Parliament: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంపై పాకిస్థాన్‌పై భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంట్‌లో (Parliament) ప్రత్యేక చర్చ మొదలైంది. దేశ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ఈ అంశంపై చర్చను మొదలుపెట్టారు. యుద్ధభూమిలో వీరత్వాన్ని ప్రదర్శించిన భారత సైనికులకు రాజ్‌నాథ్ సింగ్ సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ఒక చారిత్రాత్మక సైనిక చర్య అని, ఉగ్రదానికి వ్యతిరేకంగా మన దేశ విధానాన్ని స్పష్టంగా, ప్రభావవంతంగా చూపించే చర్యగా ఆయన అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్‌ను అమలు పరచడానికి ముందు మన బలగాలు ప్రతి కోణాన్ని సూక్ష్మంగా పరిశీలించాయని, ఉగ్రవాదులకు ఎక్కువ నష్టం కలిగించే మార్గాన్ని సేనలు ఎంచుకున్నాయని ఆయన ప్రకటించారు.
మన సైనికులు ఎవరూ గాయపడలేదు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానాలు ఎన్ని కూలాయంటూ కొంతమంది విపక్ష సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు. వారి ప్రశ్న మన దేశ జాతీయ భావజాలాన్ని సవ్యమైన రీతిలో ప్రతిబింబించదని నాకు అనిపిస్తోంది. మన సేనలు శత్రువు విమానాలు ఎన్నింటిని కూల్చివేశాయని ఎందుకు ప్రశ్నించలేదు?. విపక్ష సభ్యులు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ఉండాల్సింది ఈ విధంగానే కదా?. ఉగ్రవాద కేంద్రాలను మన సేనలు ధ్వంసం చేశాయా? అని ఎందుకు ప్రశ్నించలేదు. ఈ ప్రశ్నకు సమాధానం అవును అని చెబుతున్నాను. ఇంకా, మీరు నిజాయితీగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఆపరేషన్ సిందూర్‌లో మన వీర జవాన్లకు ఏమైనా నష్టం జరిగిందా? అని అడగాలి. ఈ ప్రశ్నకు సమాధానం మన జవాన్లు ఎవరూ గాయపడలేదు’’ అని లోక్‌సభలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
విస్తరణవాద చర్యలకు పాల్పడలేదు
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ఆర్మీ ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదని, ఎలాంటి విస్తరణవాద చర్యలకు పాల్పడలేదని, అయినప్పటికీ 2025 మే 10న తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో భారత్‌పై పాకిస్థాన్ భారీ దాడిని ప్రారంభించిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆ దాడిలో మిస్సైళ్లు, డ్రోన్లు, రాకెట్లు, ఇతర దీర్ఘశ్రేణి ఆయుధాలు పాక్ సేనలు ఉపయోగించాయని ప్రస్తావించారు. ‘‘భారత్ చేపట్టిన చర్యలన్నీ పూర్తిగా ఆత్మరక్షణ కోణంలోనే సాగాయి. అవి రక్షణ కోసమే గానీ, ఆక్రమణ కోసం కాదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
Read Also- Gambhir: గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఓ ప్లేయర్‌పై గంభీర్ హాట్ కామెంట్స్
100 మంది ఉగ్రవాదులు మృతి
‘‘మన దేశ సాయుధ దళాలు సమన్వయంగా పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన దాడులు చేశాయి. ఈ ఆపరేషన్‌లో 100కి పైగా ఉగ్రవాదులు, వారి ట్రైనర్లు, హ్యాండ్లర్లు, సహచరులు హతమయ్యారని అంచనా వేశాం. ఈ ఉగ్రవాదులలో అత్యధికులు జైషే మొహమ్మద్ (JeM), లష్కరే తోయిబా (LeT), హిజ్బుల్ ముజాహిద్దీన్ (HM) వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నవారే’’ అని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.
పాక్ ఒక్క టార్గెట్‌ను తాకలేదు
పాకిస్థాన్ సేనలు మన దేశంలోని ఒక్క టార్గెట్‌ను కూడా తాకలేకపోయిందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. మన దేశానికి చెందిన కీలకమైన ఏ ఆస్తులూ దెబ్బతినలేదని వివరించారు. మన భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉన్నాయని, పాక్ చేసిన ప్రతి దాడిని సమర్థంగా అడ్డుకున్నామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ‘‘మన దేశానికి ఉన్న వాయుసేన రక్షణ వ్యవస్థ, కౌంటర్-డ్రోన్ సిస్టమ్ వల్ల పాకిస్థాన్ చేసిన ప్రతి దాడి ప్రయత్నాన్ని పూర్తిగా భగ్నం చేయగలిగాం. సమర్థవంతమైన మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వినియోగించడంతో పాక్ పూర్తిగా విఫలమైంది. వారు మన దేశంలోని లక్ష్యాలను ఒక్కటి కూడా తాకలేకపోయారు’’ అని ఆయన వివరించారు.
ఎవరి ఒత్తిడికీ తలొగ్గలేదు
పాకిస్థాన్‌లోని లక్ష్యాలను సాధించిన తర్వాత దాడులను ఆపివేశామని లోక్‌సభకు రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ‘‘మన రాజకీయ, సైనిక లక్ష్యాలు ముందుగానే నిర్ణయించాం. అవి సంపూర్ణంగా సాధించిన తర్వాతే మన దళాలు దాడులను నిలిపివేశాయి. ఒత్తిడికి లోనై ఆపరేషన్ సిందూర్ నిలిపివేశారనే వాదన పూర్తిగా అసత్యం. పూర్తిగా తప్పు. నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడకూడదనే ప్రయత్నిస్తాను’’ అంటూ రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో ఎస్-400, ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థలను ఉపయోగించినట్టు వెల్లడించారు. ‘‘పాకిస్థాన్ దాడులను సమర్థంగా అడ్డుకోవడంలో ఎస్-400, ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ గన్స్ కీలక పాత్ర పోషించాయి. ఈ అత్యాధునిక ఆయుధ వ్యవస్థల సాయంతో మన దళాలు పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టాయి’’ ఆయన వివరించారు.
Read Also- Gambhir: గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఓ ప్లేయర్‌పై గంభీర్ హాట్ కామెంట్స్
పాక్ సంప్రదించడంతోనే నిలిపివేత
దాడులను ఆపాలంటూ పాకిస్థాన్ డీజీఎంవో భారత్‌ను సంప్రదించి, దాడులను ఆపాలని విన్నవించారని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ‘‘మే 10న పాక్ ఎయిర్‌ఫీల్డ్స్‌పై భారత వాయుసేన దాడులు జరిపిన సమయంలో, పాకిస్థాన్ సైనిక ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (DGMO) భారత డీజీఎంఓను సంప్రదించింది. దాడులు ఆపాలని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను మేము స్వీకరించాం. తాత్కాలికంగా నిలిపివేయడమేనన్న షరతుతో మాత్రమే అంగీకరించాం. మే 10న తమ ఎయిర్‌బేస్‌లపై భారత వాయుసేన దాడులు చేసిన తర్వాత పాకిస్థాన్ ఓటమిని అంగీకరించింది. దాడి చర్యలు నిలిపేయాలని వారు ప్రతిపాదించారు. ఆపరేషన్‌ను పూర్తిగా ముగించడం కాదు, కేవలం తాత్కాలిక విరామం మాత్రమే అని వాళ్లకు స్పష్టంగా చెప్పాం. భవిష్యత్తులో పాక్ నుంచి ఉగ్రచర్యలు పునరావృతమైతే ఈ ఆపరేషన్ వెంటనే తిరిగి ప్రారంభమవుతుంది’’ అని లోక్‌సభ వేదికగా రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
పాకిస్థాన్ కొన్నేళ్లుగా పెంచిపోషించిన ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నాశనం చేయడమే మన దేశం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించడానికి రాజకీయ-సైనిక లక్ష్యమని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ‘‘యుద్ధం ప్రారంభించేందుకు కాదు. శత్రువుని తలదించుకునేలా చేయడం కోసం. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం భూభాగాలు ఆక్రమించడానికి కాదు. సరిహద్దు దాటి వెళ్లడం, భూభాగాలు ఆక్రమించడం లక్ష్యం కాదు. అందుకే, టార్గెట్లు ఎంచుకోవడంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం ’’ అని వివరించారు.
సుదర్శన చక్రాన్ని చేతపట్టాం
‘‘ధర్మరక్షణ కోసం సుదర్శన చక్రాన్ని చేతపట్టాల్సిందేనని శ్రీకృష్ణుడు సూచించాడు. 2006లో పార్లమెంట్‌పై దాడిని చూశాం, 2008లో ముంబై ఉగ్రదాడిని చూశాం. ఇక చాలు అన్న భావనతో సుదర్శన చక్రాన్ని చేతపట్టాం. శాంతి కోసం ప్రయత్నించడమూ తెలుసు. దుర్మార్గులు అర్థం చేసుకునే భాషలో మాట్లాడటం కూడా తెలుసు’’ రాజ్‌నాథ్ హెచ్చరించారు. పాక్ తిరిగి దుస్సాహసానికి పాల్పడితే మళ్లీ దాడి చేస్తామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ‘‘ఆపరేషన్ సిందూర్ పూర్తవ్వలేదు. తాత్కాలికంగా నిలిచింది. భవిష్యత్తులో పాకిస్థాన్ ఏవిధమైన దురాక్రమణ చర్యకు పాల్పడినా తిరిగి దాడులు ప్రారంభిస్తాం. మన స్థాయిలో ఉన్నవారితోనే యుద్ధం ఉండాలి. గోస్వామి తులసీదాస్ చెప్పినట్టుగా ప్రేమ అయినా, శత్రుత్వం అయినా సమాన స్థాయిలో ఉండాలి. సింహం వెళ్లి ఒక తేనెటీగను చంపితే దానికి అర్థం ఉండదు. మన బలగాలు సింహాలు’’ అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవు
ఉగ్రవాదం, చర్చలు కలిసి కొనసాగవని పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘పాకిస్థాన్‌తో శాంతిని పున: స్థాపించేందుకు కేంద్రం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే, 2016లో సర్జికల్ స్ట్రైక్, 2019 బలాకోట్ ఎయిర్‌స్ట్రైక్, 2025 ఆపరేషన్ సిందూర్ ద్వారా శాంతి స్థాపనకు నూతన మార్గాన్ని ఎంచుకున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వైఖరి చాలా స్పష్టంగా ఉంది. చర్చలు, ఉగ్రవాదం కలిసి నడవవు’’ అని అన్నారు.