Acne Itching: వర్షాకాలం (Monsoon)లో ఉండే విభిన్నమైన వాతావరణ పరిస్థితులు చర్మ సమస్యలకు (Skin Conditions) దారితీస్తుంటాయి. తేమ వాతావరణం కారణంగా చాల మందికి ముఖ్యంగా స్త్రీలకు ముఖంపై మెుటిమలు (Acne) కనిపిస్తుంటాయి. అయితే ఆ మెుటిమలు మరీ దురదగా ఉంటే అది ఫంగల్ యాక్నే (Fungal Acne) కావచ్చని చర్మవ్యాధి నిపుణులు తెలిపారు ఇంతకీ ఫంగల్ యాక్నే అంటే ఏంటి? ఫంగల్ మెుటిమలకు సాధారణ మెుటిమలకు మధ్య తేడాను ఏ విధంగా గుర్తించాలి? చికిత్స మార్గాలు ఏవి? వంటి అంశాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఫంగల్ యాక్నే అంటే ఏమిటి?
ఫంగల్ యాక్నేను మలస్సీజియా ఫోలిక్యులైటిస్ (Malassezia folliculitis) లేదా పిటిరోస్పోరం ఫోలిక్యులైటిస్ అని కూడా పిలుస్తారు. ఇది చర్మంపై సహజంగా ఉండే మలస్సీజియా ఈస్ట్ (yeast) అధికంగా పెరిగినప్పుడు ఏర్పడే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది జుట్టు కుదుళ్లలో (hair follicles) సంభవిస్తుంటుంది. ఇది సాధారణ యాక్నే లాగా కనిపిస్తుంది కానీ దీని చికిత్స పూర్తిగా భిన్నంగా ఉంటాయి.
ఫంగల్ మెుటిమల లక్షణాలు
ఫంగల్ యాక్నే చిన్న (1-2 మి.మీ), ఎరుపు లేదా చర్మపు రంగులో ఉండే బుడిపెలను కలిగి ఉంటుంది. ఇవి ఒకే పరిమాణంలో ఉండటంతో పాటు ఆకారంలో గుండ్రంగా ఉంటాయి. అయితే దురద పుట్టడం.. ఫంగల్ యాక్నే యొక్క ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. దాదాపు 65% మందిలో ఈ దురద ఉంటుంది. ఈ లక్షణం సాధారణ మెుటిమల్లో కనిపించదు. ఫంగల్ మెుటిమలు.. ఛాతీ, వీపు, భుజాలు, కొన్నిసార్లు నుదురు, బుగ్గలు లేదా గడ్డంపై కనిపిస్తాయి. సాధారణ యాక్నేలో బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ లేదా పెద్ద కురుపులు కనిపిస్తాయి.
సాధారణ యాక్నేతో తేడాలు
సాధారణ యాక్నే కటిబాక్టీరియం యాక్నెస్ (Cutibacterium acnes) బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతుంది. ఫంగల్ యాక్నే మలస్సీజియా ఈస్ట్ వల్ల ఏర్పడుతుంది సాధారణ యాక్నేలో బుడిపెలు వివిధ పరిమాణాలు మరియు రకాలలో (బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, కురుపులు) కనిపిస్తాయి. కాస్త నొప్పిగానూ బాధాకరంగా ఉండవచ్చు. కానీ దురద ఉండదు. ఫంగల్ యాక్నే ఒకేలా ఉండే బుడిపెలను కలిగి ఉండటంతో పాటు దురదగా కూడా ఉంటుంది. సాధారణ యాక్నే సాలిసిలిక్ యాసిడ్ లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి చికిత్సలకు స్పందిస్తుంది. కానీ ఇవి ఫంగల్ యాక్నేను మరింత తీవ్రతరం చేయవచ్చు.
ఫంగల్ యాక్నేకు కారణాలు
వేడి, తేమ లేదా అధిక చెమట ఉన్న వాతావరణంలో ఫంగల్ యాక్నేకు కారణమయ్యే ఈస్ట్ అధికంగా పెరుగుతుంది. చెమటను బంధించే బిగుతైన లేదా గాలి ఆడని బట్టలు ధరించడం, యాంటీబయోటిక్స్ చర్మంపై మంచి బ్యాక్టీరియాను తగ్గించి, ఈస్ట్ అధికంగా పెరగడానికి దారితీస్తాయి. జిడ్డు చర్మం కూడా ఈస్ట్ ఉత్పత్తికి దారితీస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో ఈస్ట్ అధికంగా పెరిగే అవకాశం ఉంది.
Also Read: Ilaiyaraaja: మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు!
చికిత్స విధానం
ఫ్లూకోనజోల్ లేదా ఇట్రాకోనజోల్ వంటి ఓరల్ యాంటీఫంగల్ మందులు లేదా కీటోకానజోల్, క్లోట్రిమజోల్ వంటి క్రీములు ఫంగల్ యాక్నే చికిత్సకు ఉపయోగిస్తారు. అలాగే చెమటతో తడిసిన బట్టలను వెంటనే మార్చడం, గాలి ఆడే బట్టలు ధరించడం, జిడ్డు స్కిన్‌కేర్ ఉత్పత్తులను నివారించడం వంటివి కూడా ఫంగల్ యాక్నేను అడ్డుకుంటాయి. కీటోకానజోల్ లేదా సెలీనియం సల్ఫైడ్ ఉన్న షాంపూలను బాడీ వాష్‌గా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.