiz) ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు అబుబాకర్ ముస్లియార్.. యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. యెమెన్ రాజధాని సనాలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో జరిగిన చర్చలు ఫలించడంతో నిమిష ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం తెలిపింది. ఈ ప్రకటనను యెమెన్ లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్బాబి సైతం ధ్రువీకరించారు. కాగా ఈ సమావేశంలో యెమెన్ ధార్మిక పండితుల బృందం, ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నారు.
అసలు ఏంటీ వివాదం?
2008లో నిమిషా ప్రియా ఉద్యోగం కోసం యెమెన్ వెళ్లింది. నిమిషా ప్రియా యెమెన్‌లోని పలు ఆసుపత్రుల్లో పని చేసింది. ఆ తర్వాత, సొంతంగా క్లినిక్ ప్రారంభించింది. స్థానిక చట్టాల ప్రకారం, యెమెన్ పౌరుడు ఒకర్ని ఆమె క్లినిక్ నిర్వహణలో భాగస్వామిగా చేసుకోవాల్సి వచ్చింది. ఆ వ్యాపార భాగస్వామి పేరు తలాల్ అబ్దో మెహ్దీ (37). ఇతను నిమిషా ప్రియాను వేధింపులకు గురిచేశాడు. డబ్బులు తీసుకోవడమే కాదు, నిమిషా పాస్‌పోర్టును కూడా బలవంతంగా లాక్కొని అతడి వద్ద పెట్టుకున్నాడు.
Also Read: Divya – Darshan: హీరో ఫ్యాన్స్ నుంచి అత్యాచార బెదిరింపులు.. ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి!
అందుకే మరణ శిక్ష
తలాల్ నుంచి పాస్‌పోర్టు ఎలాగైన వెనక్కి తీసుకోవాలని భావించిన నిమిషా 2017లో తలాల్ అబ్దో మెహ్దీకి ఇంజెక్షన్ రూపంలో మత్తుమందు ఇచ్చింది. అతడు మత్తులోకి జారుకున్నాక పాస్‌పోర్టు తీసుకెళ్లాలని భావించింది. కానీ, దురదృష్టవశాత్తూ అతడు చనిపోయాడు. దీంతో, యెమెన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ నిమిషా ప్రియా అరెస్ట్ అయింది. స్థానిక చట్టాల ప్రకారం నిమిషాకు మరణశిక్ష పడింది. యెమెన్ సుప్రీంకోర్టు కూడా మరణ శిక్షను సమర్థించింది. ఆ తర్వాత, యెమెన్ అధ్యక్షుడు కూడా మరణశిక్షకు ఆమోదముద్ర వేశారు. మరణశిక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నీ తిరస్కరణకు గురయ్యాయి. జూలై 16న (బుధవారం) ఆమెను ఉరి తీసేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. నిమిష, బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని యెమెన్ ప్రభుత్వాన్ని భారత్ పలుమార్లు కోరడంతో జులై 16న అమలు కావాల్సిన మరణశిక్షను వాయిదా పడింది. అప్పటి నుంచి యెమెన్ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.